Pakistan refuses to play India: ఆడలేక మద్దెల ఓడు అనే సామెత విని ఉంటారు కదా.. ఈ సామెత ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు నూటికి నూరు శాతం వర్తిస్తుంది. మరికొద్ది రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో.. పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఊహించని నిర్ణయం తీసుకుంది. శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 15న భారత జట్టుతో జరిగే మ్యాచ్ ఆడకూడదని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆదివారం ప్రకటించింది.
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రకటించిన ఈ నిర్ణయాన్ని క్రికెట్ అభిమానులు ఏ మాత్రం సహించడం లేదు. పాకిస్తాన్ క్రికెట్ మేనేజ్మెంట్ పనికిమాలిన నిర్ణయాలకు ఇది బలమైన ఉదాహరణ అని చెబుతున్నారు. భారత జట్టుపై సమర్థవంతమైన ఆటతీరు ప్రదర్శించాల్సిన పాకిస్తాన్ జట్టు.. ఇలా తప్పుకోవడం ఏంటని క్రికెట్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ” ఆటను ఆట మాదిరిగా ఆడాలి. ఇందులో రాజకీయాలను చొప్పించకూడదు. పాకిస్తాన్ క్రికెట్ మేనేజ్మెంట్ కు వాస్తవం అర్థం కావడం లేదు. అందువల్లే ఈ నిర్ణయం తీసుకుందని” క్రికెట్ అభిమానులు అంటున్నారు.
పాకిస్తాన్ భారత జట్టుతో ఆడబోమని చెప్పిన నేపథ్యంలో సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శ వ్యక్తమవుతున్నాయి. వరల్డ్ కప్ లలో భారత జట్టుపై పాకిస్తాన్ కు అత్యంత వరస్టు రికార్డులు ఉన్నాయి. వన్డే వరల్డ్ కప్ లో ఆడిన 8 మ్యాచ్ లలో పాకిస్తాన్ ఓడిపోయింది. టి20 లలో 8 సార్లు పోటీ పడితే.. ఆరుసార్లు టీమిండియా విజయం సాధించింది.. ఇందులో పాకిస్తాన్ ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. మరొక మ్యాచ్ డ్రా అయింది.
మైదానంలో గెలవడం చాతకాక పాకిస్తాన్ ఇలాంటి డ్రామాలకు పాల్పడుతోందని క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. పాకిస్తాన్ ఎన్నడూ కూడా పోరాటస్ఫూర్తిని చూపించలేదని.. అందువల్లే ఇలాంటి వితండ వాదాలకు దిగుతోందని క్రికెట్ అభిమానులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా జెంటిల్మెన్ గేమ్ లో జెంటిల్మెన్ మాదిరిగా ఆడటం పాకిస్తాన్ నేర్చుకోవాలని.. పాకిస్తాన్ క్రికెట్ మేనేజ్మెంట్ ప్రభుత్వం చెప్పింది కాకుండా.. సొంత నిర్ణయాలు తీసుకోవాలని క్రికెట్ అభిమానులు సూచిస్తున్నారు.