IND Vs BAN T20 Match : గ్వాలియర్ మైదానం వేదికగా ఆదివారం బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన తొలి t20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో భారత స్పిన్ బౌలర్ వరుణ్ చక్రవర్తి సత్తా చాటాడు.. మూడు సంవత్సరాల తర్వాత జట్టులోకి ఎంట్రీ ఇచ్చి.. తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు.. ఇటీవల తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో సరికొత్త బౌలింగ్ తో ఆకట్టుకున్న వరుణ్ చక్రవర్తి.. బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లోనూ అదే మాయాజాలాన్ని ప్రదర్శించాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో వరుణ్ చక్రవర్తిని రవిచంద్రన్ అశ్విన్ ప్రోత్సహించాడు. అతడు ఇచ్చిన ప్రోత్సాహంతో వరుణ్ చక్రవర్తి మరింతగా రాటుదేలాడు. ఫలితంగా బంగ్లా జట్టు టాప్ ఆర్డర్ వరుణ్ చక్రవర్తి ధాటికి తీవ్రంగా ఇబ్బంది పడింది.. అందువల్లే వారి స్కోర్ చేయలేకపోయింది. 127 పరుగులకే కుప్పకూలింది. వరుణ్ చక్రవర్తి తర్వాత, అర్ష్ దీప్ సింగ్ కూడా మూడు వికెట్లను నేలకూల్చాడు.
పునర్జన్మ లాగా అనిపించింది
ఈ మ్యాచ్ తర్వాత వరుణ్ చక్రవర్తి భావోద్వేగానికి గురయ్యాడు. ” జట్టులోకి పునరాగమనం చేయడం గొప్పగా అనిపించింది. ఇది నాకు పునర్జన్మ. భావోద్వేగమైన క్షణం. తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో నాకు అవకాశం లభించింది. నన్ను నేను గొప్పగా మలుచుకునేందుకు రవిచంద్రన్ అశ్విన్ అనేక అవకాశాలు ఇచ్చాడు. ఆయనకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతున్నాను. మూడు సంవత్సరాల తర్వాత జట్టులోకి రావడం గొప్పగా అనిపిస్తోంది. ఇదే ప్రదర్శనకు నేను కట్టుబడి ఉంటాను. భవిష్యత్తు కాలంలో మరింత మెరుగైన బౌలింగ్ చేయాలని భావిస్తున్నాను. ఐపీఎల్ తర్వాత నేను చాలా టోర్నమెంట్లు ఆడాను. అందులో తమిళనాడు ప్రీమియర్ లీగ్ ఒకటి. తమిళనాడు ప్రీమియర్ లీగ్ సమయంలో భారత లెజెండ్రీ స్పిన్నర్ అశ్విన్ తో కలిసి పనిచేయడం నాకు బాగా ఉపకరించింది. నా మనోధైర్యాన్ని పెంచింది. అశ్విన్ తో కలిసి పని చేసిన జట్టు ఛాంపియన్ గా నిలిచిందని” వరుణ్ చక్రవర్తి వ్యాఖ్యానించాడు.
కాగా, గ్వాలియర్ వేదికగా జరిగిన తొలి టి20 బంగ్లా జట్టు 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆల్ అవుట్ అయింది. బంగ్లా ఆటగాడు హసన్ మిరాజ్ 35 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, అర్ష్ దీప్ సింగ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ఇక బంగ్లా విధించిన 128 పరుగుల లక్ష్యాన్ని భారత్ 11.5 ఓవర్లలో చేదించింది. భారత ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యా 39, సంజు సాంసన్, సూర్య కుమార్ యాదవ్ 29 పరుగులు చేశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అర్ష్ దీప్ సింగ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.