WTC Final 2023 India Vs Australia: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఆడే టీమిండియా ఇదే.. కీపర్ అతడే

భారత జట్టు మిడిల్ ఆర్డర్ బలంగానే కనిపిస్తోంది. చటేశ్వర పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, రవీంద్ర జడేజా అంతా ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నారు.

Written By: BS, Updated On : June 6, 2023 6:24 pm

WTC Final 2023 India Vs Australia

Follow us on

WTC Final 2023 India Vs Australia: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఆస్ట్రేలియా – భారత్ జట్లు ఈ మ్యాచ్ కోసం సర్వసన్నద్ధమయ్యాయి. అభిమానులు కూడా ఈ ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా..? అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్ మ్యాచ్ ఆడే భారత జట్టుపై స్పష్టత లేకపోవడంతో కొంత సమస్య ఉత్పన్నమైంది. తాజాగా డబ్ల్యూటిసి ఫైనల్ మ్యాచ్ ఆడే 11 మంది ఆటగాళ్లపై టీమ్ మేనేజ్మెంట్ ఒక స్పష్టతకు వచ్చింది. ఈ జట్టులో తెలుగు కుర్రాడికి అవకాశం లభించినట్లు తెలుస్తోంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన తర్వాత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అతిపెద్ద మ్యాచ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్. ఈ ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించి ఐసీసీ ట్రోఫీ కరువు తీర్చుకోవాలని భారత జట్టు భావిస్తోంది. అందుకు అనుగుణంగానే రోహిత్ సేన సిద్ధమవుతోంది. ఇప్పటికే భారత జట్టు ఇంగ్లాండ్ చేరుకొని ప్రాక్టీస్ కూడా చేసింది. జూన్ ఏడో తేదీన ఓవల్ లో ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లో తుది జట్టు ఎంపికపై టీమ్ మేనేజ్మెంట్ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ ఆడనున్న ఆ 11 మంది ఆటగాళ్లు ఎవరో మనము తెలుసుకుందాం.

ఈ ఆటగాళ్లకు గ్రీన్ సిగ్నల్..

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ, యంగ్ సెన్సేషన్ గిల్ ఓపెనింగ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఐపీఎల్ లో రోహిత్ శర్మ పెద్దగా ఆకట్టుకోలేదు. టెస్ట్ ఓపెనర్ గా రికార్డులు కూడా అతడి పేరుతో లేవు. అయితే, 2021లో ఇంగ్లాండ్ లో రోహిత్ శర్మ నాలుగు టెస్టుల్లో 368 పరుగులు చేశాడు. విదేశీ గడ్డపై ఓవల్ లో తన తొలి టెస్ట్ సెంచరీ కూడా ఈ సిరీస్ లో నమోదు చేశాడు. తన ఫామ్ ను మెరుగుపరుచుకోవడంతోపాటు కెప్టెన్ గా బ్యాటింగ్ లైన్ పై దృష్టి పెట్టడం మ్యాచ్ లో రోహిత్ ముందున్న పెద్ద సవాల్. మరో ఓపినర్ గా గిల్ ఆటపై క్రికెట్ ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. గత 12 నెలలుగా గిల్ అన్ని ఫార్మాట్లలో అదరగొడుతున్నాడు. అయితే, అతని ప్రతిభకు డబ్ల్యుటిసి ఫైనల్ రూపంలో అతిపెద్ద సవాల్ ఎదురుకానుంది. కఠినమైన పరిస్థితుల్లో భీకర ఆస్ట్రేలియన్ బౌలింగ్ ఎటాక్ ను గిల్ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. ఈ యువ కెరటం తన ఆఖరి టెస్టులో ఇదే ఆసీస్ పై సెంచరీతో చెలరేగాడు. అయితే, రేపటి మ్యాచ్ లో పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పటికీ గిల్ మాత్రం అదే ఊపు కనబరుస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

బలంగా కనిపిస్తున్న మిడిల్ ఆర్డర్..

భారత జట్టు మిడిల్ ఆర్డర్ బలంగానే కనిపిస్తోంది. చటేశ్వర పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, రవీంద్ర జడేజా అంతా ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నారు. శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ గాయాలు పాలవడంతో, ఐపీఎల్ లో రాణించిన అజింక్య రహానే మ్యాచ్ కు సెలక్ట్ అయ్యాడు. సీనియర్లు విరాట్ కోహ్లీ, పుజారాతో కలిసి రహానే మిడిల్ ఆర్డర్ లో భారత్ బలం పెంచాడు. గత దశాబ్ద కాలంగా టెస్టుల్లో బ్యాటింగ్ పరంగా భారత్ ను విజయ తీరాలకు చేర్చిన ఆటగాళ్లు ఈ ముగ్గురు కావడం విశేషం. టీమ్ ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ గెలవాలంటే, మిడిల్ ఆర్డర్ లో వీరు బలంగా నిలబడాల్సిందే.

భీకరమైన ఫామ్ లో కనిపిస్తున్న రవీంద్ర జడేజాగా..

అలాగే, రవీంద్ర జడేజా ఇప్పటికే భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. తన లాస్ట్ టెస్టులో సెంచరీతో చేయడంతోపాటు బాల్ తో కూడా రాణించాడు. సింగిల్ స్పిన్నర్ తో బరిలోకి దిగేందుకు రోహిత్ మొగ్గు చూపుతున్న నేపథ్యంలో అశ్విన్ కు బదులుగా జడేజా తుది జట్టులో ఉండే అవకాశం కనిపిస్తోంది. రిషబ్ పంత్ గైర్హాజరీలో కేఎస్ భరత్ వికెట్ కీపర్ గా అవకాశం దక్కించుకునే ఛాన్స్ ఉంది. ఈ తెలుగు కుర్రాడు సైతం తన ప్రతిభ చాటాల్సిన సమయం ఇది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో తెలుగు కుర్రాడు భరత్ ఆకట్టుకోలేదు. అయితే, రోహిత్ శర్మ భరత్ పై ఎక్కువ నమ్మకం ఉంచాడు. దీంతో డబుల్ సెంచరీ హీరో ఇషాన్ కిషన్ కు నిరాశ ఎదురు కానుంది. ఈ మ్యాచ్ లో సత్తా చాటి తన బెర్త్ మరింత కన్ఫామ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.

ఇది బౌలింగ్ దళం..

ఇక భారత జట్టు బౌలింగ్ విభాగానికి వస్తే శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.. ఈ నలుగురితో భారత జట్టు బౌలింగ్ దళం కూడా సూపర్ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. శార్దూల్ ఠాకూర్ గత కొన్నేళ్లుగా విదేశీ టెస్టుల్లో భారత జట్టు తరఫున ఆడుతూ సీన్ బౌలింగ్ ఆల్రౌండర్ గా రాణిస్తున్నాడు. ఉమేష్ యాదవ్ బంతిని స్వింగ్ చేయడంలో కింగ్. అందుకే జయదేవ్ ఉనాద్కత్ కంటే ఉమేష్ యాదవ్ కు మేనేజ్మెంట్ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఫైనల్ 11 మందిలో బెర్త్ ఖాయమైన బౌలర్లు మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. భారత్ 20 వికెట్లు తీయాలంటే ఈ ఇద్దరు కచ్చితంగా తమ ప్రతిభకు మించి రాణించాల్సిందే. ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేయడంలో షమీ, సిరాజ్ పాత్ర కీలకము కానుంది.

ఇది భారత జట్టు అంచనా..

రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్, చటేశ్వర పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, కెఎస్ భరత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అశ్విన్, మహమ్మద్ షమీ, సిరాజ్, ఉమేష్ యాదవ్.