National Sports Day : దేశంలో ఏటా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. క్రీడల ప్రాముఖ్యత గురించి సామాన్య ప్రజానీకంలో అవగాహన కల్పించడమే ఈ దినోత్సవం ప్రధాన లక్ష్యం. దేశంలో 2012 నుంచి జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. జాతి ఐక్యతను, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం, క్రీడలలో యువతను నిమగ్నమయ్యేలా చేయడమే ఈ దినోత్సవ ప్రధానం ఉద్దేశం. క్రీడలు మన ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, మానసిక ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యమైనవి. అన్ని క్రీడాంశాల్లో యువత పాల్గొని శారీరక ధారుఢ్యం కలిగి ఉండాలని చెబుతుంటారు. అయినా భారత్ క్రికెట్ మినహా మిగతా ఆటల్లో చెప్పుకునే స్థాయిలో పతకాలు సాధించడం లేదు. దీనికి ప్రధాన కారణం కూడా క్రికెట్ ఆటకు ఉన్న ప్రోత్సాహం మిగతావాటికి లేకపోవడమే అనే ఆరోపణలు ఉన్నాయి. క్రికెట్ కు లాగే మిగతా ఆటలకు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందనే డిమాండ్లు ఎన్నో ఏండ్ల నుంచి ఉన్నాయి. అయితే హామీలు మాత్రం కాగితాలకే పరిమితమయ్యాయి. అయితే ఆగస్టు 29నే జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకోవాలని ఎందుకు నిర్ణయించారో తెలుసా? ఇందుకుగల ప్రాముఖ్యత ఏంటనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారత హాకీ మాంత్రికుడు దివంగత మేజర్ ధ్యాన్ చంద్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన గౌరవార్థం.. ఆయన జయంతి అయిన ఆగస్టు 29న దేశంలో జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రభుత్వం నిర్వహిస్తున్నది. మొదటి జాతీయ క్రీడా దినోత్సవాన్ని 2012లో నిర్వహించారు. మేజర్ ధ్యాన్ చంద్ వారసత్వాన్ని గౌరవించడం, క్రీడలను ప్రోత్సహించడం, అవగాహన పెంచడం, యువతను భాగస్వాములు చేయడం లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
రిటైర్మెంట్ తర్వాత కూడా ధ్యాన్ చంద్ భారత హాకీకి ఎంతో సహకారం అందించాడు. పాటియాలాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ప్రధాన కోచ్ గా విధులు నిర్వర్తించడమే కాకుండా రాజస్థాన్ లో ఉన్న అనేక శిక్షణా శిబిరాల్లో పాల్గొని యువతకు హాకీ శిక్షణనందించాడు.
భారత ప్రభుత్వం 1956లో మేజర్ ధ్యాన్ చంద్ కు పద్మభూషణ్ అవార్డు అందజేసింది. ఆయన మరణానంతరం న్యూఢిల్లీలో నేషనల్ స్టేడియాన్ని ఆయన పేరుతో నిర్మించారు. మేజర్ ధ్యాన్ చంద్ భారతీయ క్రీడలకు చేసిన సేవలను గుర్తించేందుకు ఆయన జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా 2012లో భారత ప్రభుత్వం ప్రకటించింది.
జాతీయ క్రీడా దినోత్సవం క్రీడలు, శారీరక శ్రమ ప్రాముఖ్యతను తెలుపుతుంది. మేజర్ ధ్యాన్ చంద్ వారసత్వాన్ని గౌరవించడం, క్రీడల్లో రాణించేలా భావితరాలను ప్రోత్సహించడం వంటి అనేక కీలక అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
ఇక జాతీయ క్రీడా దినోత్సవం ప్రధాన లక్ష్యం ఏంటంటే క్రీడల ప్రాముఖ్యతను దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించడం. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. ప్రత్యేక సెమినార్లు ఏర్పాటు చేస్తాయి. క్రీడాకారులను, కోచ్ లను ప్రత్యేకంగా సన్మానిస్తుంటాయి.
ఇక ప్రజలకు, యువతకు క్రీడల తో కలిగే ప్రయోజనాలను తెలియజెప్పడంతో పాటు.. యువత ఆటలపోటీల్లో పాల్గొనడానికి, వారి జీవితంలో ఒక అంతర్భాగంగా మార్చడానికి ఎంతో కృషి చేస్తాయి.. మేజర్ ధ్యాన్ చంద్ స్ఫూర్తితో యువత క్రీడల్లో పాల్గొని దేశానికి వన్నె తేవాలని ప్రముఖులు పిలుపునిస్తుంటారు.