Anil Teja : ఆంధ్ర కుర్రాడికి వరల్డ్ కప్ లో ఛాన్స్.. కానీ మన దేశం తరపున కాదు!

నెదర్లాండ్‌ నేషనల్‌ జట్టుకు ఆడుతున్న తెలుగు కుర్రాడికి తాజాగా వరల్డ్‌ కప్‌ జట్టులోనూ స్థానం లభించింది.

Written By: NARESH, Updated On : September 7, 2023 8:54 pm

anil teja

Follow us on

Anil Teja : వన్డే వరల్డ్‌కప్‌-2023 టోర్నీకి గడువు సమీపిస్తోంది. దీంతో ఆయా దేశాలు తమ జట్లను ఎంపిక చేస్తున్నాయి. రెండు రోజుల క్రితం భారత జట్టును ఎంపిక చేశారు. తాజాగా నెదర్లాండ్స్‌ క్రికెట్‌ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఐసీసీ ఈవెంట్‌లో పాల్గొనే 15 మంది సభ్యుల పేర్లను గురువారం వెల్లడించింది. అదే విధంగా ఇద్దరు రిజర్వు ప్లేయర్లను కూడా ఎంపిక చేసినట్లు తెలిపింది. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ డచ్‌ జట్టును ముందుండి నడిపించనున్నారు.

తెలుగు క్రికెటర్‌కు ఛాన్స్‌..
నెదర్లాండ్‌ నేషనల్‌ జట్టుకు ఆడుతున్న తెలుగు కుర్రాడికి తాజాగా వరల్డ్‌ కప్‌ జట్టులోనూ స్థానం లభించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పుట్టి న్యూజిలాండ్‌లో పెరిగిన అనిల్‌ తేజ.. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో నెదర్లాండ్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఆంధ్రకు చెందిన తేజ నిడమనూరు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో అద్భుత శతకంతో చెలరేగి.. నెదర్లాండ్స్‌ను గెలిపించాడు.

స్కాట్లాండ్‌పై నెగ్గి వరల్డ్‌ కప్‌కు అర్హత..
జింబాబ్వేలో జరిగిన క్వాలిఫయర్స్‌లో నెదర్లాండ్స్‌ అదరగొట్టిన విషయం తెలిసిందే. వన్డే వరల్డ్‌ కప్‌కు అర్హత సాధించేందుకు తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అసాధారాణ పోరాటం కనబరిచింది. తమ చివరి మ్యాచ్‌లో అనూహ్యరీతిలో స్కాట్లాండ్‌పై నెగ్గింది. 44 ఓవర్లలో లక్ష్యం 278 పరుగులుగా ఉన్న సమయంలో.. బాస్‌ డి లీడె అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడి శతకానికి తోడు జుల్ఫికర్‌ అండగా నిలవడంతో నెదర్లాండ్స్‌ మరో 7 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను ఛేదించింది. ఐదోసారి వన్డే ప్రపంచకప్‌ టోర్నీలోకి నెదర్లాండ్స్‌ అడుగుపెట్టింది. 2011 తర్వాత మళ్లీ భారత్‌లోనే ఆ జట్టు బరిలోకి దిగనుండటం విశేషం.

తొలి మ్యాచ్‌ పాకిస్తాన్‌తో
అక్టోబర్‌ 6న తమ తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ హైదరాబాద్‌లో జరుగుతుంది. తదుపరి నవంబర్‌ 11న బెంగళూరులో భారత్‌ను ఢీకొట్టనుంది.

వన్డే ప్రపంచకప్‌-2023 జట్టుకు నెదర్లాండ్స్‌ జట్టు
స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్, వికెట్ కీపర్), కొలిన్ అకెర్మాన్, షరీజ్ అహ్మద్, వెస్లీ బారెసి, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, ఎస్ఏ ఎంగెల్బ్రెచ్ట్, ర్యాన్ క్లెయిన్, బాస్ డి లీడే, పాల్ వాన్ మీకెరెన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, తేజ నిడమనూరు, మాక్స్ ఓ డౌడ్, విక్రమ్ సింగ్, సాకిబ్ జుల్ఫికర్.