Homeక్రీడలుIndian Cricket Team: టీమిండియా అంటే ముంబై, గుజరాతీలేనా? దేశంలో ఇంక లేరా?

Indian Cricket Team: టీమిండియా అంటే ముంబై, గుజరాతీలేనా? దేశంలో ఇంక లేరా?

Indian Cricket Team: కోట్ల మంది క్రికెట్‌ అభిమానులు, వేలాది మంది క్రికెట్‌ క్రీడాకారులు ఉన్న భారత దేశంలో టీమిండియా జట్టులోకి తీసుకొనే క్రమంలో రెండు రాష్ట్రాల వారికే అధిక ప్రాధాన్యం దక్కుతోంది. గత కొన్నేళ్లుగా టీమిండియా ఎంపికలో ‘ప్రాంతీయ’ పక్షపాతంపై కొనసాగుతోంది. టీమిండియా జట్టును ఎంపిక చేయడం ఆషామాషీ విషయం కాదు. ఆ జట్టులో చోటు అంటే ఎంతో అపురూపం. ఒక ఆటగాడిని ఎంపిక చేస్తున్నారంటే సెలక్టర్లు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ పక్షపాతాలకు అసలే తావు ఉండకూడదు. మీడియా అంత యాక్టివ్‌గా లేనపుడు.. సోషల్‌ మీడియా అసలే లేనపుడు. బీసీసీఐ పెద్దలు, సెలక్టర్లు పక్షపాత ధోరణితో కొందరు ఆటగాళ్లకు అవకాశాలిచ్చి భారత క్రికెట్‌ను దెబ్బ తీసిన ఉదంతాలు లేకపోలేదు. ఐతే గత కొన్నేళ్లలో జట్టు ఎంపిక చాలా వరకు పారదర్శకంగానే జరుగుతోంది. ఇప్పుడు కూడా ప్రతిభావంతులకే ఎక్కువగా అవకాశాలు దక్కుతున్నప్పటికీ.. రెండు రాష్ట్రాల వారికి కొంచెం అధిక ప్రాధాన్యం దక్కుతోందన్న చర్చ జరుగుతోంది.

నాడు ముంబైకి ప్రాధాన్యం..
1990వ దశకంలో టీమిండియాలో ముంబై ఆటగాళ్లదే ఆధిపత్యంగా ఉండేది. భారత క్రికెట్లో ముందు నుంచి ముంబయివాలాలదే హవా. బోర్డును నడిపించే పెద్దల్లో, సెలక్టర్లలో కూడా మహారాష్ట్ర వాళ్ల ఆధిపత్యమే ఉండేది. అందుకే ఒక దశలో సగం మంది ముంబయి ఆటగాళ్లే కనిపించేవారు. తర్వాత ఒక దశలో కర్ణాటక ఆటగాళ్ల ఆధిపత్యం పెరిగింది. ఆయా సమయాల్లో ప్రాంతీయ పక్షపాతం గురించి చర్చ జరిగింది.

ఐదుగురు సెలక్టర్లతో..
కానీ తర్వాత పరిస్థితులు మారాయి. సెలక్షన్‌ కమిటీలో అయిదు జోన్లకు ప్రాతినిధ్యం వహిస్తూ అయిదుగురు సెలక్టర్లకు చోటు కల్పించడంతో వారివారి జోన్ల నుంచి ఆటగాళ్లు ఉండేలా ఒత్తిడి తేవడం వల్లో ఏమో అన్ని ప్రాంతాల ఆటగాళ్లకూ చోటు లభించే పరిస్థితులు వచ్చాయి. అయితే అదే సమయంలో జట్టులో స్థానానికి అర్హులు కాకపోయినా కోటా పద్ధతిలో కొందరు ఆటగాళ్లు చోటు దక్కించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

మళ్లీ ముంబై, గుజరాత్‌ వాళ్లకే..
గతం సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం మహారాష్ట్ర, గుజరాత్‌ ఆటగాళ్ల ఆధిపత్యం జట్టులో ఎక్కువైందన్న చర్చ ప్రస్తుతం టెస్టుల్లో, వన్డేల్లో భారత జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ. కొంత కాలం టీ20ల్లో కూడా అతను జట్టును నడిపించాడు. రోహిత్‌ ముంబయివాలా అన్న సంగతి తెలిసిందే. అతడితోపాటు ఆసియా కప్‌ వన్డే జట్టులో భాగమైన సూర్యకుమార్‌యాదవ్, శార్దూల్‌ ఠాకూర్, శ్రేయస్‌ అయ్యర్‌ కూడా ముంబయి వాళ్లే. దీంతో 90 దశకంలో భారత క్రికెట్లో ముంబయి వాళ్లు హవా సాగించిన రోజులు గుర్తుకు వస్తున్నాయి. శార్దూల్‌ ఠాకూర్‌ ప్రదర్శన ఆశాజనకంగా లేకపోయినా అతడికి బోలెడన్ని అవకాశాలిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. సూర్యకుమార్‌ వన్డేల్లో నిరూపించుకోకపోయినా చాలా ఛాన్సులిచ్చారు. ఆసియా కప్‌ లోనూ అవకాశం ఇవ్వడం మీద ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శ్రేయస్‌ అయ్యర్‌ ప్రదర్శన ఓకే అయినప్పటికీ.. ఫిట్నెస్‌ మీద సందేహాలున్నా జట్టులో చోటు దక్కింది. ఇక ఐపీఎల్‌ జట్టు ముంబయి ఇండియన్స్‌ ఆటగాళ్లకు కూడా రోహిత్‌ కొంచెం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడనే వాదన కూడా ఉంది. ప్రస్తుత ఆసియా కప్‌ జట్టులో అయిదుగురు ముంబయి ఇండియన్స్‌ ఆటగాళ్లు ఉండడంపై సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్యే చీఫ్‌ సెలక్టర్‌ అయిన అజిత్‌ అగార్కర్‌ కూడా ముంబయి వాడే కావడంతో అక్కడి క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు దక్కుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గుజరాతీలకు ప్రాధాన్యం..
భారత జట్టులో గుజరాతీల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. అది ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం కావడం.. పైగా బీసీసీఐ కార్యదర్శిగా బోర్డు వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న జైషా కూడా గుజరాతీనే కావడంతో ఆ రాష్ట్రం వారికి ప్రాధాన్యం దక్కుతోందనే అభిప్రాయాలున్నాయి. మునుపెన్నడూ లేని స్థాయిలో ప్రస్తుతం గుజరాత్‌ ఆటగాళ్ల ఆధిపత్యం కనిపిస్తుండటం గమనించవచ్చు. ప్రపంచకప్‌కు ఎంపికైన బుమ్రా, జడేజా, హార్దిక్‌ పాండ్య, అక్షర్‌ పటేల్‌ గుజరాతీలే. ఐతే ఇందులో బుమ్రా, జడేజా, హార్దిక్‌ పాండ్యల సామర్థ్యం మీద ఎవరికీ సందేహాలేమీ లేవు. కానీ స్పిన్‌ ఆల్రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ ప్రదర్శన కూడా ఆశాజనకంగా లేకపోయినా చాన్నాళ్లుగా జట్టులో కొనసాగుతున్నాడు. ప్రపంచకప్‌కు సైతం అతను ఎంపికయ్యాడు. కొన్ని నెలల కిందట బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఒక మ్యాచ్లో కులీప్‌ యాదవ్‌ మంచి ప్రదర్శన చేసినా.. తర్వాతి మ్యాచ్‌కు అతడిని తప్పించి బరోడా పేసర్‌ జైదేవ్‌ ఉనద్కట్‌కు చోటివ్వడం తీవ్ర వివాదాస్పదం అయింది. సరైన ప్రదర్శన లేకుండానే ఉనద్కట్‌ను చాన్నాళ్లు జట్టులో కొనసాగించారు. చివరికి వెస్టిండీస్‌ పర్యటనలోను విఫలమవడంతో అతడిపై వేటు తప్పలేదు.

జట్టులో ఉన్న ప్రతి ఒక్కరి స్థానాన్నీ ప్రశ్నించలేం. చాలా వరకు ప్రతిభావంతులు, టీమిండియాలో ఉండటానికి అర్హులు అనదగ్గ వాళ్లే ఉన్నారు. కానీ ఓ మోస్తరు ప్రదర్శనతో జట్టులోకి వచ్చినపుడు.. విఫలమవుతున్నా అవకాశాలు అందుకున్నపుడు సందేహాలు రేకెత్తుతాయి. కొన్నేళ్లలో మహారాష్ట్ర, గుజరాత్ల నుంచి ఎక్కువమంది ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కుతుండటంతో.. మిగతా రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో ప్రతిభావంతులు లేరా.. ఉన్నా వారి మీద సెలక్టర్ల చూపు పడట్లేదా అనే చర్చ జరుగుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version