Border Gavaskar Trophy 2024 : రెడ్ బాల్ ఫార్మాట్ లో టీమిండియా కు తిరుగులేదు. కానీ దానిని న్యూజిలాండ్ బ్రేక్ చేసింది. మూడు టెస్టుల సిరీస్ ఆడేందుకు మన దేశానికి వచ్చిన న్యూజిలాండ్ వైట్ వాష్ ఫలితంతో టీమ్ ఇండియాకు దిమ్మతిరిగేలా చేసింది. ఇక అప్పటినుంచి టెస్ట్ క్రికెట్లో టీమ్ ఇండియాకు వైఫల్యాల చరిత్ర నడుస్తోంది. ఆ సిరీస్ కోల్పోయిన తర్వాత.. ఫామ్ లో లేని ఆటగాళ్లు తమ ఆట తీరును పున: సమీక్షించుకోలేదు. గొప్పగా ఆడాలని ప్రయత్నించలేదు. మైదానం మాత్రమే మారింది.. ప్రత్యర్థి మాత్రమే మారారు. కానీ వారి ఆట తీరు ఏమాత్రం మారలేదు. దీంతో టీమ్ ఇండియాకు వరుసగా రెండవ సిరీస్లో ఓటమి తప్పలేదు.
ఇవేనా కారణాలు..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా గత రెండు సీజన్లలో గెలుచుకుంది. కానీ ఈ సీజన్లో మాత్రం ఓటమిపాలైంది. గట్టిగా ఆడాల్సిన చోట తేలిపోయింది. బలంగా దంచి కొట్టాల్సిన సందర్భంలో చేతులెత్తేసింది. అంతిమంగా ఓటమిపాలైంది.. ఈ సిరీస్ లో స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, గిల్, రాహుల్ దారుణంగా విఫలమయ్యారు. రవీంద్ర జడేజా ఒక్క ఇన్నింగ్స్ మినహా.. మిగతా అన్నింటిలోనూ విఫలమయ్యాడు. మహమ్మద్ సిరాజ్ జట్టు అవసరాలకు తగ్గట్టుగా ప్రదర్శన చేయలేకపోయాడు. హర్షిత్ రాణా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు. బౌలర్లలో బుమ్రా మినహా మిగతా వాళ్ళంతా విఫలమయ్యారు. జట్టు ఎంపికలోనూ మేనేజ్మెంట్ పారదర్శకత పాటించలేదు. గౌతమ్ గంభీర్ కు మొత్తం పెత్తనం అప్పగించడంతో ఇష్టానుసారంగా వ్యవహరించాడు.. బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ మినహా మిగతా వారంతా గొప్ప ఇన్నింగ్స్ ఆడలేదు. రిషబ్ పంత్ కూడా తను ఆడిన పరుగులను భారీ స్కోరుగా మలచలేకపోయాడు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఒక సెంచరీ తో ఆకట్టుకున్నప్పటికీ.. ఆ తర్వాత అదే ఫామ్ కంటిన్యూ చేయలేకపోయాడు. డ్రెస్సింగ్ రూమ్ లో నెలకొన్న వివాదాలు కూడా టీమిండియా విజయం పై తీవ్ర ప్రభావం చూపించాయి. మొత్తంగా చూస్తే కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్టు.. టీమిండియా ఓడిపోవడానికి ఎన్నో నేపథ్యాలు ఉన్నాయి. మరి వీటి నుంచి టీమ్ ఇండియా పాఠాలు నేర్చుకుంటుందా.. వాటిని విజయాలకు దారులుగా మలచుకుంటుందా.. అనే ప్రశ్నలకు సమాధానం కోసం వేచి చూడాల్సి ఉంది.
మేనేజ్మెంట్ ఏం చేస్తుందో?
టెస్ట్ జట్టులో వైఫల్యాల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో .. జట్టులో ఎలాంటి మార్పులు చేపడుతుంది? ఎవరిపై వేటు వేస్తుంది? ఎవరికి కొత్తగా అవకాశాలు కల్పిస్తుంది? అనే ప్రశ్నల చుట్టూ జాతీయ మీడియా కధనాలను ప్రసారం చేస్తోంది. కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందిపై విమర్శల వర్షం కురిపిస్తోంది. మరి వీటి నుంచి తక్షణం ఉపశమనం పొందాలంటే టీమిండియాలో కచ్చితంగా మార్పులు జరగాలని.. అప్పుడే విజయాలు సాధ్యమవుతాయని అభిమానులు పేర్కొంటున్నారు.