Suryakumar Yadav: దారుణమైన ఆట తీరు.. పేలవమైన ప్రదర్శన.. చెత్త ఆట.. పసలేని బ్యాటింగ్.. పదనులేని బౌలింగ్.. ఇది ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై జట్టు ఓడిపోగానే మీడియాలో ప్రచురితం, ప్రసారమవుతున్న వార్తలకు పెడుతున్న శీర్షికలు. వాస్తవానికి ముంబై జట్టు ఆట తీరు నాసిరకంగా ఉంది. అలాంటప్పుడు మీడియాలో అలాంటి శీర్షికలు కాకపోతే ఇంకా ఎలాంటి శీర్షికలు పెడతారు? ఇక సోషల్ మీడియా సంగతి అయితే చెప్పాల్సిన పనిలేదు. ఏకి పడేస్తున్నారు. దుమ్ము దులిపెస్తున్నారు. హార్దిక్ పాండ్యానైతే ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ముంబై జట్టుకు ఒక విజయం అనివార్యం. లేకుంటే ఆ జట్టు మరిన్ని విమర్శలు ఎదుర్కోక తప్పదు.
ఐపీఎల్లో ఐదుసార్లు ట్రోఫీ దక్కించుకున్న ముంబై ఇండియన్స్ జట్టు.. గత రెండు సీజన్లలో దారుణమైన ఆట తీరు ప్రదర్శించింది. దీంతో ఈసారి ఆ జట్టు యాజమాన్యం కెప్టెన్సీ ని మార్చింది. గుజరాత్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాను తీసుకొచ్చింది. ఇక అప్పుడు మొదలైంది బాగోతం.. వరుస విమర్శలు.. సోషల్ మీడియాలో ట్రోల్స్.. చెప్ప తీరుగాలేని తిట్లు.. మైదానంలో పూర్వ కెప్టెన్ రోహిత్ శర్మ.. ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యా అభిమానుల మధ్య గొడవలు.. మామూలుగా లేదు.. దీనికి తోడు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్లలోనూ ముంబై ఓటములే ఎదుర్కొంది. కోల్ కతా చేతిలో ఓడిపోయింది.. హైదరాబాద్ ఎదుట సాగిలపడింది.. రాజస్థాన్ ముందు డీలా పడింది. ఇలాంటి సమయంలో ఆ జట్టుకు ఒక విజయం కావాలి. ఆ విజయం కోసమే ఇటీవల ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా సోమనాథుడి దగ్గరికి వెళ్ళాడు.. పాలతో అభిషేకం చేశాడు. జలంతో శుభ్రం చేశాడు. పూలతో అలంకరించాడు. తెల్లటి వస్త్రాలు ధరించి.. విభూది పెట్టుకుని.. సోమనాథుడి ఎదుట సాష్టాంగ నమస్కారం చేశాడు.
హార్దిక్ పాండ్యా పూజలకు సోమనాథుడు మెచ్చాడో.. కనుకరించాడో తెలియదు కానీ.. వరుస ఓటములతో ఉన్న ముంబై జట్టులోకి మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ రానున్నాడు. ఆదివారం ఢిల్లీ జట్టుతో జరిగే మ్యాచ్లో అతడు ఆడబోతున్నాడు. గాయం కారణంగా ఎన్ని రోజులపాటు సూర్య కుమార్ యాదవ్ క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ లో చికిత్స పొందుతున్నాడు. జూన్లో మొదలయ్యే టి20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ అతని జాతీయ జట్టుకు కూడా దూరంగా ఉంచింది. ఈ నేపథ్యంలో ఇటీవల అతడు ఫిట్ నెస్ పరీక్షలకు హాజరయ్యాడు. అందులో సఫలీకృతుడు కావడంతో నేషనల్ క్రికెట్ అకాడమీ బాధ్యులు బీసీసీఐ అధికారులకు నివేదిక ఇచ్చారు. దీంతో వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ముంబై జట్టులోకి సూర్యకుమార్ యాదవ్ ఎంట్రీ కి మార్గం సుగమం అయింది. ఆదివారం జరిగే మ్యాచ్ ద్వారా అతడు మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. వరుస ఓటములతో విమర్శలు ఎదుర్కొంటున్న ముంబై జట్టుకు.. సూర్య రాక వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తుందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.
ఐపీఎల్ లో సూర్యకుమార్ యాదవ్ కు అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు 139 మ్యాచ్ లు ఆడిన సూర్యకుమార్ యాదవ్ 3,249 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ 143.32. గత సీజన్లో సూర్య కుమార్ యాదవ్ 605 పరుగులు చేశాడు. అయితే గాయం కారణంగా క్రికెట్ కు దూరమైన సూర్య కుమార్ యాదవ్.. ఆదివారం నాటి మ్యాచ్ ద్వారా మైదానంలోకి అడుగుపెడుతున్న అతడు..గత ఏడాది ఫామ్ కొనసాగించాలని ముంబై అభిమానులు కోరుకుంటున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More