IND Vs BAN: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఆడే ప్రతి టెస్ట్ మ్యాచ్ ముఖ్యమైనది కావడంతో భారత్.. ప్రతి విషయాన్ని సీరియస్ గా తీసుకుంటోంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కు ముందు చెన్నై వేదికగా ఒక శిక్షణ శిబిరాన్ని కూడా బీసీసీఐ ఏర్పాటు చేసింది. తొలి టెస్ట్ కు ఎంపికైన ఆటగాళ్లు మొత్తం చెన్నై చేరుకున్నారు. ఇందులో టీమిండియా స్టార్ ఆటగాడు, కింగ్ విరాట్ కోహ్లీ కూడా చెన్నై చేరుకున్నాడు. లండన్ నుంచి అతడు నేరుగా శుక్రవారం చెన్నై వచ్చాడు. తనకు కేటాయించిన హోటల్ గదికి వెళ్లిపోయాడు. 18 నెలల సుదీర్ఘ విరామం తర్వాత సొంత గడ్డపై జరిగే సిరీస్ లో విరాట్ కోహ్లీ ఆడుతున్నాడు. వ్యక్తిగత కారణాలవల్ల ఈ ఏడాది జనవరిలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ కు విరాట్ దూరంగా ఉన్నాడు. గత ఏడాది మార్చిలో స్వదేశంలో చివరిసారిగా విరాట్ కోహ్లీ టెస్ట్ సిరీస్ లో ఆడాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు.
విరాట్ కోహ్లీ తన సహచర ఆటగాళ్లతో కలిసి శనివారం నుంచి ప్రాక్టీస్ మొదలు పెడతాడు. విరాట్, కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, బుమ్రా వంటి ఆటగాళ్లు ఇప్పటికే చెన్నై చేరుకున్నారు. వారు శనివారం శిక్షణలో భాగస్వాములు కానున్నారు. బంగ్లాదేశ్ పై విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. సొంత గడ్డపై 2019లో చివరిసారిగా బంగ్లాదేశ్ – భారత్ గులాబీ రంగు బంతితో టెస్ట్ సిరీస్ ఆడాయి. బంగ్లాదేశ్ తో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఆరు టెస్ట్ మ్యాచ్ లు ఆడాడు. 54.62 సగటుతో 437 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ తో పాటు డబుల్ సెంచరీ, అర్థ సెంచరీ ఉన్నాయి. ఇక త్వరలో జరిగే సిరీస్లోనూ విరాట్ తన విశ్వరూపాన్ని చూపిస్తాడని.. బంగ్లాదేశ్ జట్టుకు నిద్రలేని రాత్రులను పరిచయం చేస్తాడని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
విరాట్ కోహ్లీ కొంతకాలంగా తన కుటుంబంతో కలిసి లండన్ లో ఉంటున్నాడు. స్వదేశంలో ఇటీవల విలాసవంతమైన ఇంటిని నిర్మించుకున్నప్పటికీ.. అతడు తన కుటుంబంతో కలిసి లండన్ లోనే జీవిస్తున్నాడు. ఇటీవలే అతని భార్య అనుష్క శర్మ అకాయ్ అనే బాబుకు జన్మనిచ్చింది. టి20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత విరాట్ నేరుగా లండన్ వెళ్లిపోయాడు. మళ్లీ ఇప్పుడు ఇండియాకు తిరిగివచ్చాడు.