Venkatesh Iyer: సొంత మైదానంలో ఓడిపోవడంతో సహజంగానే కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు పై ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తో జరిగిన మ్యాచ్ లో సత్తా చాటాలని కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ముందుగానే నిర్ణయించుకుంది.. కానీ గురువారం నాటి మ్యాచ్ లో కోల్ కతా 106 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో వెంకటేష్ అయ్యర్ (60), రింకూ సింగ్(32) ఐదో వికెట్ కు 91 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇది కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు సంజీవని లాగా నిలిచింది. వీరిద్దరు గనక నిలబడకపోయి ఉంటే.. వెంకటేష్ అయ్యర్ హైదరాబాద్ బౌలర్లపై ఎదురు దాడికి దిగకపోయి ఉంటే మ్యాచ్ స్వరూపం మరో విధంగా ఉండేది. ముఖ్యంగా వెంకటేష్ అయ్యర్ అసాధారణ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. అందువల్లే కోల్ కతా 200 పరుగులు చేసింది.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై మెరుగైన రికార్డు ఉన్న వెంకటేష్ అయ్యర్.. గతంలోనూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. గత సీజన్లో జరిగిన క్వార్టర్ ఫైనల్ లో హైదరాబాద్ జట్టుపై వెంకటేష్ అయ్యర్ 28 బంతుల్లోనే 51* పరుగులు చేశాడు. ఫైనల్ మ్యాచ్లో 26 బంతుల్లో 52* పరుగులు చేశాడు. ఇక ఈ సీజన్లో గురువారం జరిగిన మ్యాచ్లో 29 బంతుల్లో 60 పరుగులు చేశాడు. వాస్తవానికి గత సీజన్లో జట్టును విజేతగా నిలిపిన శ్రేయస్ అయ్యర్ కంటే వెంకటేష్ అయ్యర్ మీదే షారుక్ ఖాన్ ఆసక్తి చూపి.. రిటైన్ చేసుకున్నాడు అంటే.. అతని ఆట తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Also Read: పాపం కావ్య పాప.. బిక్క ముఖంతో.. గుండెలు తరుక్కుపోతున్నాయ్ రా..
ఫామ్ లోకి వచ్చాడు
బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో 6 పరుగులు మాత్రమే చేశాడు వెంకటేష్ అయ్యర్. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు. అయితే హైదరాబాద్ జట్టు తో జరిగిన మ్యాచ్లో మాత్రం ఒకసారిగా ఫామ్ లోకి వచ్చాడు. హైదరాబాద్ బౌలర్లను చీల్చి చెండాడుతూ పరుగుల వరద పారించాడు.. వాస్తవానికి గత ఏడాది జరిగిన మెగా వేలంలో వెంకటేష్ అయ్యర్ ను కోల్ కతా యాజమాన్యం వదిలేసుకుంటుందనే వార్తలు వచ్చాయి. కాని షారుక్ ఖాన్ అలా చేయలేదు. అతడిని ఏకంగా 23.75 కోట్లకు కొనుగోలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అయితే వెంకటేష్ అయ్యర్ కు అంత ధర ఎందుకు అని చాలామంది విమర్శించారు.. కానీ అతడు ఎంతటి విలువైన ఆటగాడో హైదరాబాద్ జట్టుతో గురువారం జరిగిన మ్యాచ్ ద్వారా తెలిసింది.. హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో వెంకటేష్ అయ్యర్ 29 బంతుల్లోనే మూడు సిక్సర్లు, 7 ఫోర్ల సహాయంతో 60 పరుగులు చేశాడు. ప్రారంభంలో నిదానంగా ఆడిన వెంకటేష్ అయ్యర్ ఆ తర్వాత దూకుడుగా ఆడాడు. హైదరాబాద్ జట్టుపై ఆడిన తొమ్మిది మ్యాచ్లలో వెంకటేష్ అయ్యర్ 152 స్ట్రైక్ రేట్ తో 208 పరుగులు చేశాడు. గురువారం జరిగిన మ్యాచ్లో తొలి పది బంతుల్లో అయ్యర్ 11 పరుగులు చేశాడు. 11 నుంచి 20 బంతుల్లో 19 పరుగులు పిండుకున్నాడు. 21 నుంచి 29 బంతుల మధ్య 30 రన్స్ చేశాడు. చివరగా అతడు చేసిన 30 పరుగులు మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాయి. అందువల్లే కోల్ కతా నైట్ రైడర్స్ ఆ స్థాయిలో పరుగులు చేయగలిగింది.