Shubman Gill: క్రికెట్లో ఎవరైతే బాగా ఆడతారో.. వారికే ఎక్కువ గుర్తింపు ఉంటుంది. అవకాశాలు కూడా వారికే ఎక్కువ లభిస్తుంటాయి. ఆడని ప్లేయర్లకు కొంత పరిధిలో అవకాశాలు లభించినప్పటికీ.. ఆ తర్వాత మేనేజ్మెంట్ పక్కన పెడుతుంది. అంతగా ఆడని ప్లేయర్లను ఏ మేనేజ్మెంట్ కూడా భరించలేదు.
టీమిండియాలో ఎంతోమంది ప్రతిభావంతమైన ప్లేయర్లు ఉన్నారు. ఈ జాబితాలో శుభ్ మన్ గిల్(Shubman Gill) ముందు వరుసలో ఉంటాడు. పాతిక సంవత్సరాల వయసులోనే టెస్ట్, వన్డే జట్లకు సారధి అయ్యాడు. త్వరలోనే టి20 జట్టుకు కూడా అతడు సారధి కాబోతున్నాడని ప్రచారం జరిగింది. మేనేజ్మెంట్ కూడా అతడిని టి20 ఫార్మేట్ లో వైస్ కెప్టెన్ చేసింది. అన్ని మంచి శకునములే అనుకుంటున్న క్రమంలోనే ఊహించని స్ట్రోక్ గిల్ కు తగిలింది.
దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన టి20 సిరీస్లో గిల్ కు వరుసగా అవకాశాలు వచ్చినప్పటికీ.. అతడు ఏమాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దీంతో తదుపరి మ్యాచ్ లకు అతడు దూరం కావలసి వచ్చింది. పేరుకు గాయం అయిందని చెప్పినప్పటికీ.. అతడు ఫామ్ లో లేకపోవడం వల్లే దూరం పెట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గిల్ ను టి20 వరల్డ్ కప్ (T20 World Cup 2026) లో అతడికి అవకాశం లభించలేదు. దీనిపై మేనేజ్మెంట్ పరోక్షంగా సంకేతాలు కూడా ఇచ్చింది. అతడు సరిగ్గా ఆడక పోవడం వల్లే అవకాశం ఇవ్వలేదని స్పష్టం చేసింది…
మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) తండ్రి యోగ్ రాజ్ సింగ్ స్పందించాడు. అతడు యూట్యూబ్ చానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశాడు.
” టి20 జట్టుకు ఉపసారథిగా ఉన్న గిల్ ను జట్టు నుంచి తొలగించడానికి కారణమేమిటో అర్థం కావడం లేదు. కేవలం కొన్ని ఇన్నింగ్స్ లలో సరిగ్గా బ్యాటింగ్ చేయకపోతే ఆటగాడు విఫలమైనట్టు అనుకోవాలా? ఎన్నో అవకాశాలు ఇచ్చినా ఆడలేని ప్లేయర్లు మన జట్టులో చాలామంది ఉన్నారు. వారంతా ఇంకా జట్టులోనే కొనసాగుతున్నారు కదా.. ప్రస్తుతం టి20లో అభిషేక్ శర్మ బీభత్సమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అలాంటప్పుడు అతడు కొన్ని ఇన్నింగ్స్ లలో విఫలమైతే జట్టు నుంచి తొలగించాలా? మేనేజ్మెంట్ అలా తొలగించి సమర్ధించుకోగలదా” అని యోగ్ రాజ్ సింగ్ ప్రశ్నించారు.
“ఒకప్పుడు కపిల్ దేవ్ ఫామ్ లో లేడు. దీంతో అతడికి అవకాశాలు లభించలేదు. అయినప్పటికీ మేనేజ్మెంట్ తీరును ప్లేయర్లు తీవ్రంగా విమర్శించారు. ఒకప్పుడు బిషన్ సింగ్ బేడి నాయకత్వంలో టీమిండియా పాకిస్తాన్ దేశంలో లో పర్యటించింది. అప్పుడు కపిల్ దేవ్ విఫలమయ్యాడు. అయినప్పటికీ ఇంగ్లాండ్ టూర్ కు కపిల్ దేవ్ ను తీసుకెళ్లాడు.. ఒక ప్లేయర్ సామర్ధ్యాన్ని కొన్ని ఇన్నింగ్స్ లలో విఫలమైనంతమాత్రాన తప్పు పట్టాల్సిన అవసరం లేదని” యోగ్ రాజ్ సింగ్ పేర్కొన్నాడు.