Sachin Tendulkar: సచిన్ క్రికెట్ గాడ్ కావచ్చు.. జనాల నిరసనకు అతీతుడు కాదు

సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఆన్లైన్ గేమింగ్ లకు గిరాకీ బాగా పెరిగింది. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఈ ఆన్లైన్ గేమింగ్ లలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. అయితే తమ సంస్థలను ప్రమోట్ చేసుకునేందుకు సెలబ్రిటీలను ఆశ్రయిస్తున్నాయి.

Written By: Bhaskar, Updated On : September 1, 2023 10:26 am

Sachin Tendulkar

Follow us on

Sachin Tendulkar: సచిన్ టెండుల్కర్.. సమకాలిన క్రికెట్లో ఇతడి రికార్డులను బ్రేక్ చేయడం మరి ఎవరి వల్లా కాకపోవచ్చు. కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ అభిమానులను సృష్టించుకున్నాడు. క్రికెట్లో సరికొత్త టెక్నిక్ లకు నాంది పలికాడు. అందుకే ఇతడిని పలు పురస్కారాలతో భారత ప్రభుత్వం గౌరవించింది. క్రికెట్ కు రిటర్మెంట్ ప్రకటించినప్పటికీ.. ప్రకటనల ద్వారా భారీగానే ఆదాయాన్ని వెనకేసుకుంటున్నాడు సచిన్. అయితే అదే ఇప్పుడు సచిన్ ను ఇబ్బందుల పాల్చేస్తోంది.

ఏం జరిగిందంటే

సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఆన్లైన్ గేమింగ్ లకు గిరాకీ బాగా పెరిగింది. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఈ ఆన్లైన్ గేమింగ్ లలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. అయితే తమ సంస్థలను ప్రమోట్ చేసుకునేందుకు సెలబ్రిటీలను ఆశ్రయిస్తున్నాయి. అయితే అలాంటి గేమింగ్ యాప్ కు సచిన్ టెండుల్కర్ ప్రచార కర్తగా ఉన్నాడు. అయితే ఇది తప్పుడు సంకేతాలను యువతకు ఇస్తోందని ఆరోపిస్తూ అచలాపూర్ ప్రాంతానికి చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే ఓం ప్రకాష్ బాబా రావు నేతృత్వంలోని ఆయన కార్యకర్తలు సచిన్ ఇంటిని ముట్టడించారు. అతడికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. సచిన్ లాంటి వ్యక్తి ఇలాంటి ప్రకటనలు చేయడం ఏంటని వారు ఆరోపించారు. డబ్బుల కోసం ఇలాంటి ప్రకటనలు చేయడం సరికాదని, ఇది యువతకు తప్పుడు సంకేతాలు పంపిస్తోందని వారు విమర్శించారు. బే షరతుగా సచిన్ ఆ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఏ కంపెనీకి ప్రచారకర్తగా ఉన్నాడంటే..

సచిన్ టెండూల్కర్ ఫాంటసీ గేమింగ్ యాప్ పేటీఎం ఫస్ట్ గేమ్ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. యువతను పెడదారి పట్టించే ఇలాంటి వాటికి సచిన్ స్థాయి వ్యక్తి ప్రచారం చేయడం వివాదానికి కారణమైంది. డబ్బు కోసం అనైతిక కార్యకాలపాలను ఒక యాప్ కు సచిన్ ప్రచారం చేయడం పలు విమర్శలకు తావిస్తోంది. కాగా, గతంలోనూ బాలీవుడ్లో సెలబ్రిటీ అయిన అజయ్ దేవగన్ ఓ పాన్ మసాలా కంపెనీకి ప్రచారకర్తగా వ్యవహరించడం కలకలం రేపింది. అయితే దీనిపై అతని అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఒక శీతల పానీయాల కంపెనీకి ప్రచార కర్తగా ఉండడంతో.. ఆయనకు కూడా అభిమానుల నుంచి ఇలాంటి నిరసనే ఎదురైంది. సచిన్ ఫాంటసీ గేమింగ్ యాప్ నకు ప్రచారకర్తగా ఉన్న నేపథ్యంలో జరిగిన ఆందోళన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఆందోళనకు నేతృత్వం వహించిన బాబా రావు ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తి అయ్యాడు.. ఇక దీనిపై సోషల్ మీడియాలో సచిన్ అభిమానులు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. సచిన్ ప్రచారకర్తగా ఉన్నంత మాత్రాన యువత పెడదారి పడుతుందా అని కొంతమంది ప్రశ్నిస్తుంటే.. సచిన్ లాంటి వ్యక్తి ప్రచారం చేస్తే అది యువత మీద ప్రభావం చూపిస్తుందని మరి కొంతమంది అంటున్నారు.