IPL 2023: అత్యంత ఆసక్తికరంగా సాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది. శనివారం సాయంత్రం పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో వార్నర్ సేన ఓటమిపాలు కావడంతో ఇంటిదారి పట్టింది. ఈ సీజన్ లో దారుణమైన ఆట తీరుతో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది ఢిల్లీ జట్టు. దీంతో ప్లే ఆఫ్ కు దూరమై ఈ ఎడిషన్ నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా నిలిచింది ఢిల్లీ క్యాపిటల్స్.
ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్రయాణం ముగిసింది. ఈ ఈ ఏడాది ఆశించిన స్థాయిలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రాణించలేకపోవడంతో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. ఈ సీజన్ లో లీగ్ దశ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది ఢిల్లీ. ఈ ఏడాది ఢిల్లీ జట్టు ప్రయాణం చూస్తే గతంలో కెప్టెన్ గా వ్యవహరించిన రిషబ్ పంత్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. దూకుడుగా ఆడుతూ జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలకంగా వ్యవహరించే పంత్ లేకపోవడంతో జట్టు ఇబ్బందులను ఎదుర్కొంది. మిడిలార్డర్లో జట్టుకు మంచి ఇన్నింగ్స్ ఆడే ఆటగాళ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
నాలుగు మ్యాచ్ ల్లో మాత్రమే గెలిచిన ఢిల్లీ..
ఈ సీజన్ లో ఢిల్లీ జట్టు దారుణమైన ఆట తీరు కనబరిచింది. ప్లే ఆఫ్ కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో చేజేతులా ఓడింది. ఇప్పటి వరకు ఢిల్లీ జట్టు 12 మ్యాచ్ లు ఆడగా నాలుగింటిలో మాత్రమే గెలిచి ఎనిమిది పాయింట్లు సాధించింది. మరో ఎనిమిది మ్యాచ్ ల్లో ఓటమిపాలైంది. ఇంకా ఈ జట్టు రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అయితే, మిగిలిన రెండు మ్యాచ్ ల్లో భారీ విజయాలు నమోదు చేసినప్పటికీ ప్లే ఆఫ్ కు చేరే అవకాశం ఢిల్లీ జట్టుకు లేదు. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఢిల్లీ జట్టు అట్టడుగు స్థానంలో నిలిచింది. శనివారం పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ జట్టు 31 పరుగులు తేడాతో ఓటమి పాలైంది.
సులభంగా గెలవాల్సిన మ్యాచ్ లో చేతులెత్తేసిన బ్యాటర్లు..
శనివారం సాయంత్రం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో పంజాబ్ జట్టుతో ఢిల్లీ జట్టు కీలక మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో జట్టు దారుణమైన ఆట తీరు కనబరిచింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టానికి 167 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభు షిమ్రాన్ 65 బంతుల్లో 103 పరుగులు చేయగా, మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేయడంతో 167 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్వల్ప లక్ష్యమే అయినప్పటికీ ఢిల్లీ జట్టు ధాటిగా ఆడింది. డేవిడ్ వార్నర్ 27 బంతుల్లో 54 పరుగులు చేయగా, సాల్ట్ 17 బంతుల్లో 21 పరుగులు చేశాడు. దీంతో ఢిల్లీ జట్టు 6.1 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ జట్టు సులభంగానే లక్ష్యాన్ని చేధిస్తుందని అంతా భావించారు. అయితే, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఢిల్లీ జట్టు ఘోరంగా ఓటమిపాలైంది. 19 పరుగులు వ్యవధిలోనే ఆరు వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడి ఓటమి అంచుల్లో చేరింది. అయితే, ఆ తరువాత వచ్చిన బ్యాటర్లు ఎవరు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుని ఈ సీజన్ నుంచే నిష్క్రమించాల్సిన పరిస్థితి తెచ్చుకుంది ఢిల్లీ జట్టు. అభిమానుల ఆశలను వమ్ము చేస్తూ ఢిల్లీ జట్టు తన ప్రయాణాన్ని ముగించింది.
Web Title: The first tem leave from ipl 2023 delhi capitals
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com