Duleep Throphy : ఓవర్ నైట్ స్కోర్ 309/7 తో ఇండియా – బీ జట్టు ఆదివారం బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే మరో 23 పరుగులు జోడించి మిగతా మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో మొదటి ఇన్నింగ్స్ లో ఇండియా – బీ జట్టు 332 పరుగులకు ఆల్ అవుట్ అయింది.. ఓపెనర్, కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్(157 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.. 286 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్) అదరగొట్టాడు. ఇదే దశలో అన్షుల్ కాంబోజ్ వరుసగా వికెట్లు పడగొట్టాడు. అతడు ఎనిమిది వికెట్లు సొంతం చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో అన్షుల్ 27.5 ఓవర్లు బౌలింగ్ చేశాడు. 69 పరుగులు ఇచ్చి, 8 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
నాలుగు వికెట్లు నష్టపోయి
193 పరుగుల లీడ్ తో ఇండియా – సీ జట్టు రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. చివరి రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు నష్టపోయి 128 రన్స్ చేసింది. కెప్టెన్ రుతు రాజ్ గైక్వాడ్(62) హాఫ్ సెంచరీ చేశాడు. రజత్ పాటిదార్(42) ఆకట్టుకున్నాడు. అయితే తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ ఒక పరుగు మాత్రమే చేసి అవుట్ కావడం విశేషం. సాయి సుదర్శన్ 11 పరుగులు మాత్రమే చేసి నిరాశపరచాడు. రాహుల్ చాహర్ 2 వికెట్లు పడగొట్టాడు. ముఖేష్, ముషీర్ చెరో వికెట్ సొంతం చేసుకున్నారు.. కాగా, అంతకుముందు ఇండియా – సీ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 525 రన్స్ చేసింది.. ఇషాన్ కిషన్ 111 పరుగులు చేశాడు. మానవ్ సుతార్ 82 రన్స్ చేశాడు. ఇంద్రజిత్ 78 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ 58 పరుగులు చేశాడు.. ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్ చలో నాలుగు వికెట్లు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో పాయింట్ల పట్టికలో ఇండియా – సీ జట్టు 9 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఇండియా – బీ జట్టు 7 పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది.. ఇండియా – ఏ జట్టు 6 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇండియా – డీ జట్టు పాయింట్ల ఖాతా ప్రారంభించలేదు. బంగ్లాదేశ్ టోర్నీకి ఎంపికైన ఆటగాళ్లు చెన్నై వెళ్లడంతో.. వారి స్థానంలో కొంతమంది యువ ఆటగాళ్లకు అవకాశం లభించింది. అందులో కొంతమంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగా.. మిగతా ఆటగాళ్లు వినియోగించుకోలేకపోయారు. మొత్తానికి ఇండియా – బీ, ఇండియా – సీ జట్ల మధ్య పరుగుల ప్రవాహం కొనసాగినప్పటికీ.. మ్యాచ్ డ్రా గా ముగిసింది. కొంతమంది ఆటగాళ్లకు తమ ప్రతిభను చూపించే అవకాశం లభించింది. వారికి జాతీయ జట్టులోకి ప్రవేశ మార్గం సుగమం అవుతుందని క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.