Shreyas Iyer Captaincy: మొత్తానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి శ్రేయస్ అయ్యర్ మీద కనికరం చూపించింది. ఇన్ని రోజులపాటు అతడికి అవకాశాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన మేనేజ్మెంట్.. చివరికి తాను చేసిన తప్పును తెలుసుకుంది. అయ్యర్ ప్రతిభ మీద నమ్మకం ఉంచిన మేనేజ్మెంట్.. అవకాశం ఇచ్చింది. అది కూడా ఏకంగా సారధిగా నియమించింది. దీంతో అయ్యర్ అభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
అయ్యర్ అద్భుతమైన ఆటగాడు. బీభత్సంగా బ్యాటింగ్ చేస్తాడు. చురుకుగా ఫీల్డింగ్ చేస్తాడు. నాయకుడి లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. గత ఐపీఎల్లో షారుక్ ఖాన్ జట్టును విజేతగా నిలిపాడు. ఈ ఏడాది ప్రీతి జట్టును ఐపీఎల్ లో ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. అంతకుముందు జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టాడు. 2023లో జరిగిన పరిమిత ఓవర్ల వరల్డ్ కప్లో సత్తా చూపించాడు. కానీ అతడికి టి20 వరల్డ్ కప్ లో అవకాశం లభించలేదు. ఇక ఇటీవల ఆసియా కప్ లో జట్టును ఎంపిక చేసినప్పుడు.. అయ్యర్ కు అవకాశం దక్కలేదు. అంతకుముందు ఆంగ్ల జట్టుతో జరిగిన సుదీర్ఘ ఫార్మాట్ లోనూ అతడికి చోటు లభించలేదు. దీంతో మేనేజ్మెంట్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయి.
ఆ జట్టుకు సారధిగా..
ఆసియా కప్.. అంతకుముందు ఇంగ్లాండ్ సిరీస్ కు ఎంపిక చేయకపోవడంతో అయ్యర్ అభిమానుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో అయ్యర్ కు టీమిండియా మేనేజ్మెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ఆస్ట్రేలియా ఏజట్టుతో ఈనెల 19న లక్నో వేదికగా జరిగే అనధికారిక టెస్ట్ సిరీస్, వన్డే సిరీస్ కు అయ్యర్ ను సారధిగా ఎంపిక చేసింది. అయ్యర్ సారధ్యంలో భారత జట్టుకు ఈశ్వరన్, జగదీశ్వరన్, సాయి సుదర్శన్, జురెల్, దేవ దత్ పడికల్, హర్ష్ దూబే, ఆయుష్ బదోని, నితీష్ కుమార్ రెడ్డి, తనుష్ కోటియన్, ప్రసిద్ కృష్ణ, బ్రార్, ఖలీల్ అహ్మద్, మానవ్ సుతార్ ఆడతారు.