ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్‌ల కోసం సెలక్ట్ చేసిన జట్టుపై ఇప్పుడు విమర్శలు వచ్చిపడుతున్నాయి. మ్యాచ్ ప్రారంభమైన మొదటి నుంచే భారత్ జట్టు వైఫల్యం తేటతెల్లమైంది. దీంతో జట్టు కూర్పులో జరిగిన పొరపాటు చెప్పకనే చెబుతున్నాయి. ఇన్నింగ్స్ ప్రారంభమైన మొదటి ఓవర్ రెండో బాల్‌కే ఓపెనర్ పృథ్వీ షా చేతులెత్తేశాడు. మిచెల్ స్టార్క్ ఇన్‌స్వింగర్‌ను డ్రైవ్ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.
Also Read: డిఫెన్స్ లో భారత్.. కోహ్లీ ఒక్కడే నిలిచాడు
కరోనా విరామం తర్వాత ఆస్ట్రేలియాలో భారత జట్టు తొలి టెస్టు ఆడుతోంది. గులాబీ బంతితో తక్కువ మ్యాచ్‌లు ఆడిన భారత ఆటగాళ్లకు మొదటి రోజే డే అండ్ నైట్ మ్యాచ్ ఎదురైంది. మరోవైపు గులాబీ బంతితో బ్యాటింగ్ కొత్త కావడంతో జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ.. పృథ్వీ ఈవేమీ పట్టించుకోలేదు. వచ్చాడు.. అలా వెళ్లాడు. అతను చేసిన తప్పిదాన్ని గవాస్కర్ కూడా తప్పుబట్టాడు.
పిచ్‌ను చదవకుండా.. బౌలర్ల వ్యూహాల్ని గమనించకుండా బ్యాటింగ్ చేయడం సరికాదని స్పష్టంగా చెప్పాడు. ఆయన హెచ్చరిక తర్వాత కూడా పృథ్వీలో పెద్దగా మార్పు రాలేదు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లోనూ పేలవ ప్రదర్శనే ఇచ్చాడు. ఆసీస్ గడ్డపై జరిగిన రెండు వార్మప్ మ్యాచ్‌ల్లోనూ సాధించిందేమీ లేదు. ఇలా ఫామ్‌లో లేని ఆటగాడిని టెస్టు జట్టుకు ఎలా ఎంపిక చేశారనేది ఇప్పుడు మొదలైన ప్రశ్న.
Also Read: కోహ్లీ సేన రికార్డు సాధించేనా..?
ఆసీస్‌లో ఎలాంటి సిరీస్ అయినా టఫ్ ఫైట్ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్, బౌలర్లతో కూడిన జట్టుతో బరిలో దిగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ.. ఇంత పెద్ద జట్టులో పృథ్వీ తప్ప మరే కీలక ఆటగాడు సెలక్టర్లకు కనిపించలేదా అనే విమర్శలు వస్తున్నాయి. కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ వంటి వారు ఉండనే ఉన్నారు. ఐపీఎల్‌లో రాహుల్ బ్యాటింగ్ అందరికీ దిమ్మదిరిగేలా చేసింది. ఒక సెంచరీ.. ఐదు అర్ధసెంచరీలతో దుమ్ము రేపాడు. ఎంతో మంది ఆయన బ్యాటింగ్‌ను కీర్తించారు. ఏ రకంగా చూసినా పృథ్వీ కంటే రాహుల్ చాలా బెటర్. అలాంటి ఆటగాడిని పక్కన పెట్టడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.