Vijayasai Reddy : ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అంటే.. చాముండేశ్వరి నాథ్, గోకరాజు గంగరాజు వంటి వారి పేరే వినిపించేది. అసలు ఏసీఏలో రాజకీయ ప్రమేయం ఉండేది కాదు. కానీ వైసీపీ వచ్చిన తర్వాత సీన్ మారింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ లోకి వైసిపి నేతలు ప్రవేశించారు. ముఖ్యంగా విజయసాయిరెడ్డి ఎంటర్ అయ్యారు. తన బంధువులతో ఏసీఏను భర్తీ చేశారు. వైసీపీ కీలక నేతల సిఫారసుల మేరకు ఏసీఏ వ్యవహరించేది. అడ్డగోలు గలీజ్ వ్యవహారాలకు అడ్డాగా మారింది. దీనిపై విమర్శలు వ్యక్తమైనా అప్పటి వైసిపి సర్కార్ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఏసీఏ ప్రక్షాళనకు నడుం బిగించింది.
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కు ఇప్పటివరకు విజయసాయిరెడ్డి అల్లుడు సోదరుడు అరబిందో శరత్ చంద్రారెడ్డి, విజయ సాయి సొంత అల్లుడు రోహిత్ రెడ్డి అధ్యక్ష ఉపాధ్యక్షులుగా ఉన్నారు. గోపీనాథ్ రెడ్డి అనే వ్యక్తితో ఏసీఏ వ్యవహారాలను నడిపించేవారు విజయసాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పావులు కదపడం ప్రారంభించింది. ఎపెక్స్ కౌన్సిల్ మొత్తం రాజీనామా చేసే యోచనలో ఉంది. 21న జరగనున్న సమావేశంలో సామూహిక రాజీనామాలు చేయనున్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ను రాజకీయం చేసిన ఘనత మాత్రం విజయసాయిరెడ్డిదే. గతంలో రాజకీయాలకు సంబంధం లేని వారు, క్రీడాభిమానులు మాత్రమే అసోసియేషన్ లో భాగస్వామ్యం అయ్యేవారు. కానీ జగన్ సీఎం అయ్యాక సాయి రెడ్డి విశ్వరూపం చూపించారు. అసోసియేషన్ నుంచి అందర్నీ వెళ్ళగొట్టారు. తన అల్లుడితోపాటు ఆయన సోదరుడిని కీలక స్థానాల్లో కూర్చోబెట్టారు. తన బినామీ గా ఉన్న వ్యాపారి గోపీనాథ్ రెడ్డితో క్రికెట్ వ్యాపారం మొదలుపెట్టారు.
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కు దండిగా ఆదాయం వచ్చేది. అలా వచ్చిన ఆదాయాన్ని సాయి రెడ్డి, గోపీనాథ్ రెడ్డి వాటాలు పంచుకునేవారు. వీరు ఏసీఏను చేతుల్లోకి తీసుకోకముందు 120 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండేవి. ఇప్పుడు 20 కోట్ల రూపాయలు కూడా లేవని తెలుస్తోంది. అడ్డగోలుగా వాటిని ఖర్చు పెట్టేశారు. రంజీ క్రీడాకారుల ఎంపికలో నిబంధనలు పాటించలేదు. అంతర్జాతీయ మ్యాచ్ లు నిర్వహించినప్పుడు బ్లాక్ టికెట్ల దందాతో దోచుకునేవారు. ఏసీబీ నిధులను కడప, పులివెందులలో 50 కోట్ల వరకు ఖర్చు పెట్టారు.
హనుమ విహారి ఉదంతం గుర్తుంది కదూ. ఏసీఏలో ఎంత ఘోరమైన పరిస్థితులు ఉంటాయో హనుమ విహారి ఎపిసోడ్ తెలియజేస్తోంది. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన ఆయనను 17 నెంబర్ ఆటగాడితో తిట్టించారు. చివరికి జట్టు నుంచి వెళ్లిపోయేలా వేధించారు. ఆ ఆటగాడు వైసీపీ లీడర్ కొడుకు. పోనీ విహారి వేరే రాష్ట్రంలో ఆడడానికి ఎన్వోసీ అడిగినా ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఇచ్చారు. అయితే ఈ నిర్వాకాలన్నీ బయటపడటంతో కేసులు చుట్టుముడతాయని, జైలు తప్పదన్న భయంతో అపెక్స్ కమిటీ సభ్యులు రాజీనామాకు సిద్ధపడుతున్నారు. మొత్తానికి అయితే విజయసాయి రెడ్డికి బ్యాక్ టైమ్ నడుస్తున్నట్లే.
మరోవైపు ఏసీ ఏ కొత్త చీఫ్ గా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఎంపికకు దాదాపు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయనకు క్రికెట్ అసోసియేషన్ లతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన అయితే కొత్త అధ్యక్షుడిగా బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. క్రికెట్ అసోసియేషన్ క్లబ్బులతో పాటు జిల్లా కార్యవర్గాల నుంచి అనూహ్య మద్దతు వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో శివనాధ్ ఎంపిక లాంఛనమేనని సమాచారం.