Bumrah And Nitish Kumar: మెల్ బోర్న్ మైదానానికి విశిష్టమైన గౌరవం ఉంది. ఈ గ్రౌండ్లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఓడిపోయినప్పటికీ.. అభిమానులు ఖుషి అయ్యే పనిని మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ నిర్వాహకులు చేశారు. మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో గౌరవనీయ క్రికెటర్ల జాబితాలో బుమ్రా, నితీష్ రెడ్డి పేర్లను ఏర్పాటు చేశారు. ఈ మైదానంలో భారత బౌలర్ బుమ్రా 9 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో నాలుగు, రెండవ ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా ప్రమాదకర ఆటగాడు హెడ్ ను రెండుసార్లు అవుట్ చేసి బుమ్రా సంచలనం సృష్టించాడు. అంతేకాదు ఇదే మ్యాచ్లో 200 వికెట్ల మైలురాయిని కూడా అందుకున్నాడు. అత్యల్ప బౌలింగ్ సగటుతో అతడు ఈ ఘనత సొంతం చేసుకోవడం విశేషం. వకార్ యూనిస్ 7,725, డెల్ స్టెయిన్ 7,848, కగిసో రబాడ 8,153 బంతుల్లో 200 వికెట్ల ఘనతను సొంతం చేసుకున్నారు. వారి తర్వాత బుమ్రా ఈ రికార్డును సాధించాడు. బుమ్రా 8484 బంతుల్లో 200 వికెట్లను పడగొట్టాడు . మెల్ బోర్న్ క్రికెట్ మైదానంలో బాక్సింగ్ డే టెస్ట్ లో 14.6 సగటుతో 24 వికెట్లను పడగొట్టాడు. అతడి స్ట్రైక్ రేటు 32.7, ఎకానమీ రేటు 2.68. 2024లో టెస్ట్ క్రికెట్లో బుమ్రా 13 మ్యాచ్ లు ఆడాడు. 14.92 సగటుతో, 30.16 స్ట్రైక్ రేట్ తో 71 వికెట్లు పడగొట్టాడు. తద్వారా అత్యుత్తమ బౌలర్ గా నిలిచాడు. క్రికెట్ ఫార్మాట్లో ఏ బౌలర్ కైనా ఈ ఏడాది ఇవే అత్యుత్తమ గణాంకాలు. ప్రస్తుత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కేవలం నాలుగు టెస్టులలోనే 30 వికెట్లను పడగొట్టి అత్యుత్తమ బౌలర్ గా బుమ్రా నిలిచాడు.
తొలి సెంచరీ
ఇదే మైదానంలో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా అత్యంత కష్టంలో ఉన్నప్పుడు యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేశాడు. టీమిండియాను కష్టాల నుంచి గట్టెక్కించాడు. 8వ ర్యాంకులో వచ్చిన అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. పెర్త్ టెస్ట్ ద్వారా జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన నితీష్ కుమార్ రెడ్డి.. స్ఫూర్తిదాయకమైన బ్యాటింగ్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నితీష్ కుమార్ రెడ్డి నాలుగు టెస్టులలో 41, 38*, 42, 42, 16 పరుగులు చేశాడు..మెల్ బోర్న్ మైదానంలో నాలుగో టెస్ట్ మూడో రోజు భారత్ 191/6 వద్ద ఉన్నప్పుడు నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ తో కలిసి 127 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్లో తొలి టెస్ట్ సెంచరీ సాధించి.. ఈ ఘనత అందుకున్న మూడవ అతిపిన్న వయస్కుడైన భారతీయ ఆటగాడిగా నితీష్ రెడ్డి రికార్డు నెలకొల్పాడు. బుమ్రా, నితీష్ కుమార్ రెడ్డి అరుదైన ఘనత సాధించిన నేపథ్యంలో మెల్ బోర్న్ మైదానంలో గౌరవనీయ క్రికెటర్ల జాబితాలో వీళ్ళ పేర్లను జత చేసిన దృశ్యం తాలూక వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.
Magnificent 5️⃣-wicket haul Special Maiden
Vice Captain Jasprit Bumrah and Nitish Kumar Reddy’s names are etched on the Honours Board of Melbourne Cricket Ground ✍️ #TeamIndia | #AUSvIND | @Jaspritbumrah93 | @NKReddy07 pic.twitter.com/4tat5F0N6e
— BCCI (@BCCI) December 31, 2024