Sunrisers Hyderabad: ఓటమి గుణపాఠం నేర్పుతుంది. తర్వాత అడుగులు మరింత బలంగా వేసేందుకు ప్రేరణ ఇస్తుంది.. అంతేకాదు గెలవాలనే కసిని నరనరానా నింపుతుంది. అదేంటో గాని వరుస ఓటమిలో ఎదురైనప్పటికీ హైదరాబాద్ సన్రైజర్స్ జట్టు గుణపాఠాలు నేర్చుకోలేకపోతోంది. అంతేకాదు ఐపీఎల్లో గల్లిస్థాయి క్రికెట్ ఆడుతూ ఇజ్జత్ పోగొట్టుకుంటున్నది. గత రెండు సీజన్ లలో నిరాశ జనకమైన ఆట తీరు ప్రదర్శించి అభిమానులను ఇబ్బంది పెట్టిన సన్రైజర్స్.. ఈసారి కూడా పేలవమైన ఆట తీరు కనబరుస్తోంది. అభిమానులను వేదనకు గురిచేస్తోంది.
ఐదు మ్యాచ్ లు ఓడింది
సన్రైజర్స్ ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడింది. కేవలం రెండింట్లో మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదవ స్థానంలో కొనసాగుతోంది. అంతేకాదు గెలవాలనే కసి హైదరాబాద్ ఆటగాళ్లల్లో ఏ మాత్రం కనిపించడం లేదు. మ్యాచ్ కు ముందు ఆ జట్టు ఆటగాళ్లు మైదానంలో వింతైన ప్రాక్టీస్ చేయడం విశేషం. ఐదు మ్యాచ్ లు ఓడిపోయిన తర్వాత గానీ హైదరాబాద్ జట్టుకు జ్ఞానోదయం కలగలేదు.. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్..ఇలా అన్ని విభాగాల్లో హైదరాబాద్ జట్టు దారుణమైన ఆట తీరు ప్రదర్శిస్తున్నది.
అసిస్టెంట్ కోచ్ ఆధ్వర్యంలో..
హైదరాబాద్ జట్టుకు అసిస్టెంట్ గా సిమన్ హెల్మోట్ వ్యవహరిస్తున్నాడు. జట్టు 5 ఓటములు చవి చూడటంతో ఈసారి ఎలాగైనా గెలుపు బాట పట్టించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగానే ఆటగాళ్లలో స్ఫూర్తినింపేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఆటగాళ్లకు సరికొత్త విధంగా శిక్షణ ఇస్తున్నాడు.. మైదానంలో సిమన్ టెన్నిస్ రాకెట్ తో బంతిని గాల్లోకి బలంగా కొట్టాడు.. బంతిని గ్లెన్ ఫిలిప్స్ తన హెల్మెంట్ తో హెడర్ చేశాడు. అనంతరం ఆ క్యాచ్ పట్టాల్సి ఉంటుంది.. ఆటగాళ్ల మధ్య వేగవంతమైన సమన్వయం ఉండేందుకు ఇలాంటి ప్రాక్టీస్ చేయిస్తున్నట్టు అర్థమవుతున్నది. ఇక ఈ ప్రాక్టీస్ లో హైదరాబాద్ ఆటగాళ్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సన్రైజర్స్ హైదరాబాద్ ట్విట్టర్ ఖాతాలో పెట్టింది.
మైదానంలో కప్పలు పడుతున్నారా?
అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “గత రెండు సీజన్లలో మమ్మల్ని నిరాశపరిచారు.. ఈసారి కూడా అలానే చేస్తున్నారు.. మైదానంలో మీరు ప్రాక్టీస్ చేస్తుంటే కప్పలు పడుతున్నట్టు కనిపిస్తోంది. ఇలాగైతే ఐపీఎల్ కప్ ఎలా సాధిస్తారు అంటూ” అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం సన్రైజర్స్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
This drill will literally knock your heads pic.twitter.com/0PT7mEzwst
— SunRisers Hyderabad (@SunRisers) April 28, 2023