Rohit Sharma: ఈ ఐపీఎల్ సీజన్లో ఏ జట్టూ ఎదుర్కొని ఒత్తిడిని, విమర్శలను ముంబై ఇండియన్స్ జట్టు చవిచూస్తోంది. కెప్టెన్ గా రోహిత్ శర్మ పక్కన పెట్టి హార్థిక్ పాండ్యాను నియమించిన నాటి నుంచి ఆ జట్టు అనేక కుదుపులకు గురవుతోంది. ముంబై ఇండియన్స్ తో పోలిస్తే తక్కువ శ్రేణి ఆటగాళ్లు ఉన్న రాజస్థాన్ ఇప్పటికే వరుసగా రెండు విజయాలు సాధించింది. మరీ ముఖ్యంగా ఢిల్లీ జట్టుతో గురువారం జరిగిన మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. వరుస విజయాలతో పాయింట్లు పట్టికలో చెన్నై సరసన నిలిచింది. కానీ ముంబై జట్టు అన్ని రంగాలలో మెరుగ్గా ఉన్నప్పటికీ సరిగ్గా ఆడలేక పోతోంది. దీనంతటికీ ముంబై ఓనర్ల నిర్ణయమే కారణమని ఫాన్స్ ఆరోపిస్తున్నారు.
ముంబై జట్టు ఐపీఎల్ 17వ సీజన్లో ఇప్పటివరకు రెండు మ్యాచ్ లు ఆడింది. గుజరాత్ జట్టు జరిగిన మ్యాచ్ లో ఏడు పరుగుల తేడాతో ఓడిపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తో జరిగిన మ్యాచ్ లో 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ రెండు మ్యాచ్ ల్లోనూ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీసుకున్న నిర్ణయాలే ముంబై జట్టును ఓడించాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆరోపిస్తున్నారు.” కీలకమైన బౌలర్లను ఉపయోగించుకోలేదు. బుమ్రా వంటి బౌలర్ తో కీలక సమయాల్లో బౌలింగ్ వేయించలేదు. దీనివల్ల ముంబై జట్టు ఓడిపోవాల్సి వచ్చిందని” అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను హార్దిక్ పాండ్యా బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేయాలని ఆదేశించడాన్ని అభిమానులు తప్పు పడుతున్నారు. ఇలాంటి నిర్ణయాల వల్లే ముంబై జట్టు ఓడిపోతుందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కెప్టెన్సీ పోయిన నాటి నుంచి ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చాలా కూల్ గా కనిపిస్తున్నాడు. మైదానంలో సీరియస్ గా ఉండే అతడు తోటి ఆటగాళ్లపై చలోక్తులు విసురుతున్నాడు. తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. బ్యాటింగ్ లోనూ మునుపటి ఉత్సాహాన్ని కనబరుస్తున్నాడు. దీంతో రోహిత్ అభిమానులు సోషల్ మీడియాలో అతడికి అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు..”కెప్టెన్సీ పోయిందనే బాధ కాకపోతే మాకు మునుపటి రోహిత్ కనిపిస్తున్నాడు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముంబై జట్టు ఈ స్థాయిలో ఓటములు ఎదుర్కోవడానికి యాజమాన్యం తీసుకున్న తప్పుడు నిర్ణయాలే కారణమని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
హైదరాబాద్ జట్టుతో ఓటమి అనంతరం ముంబై జట్టు యజమాని నీతా అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ రోహిత్ శర్మతో చర్చలు జరిపాడు. ఈ చర్చల నేపథ్యంలో రోహిత్ కు మళ్ళీ కెప్టెన్సీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ముంబై జట్టు రెండు వర్గాలుగా విడిపోయిందని ప్రచారం జరుగుతోంది. సీనియర్ ఆటగాళ్లు బుమ్రా, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ లాంటివారు రోహిత్ కు అండగా ఉన్నారని.. కిషన్ లాంటి ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా నాయకత్వాన్ని సమర్థిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై ఇంతవరకు ముంబై యాజమాన్యం స్పందించలేదు.. ఒకవేళ ముంబై జట్టు రెండు వర్గాలుగా విడిపోతే ఐపీఎల్ లో మరింత ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
Rohit Sharma teasing his former opening partner Mayank Agarwal pic.twitter.com/PKNkSqZw4w
— CricTracker (@Cricketracker) March 27, 2024