Jagan: మరి నేను అంత వెర్రి పుష్పంలా కనిపిస్తున్నానా?ఓ మాదిరిగా కూడా కనిపించడం లేదా? బ్రహ్మానందం చెప్పే ఈ కామెడీ డైలాగ్ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఏపీ ప్రజలు ఇలానే భావిస్తున్నారు. వివేక హత్య కేసు నుంచి తన పాలన గురించి జగన్ చెప్పేసరికి ప్రజలు ఇలానే రియాక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో ఆయన చెబుతున్న మాటలు సామాన్యులను సైతం ఇబ్బంది పెడుతున్నాయి. చివరికి సొంత పార్టీ శ్రేణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయాల పట్ల అవగాహన ఉన్నవారు, సమకాలీన అంశాలపై ఎంతో కొంత అవగాహన ఉన్నవారికి నేను విన్నది నిజమేనా? సీఎం జగన్ అలా మాట్లాడుతున్నారేంటి? అని అనిపించక మానదు.
వివేకానంద రెడ్డిని చంపింది.. చంపించింది.. ఎవరో దేవుడుకి తెలుసు అంటూ జగన్ కొత్త పల్లవి అందుకున్నారు. పైగా దీనికి కడప జిల్లా ప్రజలను సాక్ష్యంగా పెట్టారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని ఆ జిల్లా ప్రజలు పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటారు. ఆ కుటుంబంపై అంతటి అభిమానం. రాజశేఖర్ రెడ్డి తరువాత వివేకానంద రెడ్డికి జిల్లా ప్రజలు గౌరవిస్తూ వచ్చారు. కానీ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో జగన్ కు రాజకీయంగా అండగా నిలబడ్డారు. కానీ వివేక హత్య తర్వాత ఆ కుటుంబ అభిమానుల్లో ఒక రకమైన చేంజ్ కనిపిస్తోంది. వివేకను ఎవరు హత్య చేశారు ఊహించలేని స్థితిలో ప్రజలు లేరు. కానీ ఎందుకో జగన్ ఈ అంశాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చారు. దేవుడు, రాజకీయ ప్రత్యర్థులు, కడప జిల్లా ప్రజల అంటూ ఏవేవో కొత్త మాటలు చెబుతున్నారు.పైగా నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ఇబ్బందిగా మారుతాయని వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
పాలన వైఫల్యాల విషయంలో సైతం ఆయన చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేవు.మూడు రాజధానులు ఏర్పాటు చేశాను.. 17 మెడికల్ కాలేజీలు కట్టించాను.. రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చేశాను.. ప్రజలకు నేరుగా లక్షల కోట్లు ఇచ్చాను.. విద్యా వ్యవస్థను సమూలంగా మార్పు చేశాను.. అంటూ చెబుతున్నారు. అయితే మూడు రాజధానులు ఎక్కడ కట్టారు? మెడికల్ కాలేజీలు ఎక్కడ నిర్మించారు అని ప్రజలు ఆరా తీయడం ప్రారంభించారు. ప్రస్తుతం సోషల్ మీడియా రాజ్యమేలుతున్న రోజులు ఇవి. కు గ్రామం నుంచి రాష్ట్ర రాజధాని వరకు ప్రతి విషయాలు ఇప్పుడు ప్రజలకు ఇట్టే తెలిసిపోతున్నాయి. కానీ ప్రజలు అమాయకులుగా భావించి జగన్ తన ఎన్నికల ప్రచారంలో ఏవేవో మాట్లాడుతున్నారు. అవి సొంత పార్టీ నేతలను సైతం ఆశ్చర్య పరుస్తున్నాయి. ఈ తరహా ప్రచారం చేటు తెస్తుందని వారిలో ఆందోళన కనిపిస్తోంది.