Vaibhav Suryavanshi : అండర్ 19 ఆసియా కప్ -24 హోరా హోరిగా సాగుతోంది. పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత ఆటగాడు, ఇటీవల ipl మెగా వేలంలో సంచలనం సృష్టించిన వైభవ్ సూర్య వంశీ దారుణంగా విఫలమయ్యాడు. ఓపెనర్ గా మైదానంలోకి వచ్చిన ఇతడు.. 9 బంతులు ఎదుర్కొని.. ఒకే ఒక పరుగు చేశాడు. పాకిస్తాన్ బౌలర్ అలీ రాజా బౌలింగ్ లో వికెట్ కీపర్ సాద్ బేగ్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఇటీవల నిర్వహించిన ఐపీఎల్ మెగా వేలంలో వైభవ సూర్యవంశీ అత్యంత పిన్నవయసులో 1.10 కోట్లకు అమ్ముడుపోయిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.. ఇతడి కోసం రాజస్థాన్, ఢిల్లీ జట్లు విపరీతంగా పోటీపడ్డాయి. ఐతే రాజస్థాన్ జట్టు చివరికి 1.10 కోట్లకు దక్కించుకుంది. వైభవ్ వయసు ప్రస్తుతం 13 సంవత్సరాల 243 రోజులు. అతిపిన్న వయస్కుడు అయినప్పటికీ రాజస్థాన్ తమ జట్టులోకి అతడిని ఆహ్వానించింది. ఐపీఎల్ మెగా వేలంలో భారీ ధరకు అమ్ముడుపోవడంతో వైభవ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు అతడు ఆసియా కప్ లో సంచలనం సృష్టిస్తాడని అందరూ భావించారు. అయితే చిరకాల ప్రతీది పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో మాత్రం వైభవ్ అద్భుతాన్ని సృష్టించలేకపోయాడు.
ఇక దుబాయ్ వేదికగా జరిగిన అండర్ 19 ఆసియా కప్ 2024 లో భారత్ ఓటమిపాలైంది. శనివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో భారత్ 43 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో ముందుగా పాకిస్తాన్ బ్యాటింగ్ చేసింది. 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 281 రన్స్ చేసింది. పాక్ ఓపెనర్ షాజైబ్ 147 బంతులను ఎదుర్కొని ఐదు ఫోర్లు, 10 సిక్స్ లతో 159 రన్స్ చేశాడు..భారత్ 47.1 ఓవర్లలో 238 పరుగులకు కుప్పకూలింది. దీంతో పాకిస్తాన్ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఈ గెలుపు పాకిస్తాన్ జట్టులో ఆనందాన్ని నింపగా.. భారత్ లో తీవ్ర నిరాశను నింపాయి. చిరకాల ప్రత్యర్థి పై భారత్ ఓడిపోవడంతో నెట్టింట విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయారని నెటిజన్లు భారత జట్టు పై మండిపడుతున్నారు. “అసలే పాకిస్తాన్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు రావడంలేదని మనపై రుసరుసలాడుతోంది. ఇలాంటి క్రమంలో భారత్ ధాటిగా ఆడాల్సింది. కానీ దూకుడుగా ఆడాల్సిన సందర్భంలో చేతులెత్తేసింది. అందువల్లే ఓటమిపాలైందని” నెటిజన్లు పేర్కొంటున్నారు. ఈ మ్యాచ్ లో వైభవ్ సూర్య వంశీ గనుక మెరుగైన ఇన్నింగ్స్ ఆడి ఉంటే భారత్ పరిస్థితి మరో విధంగా ఉండేదని నెటిజన్లు వివరిస్తున్నారు.