Asia Cup India Jersey 2025: ప్రపంచ క్రికెట్ మొత్తాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి శాసిస్తోంది. వేలకోట్ల ఆదాయంతో అత్యంత ధనికమైన బోర్డుగా తులతూగుతోంది. అంతేకాదు దేశవ్యాప్తంగా అత్యంత ఖరీదైన మైదానాలు నిర్మిస్తోంది. సరికొత్త ప్రమాణాలతో మైదానం నెలకొల్పి ప్రపంచ క్రికెట్ గతిని మొత్తం మార్చేస్తోంది. ఇంగ్లీష్ దేశాలలో క్రికెట్ పుట్టినప్పటికీ.. ఆ క్రీడకు భారతదేశాన్ని రాజధానిగా మార్చేస్తోంది. అందువల్లే భారత క్రికెట్ నియంత్రణ మండలికి ప్రయోజకకర్తలుగా వ్యవహరించడానికి పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలు పోటీపడుతుంటాయి.
మన క్రికెట్ జట్టుకు ప్రయోజక కర్తగా ఉండడానికి వేలకోట్లు ఖర్చు పెడుతుంటాయి కార్పొరేట్ కంపెనీలు. రోజులు మొత్తం ఒకే తీరుగా ఉండవన్నట్టుగా.. ఇప్పుడు టీమిండియా పరిస్థితి దారుణంగా మారింది. త్వరలో ఆసియా కప్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో టీమిండియా అధికారిక ప్రయోజక కర్త లేకుండానే బరిలోకి దిగింది. టీమిండియా ప్లేయర్లు వేసుకునే జెర్సీలపై ఎటువంటి స్పాన్సర్ లోగో లేకుండానే తయారు చేశారు. ఆసియా కప్ లో ఆడే ఆటగాళ్లకు సంబంధించిన జెర్సీలను బీసీసీఐ విడుదల చేసింది. తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో వీటిని పోస్ట్ చేసింది. ఈ జెర్సీలను ధరించిన ప్లేయర్లు సరికొత్తగా కనిపిస్తున్నారు. అయితే జెర్సీలపై అధికారిక స్పాన్సర్ లోగో లేకపోవడంతో కాస్త లోటుగా కనిపిస్తోంది.
ఇటీవల భారత ప్రభుత్వం ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ నిరోధానికి చట్టాన్ని తీసుకొచ్చింది. దీంతో ఇంతకాలం టీమ్ ఇండియాకు అధికారిక ప్రయోజక కర్తగా వ్యవహరించిన ఓ ఆన్లైన్ బెట్టింగ్ సంస్థ తప్పుకుంది. దీంతో టీమ్ ఇండియాకు అధికారిక ప్రయోజక కర్త లేకుండా పోయింది. స్వల్పకాలంలో ప్రయోజక కర్తను నియమిస్తే ఆదాయం అంతగా రాదని భావించిన మేనేజ్మెంట్.. ఈ జెర్సీలను రూపొందించింది. అయితే ఆసియా కప్ వరకే టీమ్ ఇండియాకు అధికారిక స్పాన్సర్ ఉండరని.. ఆ తర్వాత టోర్నీలలో అధికారిక స్పాన్సర్ ఉంటారని తెలుస్తోంది. టీమిండియాకు అధికారిక స్పాన్సర్ గా ఉండడానికి చాలా కంపెనీలు ముందుకొచ్చాయని తెలుస్తోంది. ఎవరు ఎక్కువ బిడ్ దాఖలు చేస్తే వారికే ఆ హక్కులు ఇస్తామని మేనేజ్మెంట్ చెబుతోంది. స్పాన్సర్ ద్వారా వేలకోట్ల ఆదాయాన్ని సంపాదించాలని మేనేజ్మెంట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఈనెల తొమ్మిది నుంచి దుబాయ్ వేదికగా ఆసియా కప్ సమరం షురూ అవుతుంది. మరోవైపు ఈ టోర్నీలో పాకిస్తాన్ తో భారత్ తలపడుతుంది. అయితే ద్వైపాక్షిక సిరీస్ లలో మాత్రం భారత్ పాకిస్తాన్ తో ఎట్టి పరిస్థితుల్లో పోటీ పడదు. క్రితం జరిగిన ఆసియా కప్ లో టీమిండియా విజేతగా నిలిచింది.