Vaibhav Suryavanshi: గత ఏడాది జరిగిన ఐపీఎల్ లో రాజస్థాన్ జట్టు తరఫున ఆడాడు వైభవ్ సూర్య వంశీ. నూనూగు మీసాలు కూడా రాకముందే సెంచరీ చేశాడు. తద్వారా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. సూర్య వంశీ చేసిన ఆ సెంచరీ అదృష్టవశాత్తు నమోదయిందని అందరూ అనుకున్నారు. కానీ, అది అదృష్టవశాత్తు కాదని.. దాని వెనుక కఠోర శ్రమ ఉందని నిరూపించాడు వైభవ్ సూర్య వంశీ.
డొమెస్టిక్ క్రికెట్ లో సత్తా చూపించిన ఈ బిహారీ సంచలనం.. ఇప్పుడు అండర్ 19 సిరీస్ లో కూడా అదరగొడుతున్నాడు. ప్రస్తుతం బెనోని వేదికగా జరుగుతున్న అండర్ 19 సిరీస్లో వైభవ్ సూర్య వంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. దక్షిణాఫ్రికా జట్టుతో జరుగుతున్న ఈ సిరీస్లో భారతి ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్లు గెలిచింది. సిరీస్ కూడా సొంతం చేసుకుంది. నాన్న మాత్రమే మూడవ మ్యాచ్ బుధవారం జరుగుతోంది.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయిన భారత జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. వైభవ్ సూర్య వంశీ రెచ్చిపోవడంతో భారత్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 393 పరుగుల స్కోరు నమోదు చేసింది. సారధిగా వ్యవహరిస్తున్న సూర్య వంశీ 74 బంతుల్లో 9 ఫోర్లు, పది సిక్సర్ల సహాయంతో 127 పరుగులు చేశాడు. తద్వారా విధ్వంసానికి మారుపేరుగా నిలిచాడు. వేదాంత త్రివేది 34, మహమ్మద్ ఇషాన్ 28*, హేనీల్ పటేల్ 19*, అభిజ్ఞాన్కుందు 21 పరుగులు చేశారు. తొలి వికెట్ కు వైభవ్, ఆరోన్ 227 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు. ఈ సెంచరీ ద్వారా వైభవ్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. ఆయుష్ మాత్రే గైర్హాజరు కావడంతో.. ఈ సిరీస్ కు తొలిసారిగా నాయకత్వ బాధ్యతలు అందుకున్నాడు వైభవ్. యూత్ వన్డే క్రికెట్లో సెంచరీ చేసిన.. అత్యంత చిన్న వయసున్న అండర్ 19 సారధిగా ఘనత సృష్టించాడు. కేవలం 14 సంవత్సరాల వయసులోనే అతడు ఈ రికార్డు సృష్టించడం విశేషం.
ఎడమచేతి వాటం బ్యాటింగ్ తో వైభవ్ సూపర్ మేన్ తరహాలో పరుగులు తీస్తాడు. ఫోర్లు కాకుండా, సిక్సర్లే లక్ష్యంగా బ్యాటింగ్ చేస్తాడు. అందువల్లే అతడు విధ్వంసానికి పరాకాష్టగా ఆడుతుంటాడు. ఫలితంగా అండర్ 19 లో అత్యంత ప్రమాదకరమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. స్వదేశంలోనే కాదు, విదేశాలలో కూడా వైభవ్ బీభత్సంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. వేదిక మాత్రమే మారుతుందని.. తన బ్యాటింగ్ ఒకే తీరుగా ఉంటుందని అతడు నిరూపిస్తున్నాడు. ఇతడు గనుక టీమిండియాలోకి వస్తే.. పరుగుల ప్రవాహం కాదని సునామీ నమోదు అవుతుందని మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు ఇటీవల తనకు ఇష్టమైన మటన్ తినడం మానేశాడు. తద్వారా బరువు తగ్గి నాజూకుగా కనిపిస్తున్నాడు.