Ishan Kishan Man of the Match: రాయ్ పూర్ వేదికగా జరిగిన రెండవ టి20 మ్యాచ్ లో టీమ్ ఇండియా ఏడు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. తద్వారా టి20 లలో హైయెస్ట్ చేజింగ్ రికార్డును తన పేరు మీద లిఖించుకుంది. భారత జట్టు సాధించిన విజయంలో సూర్య కుమార్ యాదవ్ (82), ఇషాన్ కిషన్ (76) కీలకపాత్ర పోషించారు. టీమిండియా లక్ష్య చేదనలో వీరోచితంగా పోరాటం చేశారు. టీమ్ ఇండియా ఏడు వికెట్ తేడాతో విజయం సాధించిన తర్వాత.. రాయ్ పూర్ మైదానంలో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో మైదానంలోకి వచ్చారు ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్. వీరిద్దరూ మూడో వికెట్ కు ఏకంగా 122 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. 48 బంతుల్లోనే వారిద్దరు ఈ స్థాయిలో పరుగులు చేయడం విశేషం. వీరిద్దరూ ఈ స్థాయిలో దూకుడు కొనసాగించడంతో టీమిండియా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
టీమిండియా చేజింగ్ మొదలు పెట్టినప్పుడు.. తొలి ఓవర్ లో ఆరు పరుగులు చేసింది. అప్పటికి హెన్రీ బౌలింగ్ లో సంజు శాంసన్ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత డఫీ వేసిన రెండో ఓవర్ తొలి బంతికే అభిషేక్ శర్మ (0) అవుట్ అయ్యాడు . ఈ దశలో సూర్య కుమార్ యాదవ్ మైదానంలోకి వచ్చాడు. సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ డఫి బౌలింగ్ లో నిదానంగా ఆడారు. ఈ ఓవర్ లో రెండు పరుగులు మాత్రమే వచ్చాయి.
ఫౌల్క్స్ వేసిన మూడో ఓవర్ లో ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ ఓవర్ లో కిషన్ మూడు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. బౌలర్ ఎక్స్ ట్రా ల రూపంలో ఏడు పరుగులు ఇచ్చాడు. తద్వారా ఈ ఓవర్ లో టీమిండియా 24 పరుగులు సాధించింది. ఒకరకంగా ఈ ఓవర్ టీమ్ ఇండియాకు గేమ్ చేంజర్ గా నిలిచింది. నాలుగో ఓవర్లో 10, ఐదవ ఓవర్ లో 12, ఆరో ఓవర్లో 21 పరుగులు సాధించిన ఇషాన్, సూర్య కుమార్ యాదవ్ జోడి న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించింది. ఇదే క్రమంలో కిషన్ 21 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
వాస్తవానికి కిషన్ చూపించిన దూకుడు వల్లే న్యూజిలాండ్ బౌలర్లు వెనకడుగు వేశారు. తీవ్ర ఒత్తిడిలో లయ తప్పారు. రెండు సంవత్సరాల విరామం తర్వాత ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చాడు. జట్టు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాడు. అందువల్లే సూర్య కుమార్ యాదవ్ ఎక్కువ పరుగులు చేసినప్పటికీ.. కిషన్ కు మెన్ అఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.