Ishan Kishan: నడుస్తున్నంతసేపే యంత్రానికి విలువ. పనిచేస్తున్నంతసేపే మనిషికి గౌరవం. అలాగే ఆటగాడు ఆడుతున్నంతసేపే ప్రేక్షకుల మద్దతు. ఈ మూడు కేవలం పని ఆధారంగానే దక్కుతాయి.. కానీ ఆ పనిపై ఆసక్తి తగ్గితే విలువ, గౌరవం, మద్దతు దక్కే విషయంలో తేడా ఉంటుంది. ముఖ్యంగా క్రీడాకారులకు ఇది మరింతగా వర్తిస్తుంది. అందుకే క్రీడాకారులు ఫామ్ విషయంలో జాగ్రత్తగా ఉంటారు. అది కోల్పోతే పడే ఇబ్బందులు మామూలుగా ఉండవు కాబట్టే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడుతుంటారు. ప్రస్తుతం ఇలాంటి ఇబ్బందినే టీమిండియా యువ ఆటగాడు ఇషాన్ కిషన్ ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లో అతడు స్థానాన్ని కోల్పోయాడు. అంతేకాదు గతంలో చూపించిన ఫామ్ ను దొరకబుచ్చుకోలేక నానా తంటాలు పడుతున్నాడు. వచ్చిన అవకాశాలను కూడా వినియోగించుకోవడంలో విఫలమవుతున్నాడు. ఇలా అయితే అతని ఆట, పేరు మరుగున పడిపోవడం ఖాయమని అభిమానులు అంటున్నారు.
ఇషాన్ కిషన్ ఎడమచేతి వాటం బ్యాటర్. కీపర్ గా చాలా చురుగ్గా ఉంటాడు. అయితే ఆటకు ఇవి మాత్రమే సరిపోవు. బలమైన బ్యాటింగ్ ఉండాలి. ఆ బలమైన బ్యాటింగే ఇషాన్ కిషన్ ను ఓవర్ నైట్ స్టార్ ను చేసింది. కానీ దాన్ని కాపాడుకోవడంలో అతడు విఫలమవుతున్నాడు. ఫామ్ లేమితో అతడు మూడు నెలల వరకు జట్టుకు దూరంగా ఉన్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత అవకాశం లభిస్తే.. రీ- ఎంట్రీ మ్యాచ్ లోనూ విఫలమయ్యాడు. ముంబై వేదికగా ఇటీవల డివై పాటిల్ టి20 జట్టు తరఫున అతడు ఆడాడు. రూట్ మొబైల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 12 బంతుల్లో 19 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. 12 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. దూకుడుగా బ్యాటింగ్ చేసినప్పటికీ అతడు స్వామినాథన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.
రూటు మొబైల్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి 193 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఇషాన్ ఓపెనింగ్ బ్యాటర్ గా క్రీజ్ లోకి వచ్చాడు. అయితే అతడు ఎంతోసేపు నిలవలేదు. దూకుడుగా ఆడే క్రమంలో క్యాచ్ అవుట్ అయ్యాడు. కీపర్ గా అతడు ఒక స్టంప్ ఔట్, క్యాచ్ అవుట్ చేశాడు. బ్యాట్ తో మాత్రం ఆశించినంత స్థాయిలో ప్రదర్శన చూపించలేకపోయాడు. అతని ఆట చూసి అభిమానులు నిరాశ చెందుతున్నారు. సీనియర్ ఆటగాళ్లు ఇదేం ఆటని ప్రశ్నిస్తున్నారు. ఇలానే ఆడితే కెరియర్ ముగిసి పోదా అంటూ చురకలంటిస్తున్నారు.
గత ఏడాది నవంబర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ – 20 సిరీస్ లో ఇషాన్ ఆడాడు. అనంతరం దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్ళినప్పటికీ రిజర్వ్ బెంచ్ కే పరిమితమయ్యాడు.. వ్యక్తిగత కారణాలతో సౌత్ఆఫ్రికా టూర్ మధ్యలోనే ఇండియాకు వచ్చాడు. మూడు నెలలుగా ఫామ్ సరిగా లేకపోవడంతో ఎటువంటి మ్యాచులు ఆడలేదు. ఐపీఎల్ లో ముంబై జట్టుకు ఆడుతున్న కిషన్.. ఆ టోర్నీలో రాణించాలని భావిస్తున్నాడు. కాగా ఈ టోర్నీలో ఆడుతున్న టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా రిలయన్స్ వన్ టీంకు కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. బిపిసిఎల్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ 3 ఓవర్లు వేసి 22 పరుగులు ఇచ్చాడు. రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా, బీసీసీఐ చెప్పినట్టుగా రంజీ క్రికెట్ ఆడక పోవడంతో ఇషాన్ కిషన్ కు సెంట్రల్ కాంట్రాక్ట్ లో చోటు దక్కలేదని తెలుస్తోంది. మరి ఇప్పటికైనా కిషన్ తన ఆట తీరు మార్చుకుంటాడా.. పోగొట్టుకున్న ఫామ్ ను దొరకబుచ్చుకుంటాడా అనేది తేలాల్సి ఉంది.
#IshanKishan Playing for RBI in #DYPatilT20Cup
Ishan out on 19(11) against Route Mobile
: DYPatilYT#CricketTwitter #TeamIndia
— Niche Sports (@Niche_Sports) February 27, 2024