Water used in the production : జలమే జగతికి బలం. ఆ జలం లేని నాడు జగతి మొత్తం కాలగర్భంలో కలిసిపోతుంది. అందుకే నీళ్లు ఉన్నచోట గొప్ప గొప్ప చరిత్రలు విలసిల్లాయి. సాంస్కృతిక వైభవానికి కారణమయ్యాయి. సింధు నది ప్రవహించింది కాబట్టే హరప్పా సంస్కృతి వెలుగొందింది.. దాయాది దేశం నేటికీ కొద్దో గొప్పో టమాటలు, ఆలుగడ్డలు, గోధుమలు, ఇతర పంటలు పండిస్తోందంటే దానికి కారణం సింధూ నది ప్రవాహమే.. ఇండియాకు ఆ పేరు రావడానికి కారణం కూడా ఇండస్ అనే నది వల్లే. ఇలా చెప్పుకుంటూ పోతే నీళ్ల చరిత్ర ఒడవదు. నీరు దాహాన్ని తీర్చుతుంది. దేహాన్ని నిర్జలీకరణకు గురికాకుండా చేస్తుంది. పంట చేనును తడుపుతుంది. పండిన పంటను శుద్ధి చేస్తుంది. ఇలా ప్రతి అంశంలో నీరు ముడిపడి ఉంది. మనిషి జీవితమే జలం మీద ఆధారపడి ఉంది. అందుకే నీటి కోసం చరిత్రలో యుద్ధాలు జరిగాయి. వర్తమానంలో గొడవలు జరుగుతున్నాయి. భవిష్యత్తు కాలంలోనూ పోరాటాలు సాగుతాయి. ఈ భూమ్మీద మూడో వంతు నీరు ఉన్నప్పటికీ.. అందులో తాగడానికి పనికి వచ్చేది.. అవసరాలకు ఉపయోగపడేది కొంత నీరు మాత్రమే.
నిత్య జీవితంలో..
నిత్యజీవితంలో తాగడానికి, శుభ్రం చేసుకోవడానికి మాత్రమే నీరు అవసరం పడుతుంది అనుకుంటాం. కానీ నీటితో చేసే పనులు చాలా ఉన్నాయి. నీటి ద్వారానే జరిగే పనులు అనేకం ఉన్నాయి. మనం వేసుకునే టీ షర్ట్ తయారుచేయడానికి 2,700 లీటర్ల నీళ్లు అవసరం.. ఒక జీన్స్ ప్యాంటు రూపొందించడానికి 11,000 లీటర్ల నీరు కావాలి. ఒక స్మార్ట్ ఫోన్ తయారు చేయాలంటే 1000 లీటర్ల నీరు వినియోగించాలి. బాటిల్ వైన్ తయారు చేయాలంటే 1000 లీటర్ల నీటిని ఖర్చు చేయాలి. ఒక కప్పు కాఫీ మన నోటిదాకా రావాలంటే 140 లీటర్ల నీరు అవసరం. ఎందుకంటే కాఫీ గింజలను శుద్ధి చేసే ప్రక్రియలో మీ ఎక్కువగా వినియోగిస్తారు. ఒక గ్లాస్ నారింజ రసం తయారు చేయాలంటే 140 లీటర్ల నీరు అవసరం. బ్రెడ్ లోఫ్ తయారు చేయాలంటే 400 లీటర్ల నీటిని ఉపయోగించాలి. ఒక గుడ్డును ఉత్పత్తి చేయాలంటే 200 లీటర్ల నీరు అవసరం. చికెన్ బ్రెస్ట్ రూపొందాలంటే 4,300 లీటర్ల నీరు కావాలి. గొడ్డు మాంసంతో బర్గర్ తయారు చేయాలంటే 400,000 లీటర్ల నీరు ఖర్చు చేయాలి. మైక్రో చిప్ తయారు చేయాలంటే 32,000 లీటర్ల నీటిని వినియోగించాలి. టాయిలెట్ పేపర్ రోల్ తయారు చేయాలంటే 1,400 లీటర్ల నీరు అవసరం.. కాటన్ బాల్ రూపొందించాలంటే 200 లీటర్ల నీటిని వినియోగించాలి.. ఒక పౌండ్ పరిమాణంలో గోధుమలను ఉత్పత్తి చేయాలంటే తక్కువలో తక్కువ వెయ్యి లీటర్ల నీటిని ఉపయోగించాలి..
తయారీ నుంచి శుద్ధి వరకు..
అయితే పై ఉత్పత్తులను తయారు చేయడం నుంచి మొదలుపెడితే శుద్ధి చేసే ప్రక్రియ వరకు ఉపయోగించిన నీటి ఆధారంగా ఈ లెక్కలను జల రంగ నిపుణులు వెల్లడించారు. ఇలా నీటిని వినియోగిస్తున్న నేపథ్యంలో.. నీటి వనరులపై పడుతున్న ఒత్తిడిని ప్రపంచ దేశాలకు వివరించారు. అందువల్లే ఐక్యరాజ్యసమితి water is precious don’t waste even single drop . ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఈ సూక్తిని తెరపైకి తెచ్చింది. ప్రపంచ దేశాలు దీనిని పాటించాలని సూచించింది.