Tokyo Paralympics: నిజమైన ఒలింపిక్స్ లో పెద్దగా పతకాలు రాకున్నా పారా ఒలింపిక్స్ లో వికలాంగులైనా కూడా మన భారతీయ క్రీడాకారులు సత్తా చాటుతూ భారత్ కు పతకాల వర్షం కురిపిస్తున్నారు. చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా పారా ఒలింపిక్స్ లో భారత్ కు పతకాల పంట పండుతోంది. శనివారం జరిగిన బ్యాడ్మింటన్ ఫైనల్స్ లో ప్రమోద్ భగత్ (Pramod Bhagath) గెలిచి ఏకంగా స్వర్ణ పతకం సాధించాడు. ఫైనల్స్ లో గ్రేట్ బ్రిటన్ కు చెందిన డేనియల్ బెతెల్ పై 21-14,21-17 తేడాతో వరుస సెట్లలో గెలుపొంది గోల్డ్ మెడల్ అందుకున్నాడు. దేశానికి మరో బంగారు పతకాన్ని అందించాడు.
ప్రమోద్ స్వర్ణం గెలవడంతో భారత్ ఖాతాలో మొత్తం 4 బంగారు పతకాలు చేరాయి. ఇప్పటికే జావెలిన్ త్రోలో సుమిత్ గోల్డ్ మెడల్ సాధించగా.. తాజాగా ప్రమోద్ మరో పసిడిని అందించాడు.
ఇక జపాన్ కు చెందిన డైసుకే పుజిహారాపై భారత్ కు చెందిన మరో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మనోజ్ సర్కార్ 22-10,21-13తో విజయం సాధించి కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ మొత్తం 47 నిమిషాల పాటు జరిగింది. మనోజ్ సర్కార్ కు కాంస్యం దక్కడంతో ఒకే రోజు భారత్ కు భ్యాడ్మింటన్ లో రెండు పతకాలు దక్కడం విశేషం.
నిజమైన ఒలింపిక్స్ లో భారత్ స్వర్ణం గెలవడానికి నానా ఆపసోపాలు పడగా.. పారా ఒలింపిక్స్ లో మాత్రం ఈజీగా భారత వికలాంగ క్రీడాకారులు పతకాలు గెలిచి భారత పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. ఊహించని రీతిలో ప్రతి క్రీడలోనూ సత్తా చాటుతున్నారు. భారత్ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు.