Champions Trophy 2025 : భారత క్రికెట్ నియంత్రణ మండలి రాసిన లేఖ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సరికొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చింది. భారత్ కనుక తమ దేశంలో నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడకపోతే.. తాము టోర్నీ నుంచి వైదొలుగుతామని హెచ్చరించింది. అంతేకాదు ఒలంపిక్స్ నిర్వహణ కోసం భారత్ ఆసక్తి వ్యక్తీకరణ లేఖ రాసిన నేపథ్యంలో.. దానికి వ్యతిరేకంగా ఉద్యమ మొదలుపెడతామని హెచ్చరించింది. ఇలాంటి మేకపోతు గాంభీర్యం మాటలు ప్రదర్శించినప్పటికీ.. టోర్నీలో భారత్ ఆడకుంటే ఎంత నష్టమో పాకిస్తాన్ జట్టుకు తెలుసు. అందువల్లే ఆ దేశ మాజీ క్రికెటర్లతో భారత్ తమ దేశానికి వచ్చి ఆడాలని వ్యాఖ్యలు చేయించింది. మెరుగైన ఆతిథ్యం ఇస్తామని నమ్మబలికింది. అయినప్పటికీ భారత్ పాకిస్తాన్లో ఆడేందుకు ఆసక్తి చూపించడం లేదు. మరోవైపు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా జై షా ఎన్నిక కావడం.. త్వరలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ వేదిక మారే అవకాశం కనిపిస్తోంది.
మొదట్లో దక్షిణాఫ్రికా అన్నారు
హైబ్రిడ్ మోడ్ విధానానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంగీకారం తెలపని పక్షంలో.. ఛాంపియన్స్ ట్రోఫీని దక్షిణాఫ్రికాలో నిర్వహిస్తారని వార్తలు వినిపించాయి. అయితే దక్షిణాఫ్రికా కాకుండా ఇప్పుడు భారత్ లోనే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తారని తెలుస్తోంది. ఒకవేళ ఛాంపియన్ ట్రోఫీ భారత్ లో కనుక నిర్వహిస్తే పాకిస్తాన్ మనదేశంలోకి వస్తుందా? వచ్చి ట్రోఫీ ఆడుతుందా? అనేది అనుమానం గానే ఉందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు..” హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తే టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటుంది.. ఒకవేళ పాకిస్తాన్లోనే నిర్వహిస్తే టీమిండియా ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళదు. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా బీసీసీఐ అలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోదు. పైగా భారత ప్రభుత్వం కూడా దానికి ఒప్పుకోదు. అలాంటప్పుడు పాకిస్తాన్ ఒక మెట్టు కిందికి దిగి రావాల్సిందే. లేనిపక్షంలో పాకిస్తాన్ నుంచి టోర్నీ భారత్ వైపు వెళుతుంది. భారత్లో అన్ని క్రికెట్ మైదానాలు అద్భుతంగా ఉన్నాయి. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. పాకిస్తాన్ మేనేజ్మెంట్ లాగా మైదానాలకు మరమ్మతులు చేయాల్సిన అవసరం లేదు. ఇటీవలి వరల్డ్ కప్ ను భారత్ క్రికెట్ మేనేజ్మెంట్ ఘనంగా నిర్వహించింది. ఇప్పుడు ఒకవేళ ఛాంపియన్ ట్రోఫీ భారత్ లో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయిస్తే.. దానికి బీసీసీఐ కచ్చితంగా ఒప్పుకుంటుంది. తెర వెనుక ఎలాగు జై షా చక్రం తిప్పుతారు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదని” క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.