Australia : ఆస్ట్రేలియా అంటేనే.. క్రికెట్లో సరికొత్త ఆటతీరుకు పర్యాయపదం. అందువల్లే ఆ జట్టు వరుస విజయాలు సాధిస్తోంది. మరే జట్టూ అందుకోలేని రికార్డులను సృష్టిస్తోంది. ఫలితంగానే ఆస్ట్రేలియా జట్టు అంటేనే.. మిగతా జట్లు భయపడిపోతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఆస్ట్రేలియా బౌలర్ల దూకుడు ముందు చేతులెత్తేస్తుంటాయి. ఆస్ట్రేలియా జట్టు బలమైన ఆట తీరు మాత్రమే కాదు.. అద్భుతమైన మైండ్ గేమ్ కూడా ఆడుతుంది. అందువల్లే ఆ జట్టు క్రికెట్లో రారాజుగా వెలుగొందుతోంది.
టి20 ఫార్మాట్ కాస్త మినహాయిస్తే.. వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో ఆస్ట్రేలియా జట్టుకు ఎదురేలేదు. వన్డే ఫార్మాట్లో ఇటీవల జరిగిన వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. భారత్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో అద్భుతమైన గెలుపును దక్కించుకుంది. చివరి వరకు ఉత్కంఠ గా సాగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోనూ భారత జట్టును ఓడించి ట్రోఫీ సొంతం చేసుకుంది.. టి20 వరల్డ్ కప్ లో ఓటమిపాలైనప్పటికీ.. ఆ జట్టు మిగతా ఫార్మాట్లలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. గత రెండు సీజన్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టు.. ఈసారి మాత్రం గెలుచుకుంది. టీమిండియా పై వరుస విజయాలు సాధించి.. సిరీస్ సొంతం చేసుకుంది.
అరుదైన రికార్డు
సిడ్నీ మైదానం వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో గెలిచిన ఆస్ట్రేలియా.. 3-1 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని దక్కించుకుంది. అన్ని విభాగాలలో భారత జట్టుపై పై చేయి సాధించింది. ఈ సిరీస్ విజయం మాత్రమే కాకుండా.. మరో రికార్డును కూడా ఆస్ట్రేలియా సాధించింది. ఐసీసీ టోర్నీలలో ఎక్కువసార్లు ఫైనల్ చేరిన జట్టుగా ఆస్ట్రేలియా సరికొత్త ఘనత సాధించింది. ఆస్ట్రేలియా జట్టు ఇప్పటివరకు 14 సార్లు ఐసీసీ టోర్నీలలో ఫైనల్ వెళ్ళింది. తాజాగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ చేరుకోవడం ద్వారా ఆస్ట్రేలియా ఈ రికార్డు సొంతం చేసుకుంది. ఈ జాబితాలో 13 సార్లు ఫైనల్ వెళ్లి భారత రెండవ స్థానంలో ఉంది. 9సార్లు ఫైనల్ వెళ్లి ఇంగ్లాండ్ మూడో స్థానంలో ఉంది. 8 సార్లు ఫైనల్ వెళ్లి వెస్టిండీస్ నాలుగో స్థానంలో ఉంది. ఏడు సార్లు ఫైనల్ వెళ్లి శ్రీలంక ఐదో స్థానంలో ఉంది. ఇక జూన్ 11 నుంచి సౌత్ ఆఫ్రికా తో ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ లో తలపడుతుంది. లార్డ్స్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ ఈ సిరీస్ గెలిస్తే రెండుసార్లు WTC గెలిచిన జట్టుగా ఆస్ట్రేలియా నిలుస్తుంది. గతంలో జరిగిన WTC (201-23) ఫైనల్ లో టీమిండియా పై ఆస్ట్రేలియా గెలిచింది. అదే ఏడాది ఆస్ట్రేలియా టీమిండియా పై వన్డే వరల్డ్ కప్ లో విజయం సాధించి.. ట్రోఫీని దక్కించుకోవడం విశేషం. అయితే ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా రెండుసార్లు భంగపాటుకు గురికాగా.. టి20 వరల్డ్ కప్ లో మాత్రం ఘన విజయాన్ని సాధించి కొంతలో కొంత రివేంజ్ తీర్చుకుంది.