Sanju Samson: బలంగా బ్యాటింగ్ చేయగలడు. స్థిరంగా పరుగులు చేయగలడు. ఎలాంటి స్థితిలో ఉన్నా సరే తన బ్యాటింగ్ స్టైల్ ప్రదర్శిస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోవాలే గాని సంజు శాంసన్ గురించి పేజీలకు పేజీలు ఉపోద్ఘాతం రాయొచ్చు. ఎందుకంటే సంజు విలక్షణమైన ఆటగాడు. వ్యక్తిగత రికార్డులను పక్కనపెట్టి, కేవలం జట్టు కోసం మాత్రమే ఆడతాడు.
ఎంతో గొప్ప రికార్డులు ఉన్న సంజు శాంసన్ ను మేనేజ్మెంట్ కొన్ని సిరీస్లలో పక్కన పెట్టింది. తద్వారా సంజు రిజర్వ్ బెంచ్ కు పరిమితం కావలసి వచ్చింది.. ముఖ్యంగా అతడికి దక్షిణాఫ్రికా మీద అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. గత ఏడాది ఇదే సమయానికి దక్షిణాఫ్రికా మీద అతడు వరుసగా సెంచరీలు చేశాడు. సరికొత్త రికార్డులు సృష్టించాడు. అయితే ప్రస్తుతం స్వదేశంలో దక్షిణాఫ్రికా జట్టుతో జరుగుతున్న టి20 సిరీస్ లో సంజు శాంసన్ ను రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేయడం అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు. సంజు ను పక్కనపెట్టి గిల్ ను ఆడించడం పట్ల విమర్శలు వచ్చాయి. దీనికి తోడు గిల్ సరిగా ఆడలేదు. ప్రతి మ్యాచ్ లోనూ విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో అతడిని ఆడించకుండా సంజు శాంసన్ కు అవకాశం కల్పించాలని డిమాండ్లు వచ్చాయి. దీనికి తోడు గిల్ కూడా గాయపడిన నేపథ్యంలో.. అతని స్థానంలో ఎట్టకేలకు ఐదో టి20 మ్యాచ్లో సంజు శాంసన్ కు చోటు లభించింది. ప్రస్తుతం సంజు అభిషేక్ శర్మ తో ఓపెనర్ రంగంలోకి వచ్చాడు.
ఇన్ని రోజులపాటు తనను రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేశారని కోపం, ఇంకా కారణాలతో సంజు బీభత్సంగా బ్యాటింగ్ చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. 22 బంతులు ఎదుర్కొన్న సంజు 37 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.. టీమిండియా ఇన్నింగ్స్ సమయంలో 9వ ఓవర్లో పెరిరా బౌలింగ్లో సంజు స్ట్రైట్ షాట్ ఆడాడు. అతడు కొట్టిన వేగానికి బంతి ఫోర్ వెళ్తుందని అందరూ అనుకున్నారు. అయితే ఆ బంతి నేరుగా అంపైర్ కు తగలడంతో అతడు కిందపడ్డాడు. చాలా సేపు నొప్పితో బాధపడ్డాడు. దీంతో ఫిజియో వచ్చి అతనికి చికిత్స చేయాల్సి వచ్చింది. సంజు ఇలా బ్యాటింగ్ చేసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ” గౌతమ్ గంభీర్ మీద ఉన్న కోపాన్ని అంపైర్ మీద చూపిస్తావా” అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.