Champions trophy 2025 Bumrah : బుమ్రా ఆస్ట్రేలియా సిరీస్ లో వెన్ను నొప్పికి గురయ్యాడు. ఆ నొప్పి తీవ్రంగా ఉండడంతో చివరికి సిడ్నీ టెస్ట్ కి కూడా దూరమయ్యాడు. వెన్ను నొప్పితో బాధపడుతున్న అతడిని జాతీయ క్రికెట్ అకాడమీలో బీసీసీఐ వైద్యులు చేర్పించారు. వాస్తవానికి అతడు ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న ప్రస్తుత వన్డే సిరీస్లో ఆడాల్సి ఉంది. అయితే వెన్నునొప్పి తగ్గకపోవడంతో అతడిని ఎంపిక చేయలేదు. చివరికి ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అతడు ఆడేది అనుమానమేనని నిన్నటిదాకా వార్తలు వచ్చాయి.. ఇప్పుడు అవి నిజమయ్యాయి. ఎందుకంటే బుమ్రా వెన్నునొప్పి ఇంకా తగ్గలేదు. పైగా అతడు పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని సాధించలేకపోతున్నాడు. దీంతో అతడిని చాంపియన్స్ ట్రోఫీ నుంచి తొలగిస్తున్నట్టు బీసీసీఐ సెలక్షన్ కమిటీ స్పష్టం చేసింది.
అతడి స్థానంలో వాళ్లు
బుమ్రా కు వెన్ను నొప్పి తగ్గకపోవడంతో అతడిని చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయలేదని బీసీసీ సెలక్షన్ కమిటీ పేర్కొంది. బుమ్రా స్థానంలో హర్షిత్ రాణా ను ఎంపిక చేసినట్టు వెల్లడించింది. యశస్వి జైస్వాల్ స్థానంలో వరుణ్ చక్రవర్తిని సెలెక్ట్ చేసింది. యశస్వి జైస్వాల్, మహమ్మద్ సిరాజ్, శివమ్ దూబే వంటి ఆటగాళ్లు నాన్ ట్రావెలింగ్ సబ్ స్టిట్యూట్స్ గా ఉంటారని బిసిసిఐ సెలక్షన్ కమిటీ స్పష్టం చేసింది. జట్టు అవసరాల దృష్ట్యా అవసరమైనప్పుడు వారు దుబాయ్ వెళ్తారని బిసిసిఐ సెలక్షన్ కమిటీ అధికారులు పేర్కొన్నారు. వరుణ్ చక్రవర్తి మిస్టీరియస్ స్పిన్ బౌలర్ గా పేరుపొందాడు. ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టి20 సిరీస్లో అదరగొట్టాడు. ఏకంగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ పురస్కారాన్ని అందుకున్నాడు. ఈ క్రమంలో అతడు ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీలో చోటును దక్కించుకున్నాడు. ఇక హర్షిత్ రాణా కూడా వేగంగా బంతులు వేస్తున్నాడు బంతిపై సరైన స్థాయిలో పట్టును కలిగి ఉంటున్నాడు. అయితే వీరిద్దరితోపాటు మిగతా ఆటగాళ్లు కూడా దుబాయ్ వేదికగా టీమిండియా ఆడే మ్యాచ్లలో సత్తా చాటుతారని బీసీసీ సెలక్షన్ కమిటీ భావిస్తోంది. మరోవైపు మహమ్మద్ షమీ, అర్ష్ దీప్ సింగ్ లాంటి బౌలర్లు కూడా జట్టులోకి రావడంతో పట్టిష్టంగా కనిపిస్తోంది.
ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే టీమిండియా ఇదే
రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, హర్షిత్ రాణా, అర్ష్ దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కులదీప్ యాదవ్, మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజా.