Ind W Vs SA W T20: సిరీస్ విజయం లేకుండా వెనక్కి.. టీమిండియా చేతిలో చిత్తయిన దక్షిణాఫ్రికా..

టీమిండియాలో ముందుగా పూజా వస్త్రాకర్ (4/13), రాధా యాదవ్(3/6), అరుంధతి రెడ్డి (1/14), శ్రేయాంక పాటిల్(1/19), దీప్తి శర్మ(1/21)దూకుడుగా బౌలింగ్ చేయడంతో దక్షిణాఫ్రికా 17.1 ఓవర్లలో 84 పరుగులకే ఆలౌట్ అయింది.. బ్రిట్స్ చేసిన 20 పరుగులే సౌత్ ఆఫ్రికా జట్టులో అత్యధిక స్కోరు. బోష్(17), కాప్(10) రెండంకెల స్కోర్ చేశారు. భారత బౌలర్ల ధాటికి ఒకానొక దశలో దక్షిణాఫ్రికా జట్టు 50 పరుగులకే కుప్పకూలుతుందని అందరూ భావించారు. కానీ చివరి దశలో ఆ జట్టు బ్యాటర్లు కాస్త ప్రతిఘటించడంతో ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది.

Written By: Anabothula Bhaskar, Updated On : July 10, 2024 8:33 am

Ind W Vs SA W T20

Follow us on

Ind W Vs SA W T20: టీమిండియా దూకుడుతో 3 వన్డేల సిరీస్ క్లీన్ స్వీప్ అయింది.. ఏకైక టెస్ట్ భారత్ వశమైంది. చివరికి టి20 సిరీస్ సమం అయింది. దీంతో దక్షిణాఫ్రికాకు రిక్త హస్తమే మిగిలింది. చెన్నై వేదికగా మంగళవారం జరిగిన చివరి t20 మ్యాచ్ లో భారత్ ఏకపక్ష విజయాన్ని సాధించింది. తొలి టి20 మ్యాచ్లో విజయం సాధించిన దక్షిణాఫ్రికా జట్టు.. ఈ సిరీస్ పై కన్నేసింది. అయితే రెండవ టి20 మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. మూడవ టి20 మ్యాచ్ లో భారత్ తిరుగులేని విజయం సాధించింది.. ఏకంగా 10 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా జట్టును మట్టి కరిపించింది.\

టీమిండియాలో ముందుగా పూజా వస్త్రాకర్ (4/13), రాధా యాదవ్(3/6), అరుంధతి రెడ్డి (1/14), శ్రేయాంక పాటిల్(1/19), దీప్తి శర్మ(1/21)దూకుడుగా బౌలింగ్ చేయడంతో దక్షిణాఫ్రికా 17.1 ఓవర్లలో 84 పరుగులకే ఆలౌట్ అయింది.. బ్రిట్స్ చేసిన 20 పరుగులే సౌత్ ఆఫ్రికా జట్టులో అత్యధిక స్కోరు. బోష్(17), కాప్(10) రెండంకెల స్కోర్ చేశారు. భారత బౌలర్ల ధాటికి ఒకానొక దశలో దక్షిణాఫ్రికా జట్టు 50 పరుగులకే కుప్పకూలుతుందని అందరూ భావించారు. కానీ చివరి దశలో ఆ జట్టు బ్యాటర్లు కాస్త ప్రతిఘటించడంతో ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది. మైదానంపై లభిస్తున్న తేమను సద్వినియోగం చేసుకున్న భారత బౌలర్లు.. నిప్పులు చెరిగే బంతులు వేశారు. కనీసం బంతిని టచ్ చేసేందుకు కూడా దక్షిణాఫ్రికా బ్యాటర్లు భయపడ్డారంటే.. భారత జట్టు బౌలింగ్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

తొలి టీ 20 మ్యాచ్లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు అదరగొట్టారు. కానీ మూడవ టి20 మ్యాచ్ విషయానికి వచ్చేసరికి తేలిపోయారు. ముఖ్యంగా నాలుగో ఓవర్లో లారా (9) ను ఔట్ చేసి దక్షిణాఫ్రికా పతనానికి శ్రేయాంక పాటిల్ నాంది పలికింది.. ఆ తర్వాత పూజ, రాధా దక్షిణాఫ్రికా బ్యాటర్లను వణికించారు. వికెట్ల మీద వికెట్లు తీస్తూ సఫారీ జట్టును కకా వికలం చేశారు. ఇక సౌత్ ఆఫ్రికా విధించిన 85 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత జట్టు 10.5 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించింది. స్మృతి మందాన (54*; 40 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సర్లు) దూకుడుగా బ్యాటింగ్ చేయగా.. షెఫాలీ వర్మ (27*; 25 బంతుల్లో మూడు ఫోర్లు) నిదానంగా బ్యాటింగ్ చేయడంతో టీమిండియా అత్యంత సులువుగా లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో మూడు టి20 మ్యాచ్ ల సిరీస్ ను హర్మన్ ప్రీత్ సేన 1-1 తో సమం చేసింది. అంతకుముందు టీమిండియా మూడు వన్డేల సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. ఏకైక టెస్టులోనూ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.