Team India Vice Captain: క్రికెట్ అనేది సమష్టిగా ఆడాల్సిన ఆట. ఆటగాళ్లందరినీ కెప్టెన్ సమన్వయం చేస్తూ ఉంటాడు. కెప్టెన్ తో పాటు వైస్ కెప్టెన్ కూడా ఉంటాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు.. వాటిని పరిష్కరించే క్రమంలో సారధి ఇబ్బంది పడుతున్నప్పుడు తన వంతు బాధ్యతగా వైస్ కెప్టెన్ సలహాలు, సూచనలు ఇస్తుంటాడు. బౌలింగ్ కూర్పు విషయంలో, బ్యాటింగ్ విషయంలో కూడా ముఖ్యభూమిక పోషిస్తుంటాడు.
టీమిండియాలో కెప్టెన్లకు, వైస్ కెప్టెన్లకు ఒకప్పుడు విపరీతమైన ప్రాధాన్యం ఉండేది. కానీ ఇటీవల కాలంలో వైస్ కెప్టెన్ పాత్ర కూరలో కరివేపాకు మాదిరిగా మారిపోయింది. టీమిండియాలో పేరుకు మాత్రమే వైస్ కెప్టెన్ ను ప్రకటిస్తున్నారు. అంతేతప్ప మైదానంలో వ్యూహాలు అమలు చేయడంలో వైస్ కెప్టెన్ కీలక పాత్ర పోషించడం లేదు. వైస్ కెప్టెన్ పాత్ర ఎక్స్ ట్రా ఫింగర్ గా మారిపోయింది. ఒక సిరీస్ కు జట్టును ఎంపిక చేసే క్రమంలో.. వైస్ కెప్టెన్ ను కూడా ప్రకటిస్తున్నారు. ఆ సిరీస్ లో వైస్ కెప్టెన్ గనక విఫలమైతే అతడి స్థానానికి జట్టులో గ్యారంటీ ఉండడం లేదు. అందువల్లే టీమిండియాలో వైస్ కెప్టెన్లు గా నియమితులైన వారు ఎటువంటి వ్యూహాలలో తల దూర్చడానికి ఆసక్తిని ప్రదర్శించడం లేదు.
ప్రతి సిరీస్లో మేనేజ్మెంట్ వైస్ కెప్టెన్లను మార్చేస్తోంది. మూడు ఫార్మాట్లకు మూడు జట్లు.. అదేవిధంగా కెప్టెన్లు వంటి సంప్రదాయాన్ని మేనేజ్మెంట్ మొదలుపెట్టిందో.. అప్పటినుంచి వైస్ కెప్టెన్ల విషయంలో కూడా ఇలానే వ్యవహరిస్తోంది. ఉదాహరణకు టి20 జట్టును తీసుకుంటే.. ఇటీవల కాలంలో చాలామంది వైస్ కెప్టెన్లు మారిపోయారు. వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసే జట్టుకు అక్షర్ పటేల్ ను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. అంతకుముందు సౌత్ఆఫ్రికా లో జరిగిన సిరీస్లో గిల్ వైస్ కెప్టెన్ అయ్యాడు. అంతకుముందు హార్దిక్ పాండ్యా.. అతని తర్వాత శ్రేయస్ అయ్యర్.. కొద్దిరోజులు రవీంద్ర జడేజా.. సంజు శాంసన్ వైస్ కెప్టెన్లుగా పని చేశారు.
టి20 లలో పరిస్థితి అయోమయంగా ఉంటే.. ఇక సుదీర్ఘ ఫార్మాట్లో అయితే మరింత దారుణంగా ఉంది. కొన్ని సందర్భాలలో జట్టుకు ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు కూడా వైస్ కెప్టెన్ గా వ్యవహరించే సందర్భాలు ఉన్నాయి. మూడు సంవత్సరాల నుంచి పరిశీలిస్తే గిల్, రాహుల్ , బుమ్రా, జడేజా, రిషబ్ పంత్, రహనే, పూజార వంటి వారు ఉపసారదులుగా వ్యవహరించారు. అయితే వన్డే విషయంలో మాత్రం మేనేజ్మెంట్ ఎందుకు కాస్త పద్ధతిని పాటిస్తోంది. సుదీర్ఘకాలం రోహిత్ శర్మ వన్డే ఫార్మాట్లో సారథిగా ఉన్నాడు. అతడికి డిప్యూటీలుగా కేఎల్ రాహుల్, గిల్, పంత్ వంటి వారు వ్యవహరించారు. ఇక ప్రస్తుతం టీమిండియా కు వన్డే సారధిగా గిల్ వ్యవహరిస్తున్నాడు. అతడికి ఉపసారథిగా అయ్యర్ కొనసాగుతున్నాడు. ఇక టెస్ట్ ఫార్మేట్ లో సారధిగా ఉండగా.. అతడికి ఉపసారథిగా రిషబ్ పంత్ కొనసాగుతున్నాడు. ఇక ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన సిరీస్లో రిషబ్ పంత్ గైర్హాజరు కావడంతో.. ఉపసారథిగా రవీంద్ర జడేజా వ్యవహరించాడు.