Travis Head And Heinrich Klaasen: ఒకడు ఉప్పెన.. ఇంకొకడు గర్జన.. మరొకడు ప్రళయం.. ఇలా చెప్పుకుంటూ పోతే వారి బ్యాటింగ్ వర్ణనకు అందదు. బంతిమీద దీర్ఘకాలం శత్రుత్వం ఉన్నట్టు.. బౌలర్లతో బద్ధ విరోధం ఉన్నట్టు ఆడుతుంటారు. బౌండరీ మీటర్ చిన్నబోయేలా.. బంతులు పగిలేలా కొడుతుంటారు. అయితే ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ లలో ఆ జట్టు బ్యాటర్లు పై ఉపోద్ఘాత మాదిరిగానే ఆడారు.. వచ్చే సీజన్లో వారు జట్టులో ఉండరని.. ఆ స్థాయిలో పరుగులు రావడం కష్టమేనని మొన్నటిదాకా వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు అబద్ధమని.. వచ్చే సీజన్లో బాదుడు కు తమ ప్లేయర్లు సరికొత్త అర్థం చెప్తారని ఆ మేనేజ్మెంట్ వెల్లడిస్తోంది. ఇంతకీ ఆ బ్యాటర్లు ఎవరు? ఆ మేనేజ్మెంట్ ఎవరిది? అనే ప్రశ్నలకు మీకు ఇప్పటికే సమాధానం దాదాపు వచ్చి ఉండాలి.
ఐపీఎల్ లో బాదుడుకు సరికొత్త అర్థం చెప్పింది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఈ జట్టులో హెడ్, క్లాసెన్ వంటి భీకరమైన ప్లేయర్లు ఉన్నారు. వీరిని 2026 సీజన్ వరకు హైదరాబాద్ జట్టు తన వద్ద అంటి పెట్టుకుంది. వాస్తవానికి వీరిని వదిలేస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. అందులో నిజం లేదని మేనేజ్మెంట్ తన నిర్ణయం ద్వారా పేర్కొంది. ఎందుకంటే హెడ్, క్లాసెన్ భీకరమైన ప్లేయర్లు. బీభత్సంగా బ్యాటింగ్ చేస్తారు. బౌలర్ ఎవరనేది చూడరు. ఎటువంటి మైదానమైనా వీరికి లెక్కలో ఉండదు. బౌండరీ మీటర్ ఎంత దూరమున్న సరే వీరు కొడుతూనే ఉంటారు. అందువల్లే హెడ్, క్లాసెన్ ను కాటేరమ్మ కొడుకులని పిలుస్తుంటారు. 2024 సీజన్లో వీరు ఏ స్థాయిలో సంచలనం సృష్టించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఊచకోత అనే పదానికి సరికొత్త అర్ధాన్ని వీరు చెప్పారు.
2025 సీజన్లో హెడ్, క్లాసెన్ తమ స్థాయిలో ఇన్నింగ్స్ ఆడ లేకపోయినప్పటికీ.. వీరి మీద మేనేజ్మెంట్ నమ్మకాన్ని కోల్పోలేదు. పైగా వీరి మీద విపరీతమైన భరోసా ఉందని పేర్కొంది. అందువల్లే 2026 సీజన్ లో వీరిని అంటి పెట్టుకుంది. అంతేకాదు వారిద్దరిని సరిపోల్చుతూ ఒక ఫోటోను హైదరాబాద్ మేనేజ్మెంట్ సోషల్ మీడియాలో వదిలింది . టాప్ ఆర్డర్లో హెడ్, మిడిల్ ఆర్డర్లో క్లాసెన్ fire power అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఈ ప్రకారం చూసుకుంటే వచ్చే ఐపిఎల్ సీజన్లో వీరిద్దరూ ఊచ కోత కోసే అవకాశం ఉందని హైదరాబాద్ మేనేజ్మెంట్ హింట్ ఇచ్చేసింది. దీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో we are waiting అంటూ కామెంట్లు చేస్తున్నారు.
హెడ్, క్లాసెన్ మాత్రమే కాకుండా, హైదరాబాద్ జట్టులో అత్యంత భయంకరమైన అభిషేక్ శర్మ కూడా ఉన్నాడు. ఇతడు మెరుపు వేగంతో పరుగులు తీస్తాడు. వికెట్ల మధ్య చిరుత పులి మాదిరిగా కదులుతుంటాడు. హెడ్ కు అభిషేక్ శర్మ తోడైతే పరుగులు తుఫాను వేగంతో వస్తూ ఉంటాయి. ఎంతటి భారీ లక్ష్యమైనా సరే వీరిద్దరి ముందు కరిగిపోవాల్సిందే.