Jammu And Kashmir: ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటన తర్వాత విచారణతోపాటు సోదాలు ముమ్మరమయ్యాయి. ఉగ్రవాదుల గుర్తింపు, ఏరివేత కోసం తనిఖీలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఉగ్ర లింకులు, ఇంటలిజెన్స్ నివేదిక ఆధారంగా ఈ తనిఖీలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఫరీదాబాద్, హన్యాణాలోని నూహూ, మేవాట్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తనిఖీలు జరుగుతున్నాయి. జమ్మూ కశ్మీర్‌లోనూ ఉగ్రవేట కొనసాగుతోంది. అనుమానితులను అరెస్ట్ చేస్తున్నారు. మైనర్లు కూడా ఉగ్రవాదులతో సంబంధాలు కొనసాగిస్తున్నాట్లు గుర్తించారు.
భారీ ఆయుధ డంప్..
ఢిల్లీ ఉగ్ర ఘటనతో సంబంధం ఉన్న జమ్మూ కశ్మీర్‌కు చెందిన డాక్టర్ అదిల్, డాక్టర్ ముజమిల్ డాక్టర్ నబీ స్వగ్రామం నౌగాంలోని తనిఖీల్లో నీర్యా అడవుల్లో చాలా పెద్ద ఎత్తున ఆయుధాలు, గ్రెనేడ్లు, బాంబులు, మిగతా ఐఈడీలు దొరికాయి. వీటిని దాచిపెట్టిన షానవాజ్‌ఖాన్ అబ్దుల్ లతీఫ్ అనే ఇద్దరిని అరెస్టు చేశారు. జమ్మూ కశ్మీర్‌లో ఇంకా సోదాలు జరుగుతున్నాయి. ఉగ్రవాద లింకులు ముఖ్యంగా వైట్ కోర్ట్ ఉగ్రవాదానికి సంబంధించిన అన్ని లింకులను కూలంకశంగా వెతుకుతున్నారు. వాటిని ఏరిపారేసే పని చేస్తున్నారు.
వైట్‌కోర్టు ఉగ్రవాదంపై దృష్టి..
తనిఖీల్లో ముఖ్యంగా వైట్‌కోర్ట్ ఉగ్రవాదంపై పోలీసులు, ఎన్‌ఐఏ అధికారులు, ఇంటలిజెన్స్ అధికారులు దృష్టిసారించారు. ఉగ్ర కుట్రలను అడ్డుకోవడానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఉగ్ర లింకులను తెంపేస్తున్నారు. ఈ చర్యల ద్వారా టీఏటీపీ, అమ్మోనియం నైట్రేట్ వంటి ప్రమాదకర బాంబు పదార్థాలు, ఆయుధాలు సేకరించి తీవ్రత తగ్గించే ప్రయత్నం జరుగుతోంది. ఉగ్రవాదులు ఎలా, ఎక్కడ దాడులకు పాల్పడుతున్నారో సంస్థలు జాగ్రత్తగా గమనిస్తున్నారు.