రాంచీ మైదానంలో ముందుగా బీహార్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.. పిచ్ అద్భుతంగా సహకారం అందిస్తున్న నేపథ్యంలో వైభవ్ రెచ్చిపోయాడు. అరుణాచల్ ప్రదేశ్ బౌలర్ల బౌలింగ్ మొత్తాన్ని ఊచ కోత కోశాడు. ఏమాత్రం కనికరం లేకుండా బాదాడు. లిస్ట్ క్రికెట్లో అత్యంత రెండవ వేగవంతమైన సంచలనం చేశాడు. ఓపెనర్ గా రంగంలోకి దిగిన వైభవ్ 84 బంతుల్లో 190 పరుగులు చేశాడు. ఇందులో 16 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. వెంట్రుక వాసిలో డబుల్ సెంచరీ కోల్పోయినప్పటికీ.. అతడు మైదానంలో ఉన్నంతసేపు అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లు నరకం చూశారు.
వైభవ్ విధ్వంసం సృష్టించడంతో బీహార్ జట్టు 30 ఓవర్లలోనే 282 పరుగులు చేసింది. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఈ ఘనతను అందుకుంది. వైభవ్ తో పాటు వచ్చిన మరో ఓపెనర్ మంగళ్ మహరూర్ 43 బంతుల్లో 33 పరుగులు చేశాడు. అయుష్(116), గని(128) సెంచరీలు చేయడంతో బీహార్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 574 పరుగులు చేసింది. కేవలం ఆరు వికెట్లు మాత్రమే కోల్పోయి ఈ ఘనత అందుకుంది. అరుణాచల్ ప్రదేశ్ జట్టు ఎక్స్ ట్రా ల రూపంలో 18 పరుగులు ఇవ్వడం విశేషం.
ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన అరుణాచల్ ప్రదేశ్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ కథనం రాసే సమయం వరకు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం 36 ఓవర్లలో 166 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇప్పటివరకు ఎనిమిది వికెట్లు కోల్పోయింది. బీహార్ బౌలర్లలో ఆకాశరాజు 3, సూరజ్ మూడు వికెట్లు పడగొట్టారు. బీహార్ ఆస్థాయిలో స్కోర్ చేయడంతో అరుణాచల్ ప్రదేశ్ బ్యాటర్లు ముందుగానే భయపడ్డారు. బీహార్ బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసిన చోట అరుణాచల్ ప్రదేశ్ బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.