Vaibhav Suryavanshi IPL Performance 2026: 15 సంవత్సరాల బుడ్డోడు వైభవ్ సూర్య వంశీ ఐపీఎల్ లో సృష్టిస్తున్న సంచలనాలు మామూలుగా లేవు. ఇప్పటికే అతడు బీభత్సంగా బ్యాటింగ్ చేస్తూ రాజస్థాన్ సాధిస్తున్న విజయాలలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. సోమవారం హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు విఫలం కావడం.. ఆ జట్టుకు ఓటమిని అందించింది. ఒకవేళ అతడి గనుక నిలబడి ఉండి ఉంటే మ్యాచ్ స్వరూపం మరో విధంగా ఉండేది. ఫలితంగా రాజస్థాన్ ఖాతాలో ఐదో విజయం నమోదు అయ్యేది.
15 సంవత్సరాల ప్రాయంలోనే వైభవ్ సూర్య వంశీ బీభత్సంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. పెద్ద పెద్ద బౌలర్ల బౌలింగ్ మొత్తాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. భువనేశ్వర్ కుమార్ నుంచి మొదలుపెడితే బుమ్రా వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. బ్యాటింగ్లో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతూ.. 15 సంవత్సరాల వయసులోనే సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తున్నాడు. అందువల్లే అతడిని వండర్ కిడ్ అని పిలుస్తున్నారు.
ఐపీఎల్ తర్వాత ఆఫ్గనిస్తాన్ జట్టుతో జరిగే సిరీస్ కోసం అతడు జాతీయ జట్టులో ప్రవేశిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. అవి అలా ఉండగానే సూర్య వంశీకి సంబంధించి మరో వార్త వెలుగులోకి వచ్చింది. దీంతో అతడు చరిత్ర పుటల్లో నిలవడానికి కొద్ది సమయం మాత్రమే ఉంది. భారత జట్టు తరుపున అత్యంత చిన్న వయసులో క్రికెట్లోకి ప్రవేశించిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ కు పేరుంది. 16 సంవత్సరాల వయసులోనే సచిన్ భారత జాతీయ జట్టులోకి ప్రవేశించాడు. అయితే జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం వచ్చే ఐర్లాండ్ సిరీస్ కోసం సూర్య వంశీ టీమిండియాలో ప్రవేశిస్తాడని తెలుస్తోంది. ఇదే కనక జరిగితే 15 సంవత్సరాల వయసులోనే జాతీయ జట్టులో ఆడిన ఆటగాడిగా సూర్యవంశీ చరిత్ర సృష్టిస్తాడు.
ఇప్పటికే ఐర్లాండ్ టూర్ కోసం బీసీసీఐ కొంతమంది ఆటగాళ్లతో షార్ట్ లిస్టు రెడీ చేసినట్టు తెలుస్తోంది. అందులో వైభవ్ సూర్య వంశీ పేరు కూడా ఉన్నట్టు ప్రచారంలో ఉంది. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ పర్యటనకు అతని పేరు పరిశీలనలో ఉంది. దాన్ని మర్చిపోకముందే ఐర్లాండ్ టూర్ కోసం అతడిని ఎంపిక చేయడం నిజంగా గొప్ప విషయమని క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు.
