IND VS AUS Test match : ప్రాక్టీస్ మ్యాచ్లో భారత – ఏ జట్టు బౌలర్ల చేతిలో కేఎల్ రాహుల్, గిల్, విరాట్ కోహ్లీ గాయపడ్డారు. గిల్ చేతి వేలుకు ఫ్రాక్చర్ కావడంతో ఇబ్బందిపడ్డాడు. దీంతో అతడు తొలి టెస్ట్ కు దూరమయ్యాడు. అతడి స్థానంలో కేఎల్ రాహుల్ ఓపెనర్ గా బరిలోకి దిగనున్నాడు.. కేఎల్ రాహుల్ ప్రాక్టీస్ మ్యాచ్లో గాయపడ్డప్పటికీ.. తర్వాత తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. ఇటీవల కాలంలో కేఎల్ రాహుల్ పెద్దగా రాణించలేకపోతున్నాడు. వన్డే వరల్డ్ కప్ తర్వాత.. మళ్లీ అతడు ఆ స్థాయిలో సత్తా చాట లేకపోతున్నాడు. దీంతో కేఎల్ రాహుల్ కు ఆస్ట్రేలియా సిరీస్ లిట్మస్ టెస్ట్ లాగా మారింది. ఇందులో గనుక అతడు రాణిస్తే.. టీమ్ ఇండియాకు ఇక తిరుగుండదు. ESPNcricinfo నివేదిక ప్రకారం మూడో స్థానంలో దేవ్ దత్ పడిక్కల్, నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ, ఐదవ స్థానంలో రిషబ్ పంత్ ఆర్థారని తెలుస్తోంది. ఆరవ స్థానంలో సర్ఫరాజ్, జురెల్ మధ్య పోటీ ఉండే అవకాశం ఉందని సమాచారం. ఆల్ రౌండర్ కోటాలో నితీష్ కుమార్ రెడ్డి, అశ్విన్ కు చోటు దక్కుతుందని సమాచారం. పేస్ బౌలర్ల విభాగంలో బుమ్రా, హర్షిత్ రాణా, సిరాజ్/ ఆకాష్ దీప్ ఆడతారని తెలుస్తోంది.
యువ ఆటగాళ్లకు అవకాశం
న్యూజిలాండ్ జట్టుతో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్లో వైట్ వాష్ కు గురైన నేపథ్యంలో.. టీమిండియా ఆస్ట్రేలియా సిరీస్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది. ముఖ్యంగా జట్టు కూర్పు విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలో వైవిధ్యాన్ని ప్రదర్శించే ఆటగాళ్లకు అవకాశం ఇవ్వనున్నది. ఆస్ట్రేలియా సిరీస్ లో సత్తా చాటితేనే భారత జట్టుకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో తలపడేందుకు అవకాశం ఉంటుంది. అందువల్లే యువ ఆటగాళ్లకు చోటు కల్పించారు. ధ్రువ్ జురెల్, ఆకాష్ దీప్, యశస్వి జైస్వాల్ వంటి ఆటగాళ్లకు ఇదే తొలి ఆస్ట్రేలియా సిరీస్. ఈ సిరీస్ లో సత్తా చాటితే వారికి తిరుగు ఉండదు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ కుటుంబ అవసరాల నేపథ్యంలో తొలి టెస్ట్ కు దూరమయ్యాడు. ఫలితంగా వైస్ కెప్టెన్ గా ఉన్న బుమ్రా కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. అతడి సారథ్యంలో టీమిండియా తొలి టెస్ట్ లో ఆస్ట్రేలియాను ఎదుర్కొంటుంది. గతంలో బుమ్రా కెప్టెన్సీలో భారత్ ఒక టెస్ట్ ఆడింది. అప్పుడు ఓడిపోయింది. 2022 లో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలైంది. మళ్లీ రెండు సంవత్సరాల తర్వాత బుమ్రాకు జట్టుకు నాయకత్వం వహించే అవకాశం లభించింది.