Para Olympic Champion Deepti : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్ప నిర్ణయం.. పారాలింపిక్ ఛాంపియన్ దీప్తికి ఊహించని నజరానా

ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత దీప్తి భావోద్వేగానికి గురైంది. " దీన్ని నమ్మలేకపోతున్నాను. ఇదంతా కల లాగా ఉంది

Written By: NARESH, Updated On : September 7, 2024 9:46 pm

Telangana Chief Minister Revanth Reddy Nazarana for Para Olympic Champion Deepti

Follow us on

Para Olympic Champion Deepti  : పారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్ పోటీలలో తెలంగాణ బిడ్డ దీప్తి జీవాంజి సత్తా చాటింది. ఏకంగా కాంస్య పతకం సాధించి సరికొత్త ఘనత సృష్టించింది. విశ్వ క్రీడా వేదికపై తెలంగాణ ప్రతిష్టను సగర్వంగా చాటింది.. దీప్తి కాంస్యం సాధించిన అనంతరం ఆమె జీవితానికి సంబంధించిన వెలుగు చీకట్లు మీడియాలో ప్రధానంగా ప్రసారమయ్యాయి. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.

పారాలింపిక్స్ లో కాంస్యం సాధించిన అనంతరం దీప్తి గురువారం సాయంత్రం ఢిల్లీ చేరుకుంది. కేంద్ర మంత్రిని కలిసింది. అనంతరం ఆమె శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకోగా.. ఆమెకు తెలంగాణ ప్రభుత్వం తరఫున స్పోర్ట్స్ అధికారులు ఘన స్వాగతం పలికారు. శనివారం దీప్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన కార్యాలయంలో కలిసింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి దీప్తిని సన్మానించారు. వెండి జ్ఞాపిక బహుకరించారు. అనంతరం ఆమెకు వరంగల్లో 500 గజాల స్థలం, కోటి రూపాయల నగదు, గ్రూప్ -2 స్థాయి ఉద్యోగాన్ని ఇస్తున్నటు ప్రకటించారు.అలాగే దీప్తికి శిక్షకుడిగా వ్యవహరించిన నాగపురి రమేష్ కు 10 లక్షలు ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ మేరకు అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ దీప్తి నేపథ్యం

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి.. పుట్టుకతోనే వైకల్యంతో జన్మించింది. ఆమె తల చిన్నగా ఉంటుంది. పెదవులు పెద్దగా ఉంటాయి. చిన్నప్పుడు ఆమెను చూసిన తోటి వాళ్లు గేలి చేసేవారు. గ్రహాంతరవాసి అని హేళన చేసేవారు. అయితే ఆమెను కల్లెడ స్కూల్ బిఈటి ప్రోత్సహించారు. అనంతరం ఇండియా జూనియర్ అథ్లెటిక్స్ చీఫ్ కోచ్ నాగపురి రమేష్ శిక్షణ ఇవ్వడంతో దీప్తి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. దీప్తిని రమేష్ హైదరాబాద్ తీసుకొచ్చి గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్రంలో చేర్పించాడు . గచ్చిబౌలిలో శిక్షణ పొంది ఆమె మరింత రాటు తేలింది.

కంచు పతకాన్ని సాధించింది

రమేష్ శిక్షణలో.. పుల్లెల గోపీచంద్ అండదండలతో దీప్తి తన బతుకు చిత్రాన్ని మార్చుకుంది. ఆసియా పారా గేమ్స్ 400 మీటర్ల విభాగంలో స్వర్ణం సాధించింది. వరల్డ్ ఛాంపియన్ గా ఆవిర్భవించింది. ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంది. అంతేకాదు పారిస్ లోని పారాలింపిక్స్ లో కంచు పతకాన్ని సాధించింది..పారాలింపిక్స్ లో మహిళల 400 మీటర్ల టీ -20 విభాగంలో సత్తా చాటింది. ఫైనల్స్ లో 55.82 సెకండ్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ఏకంగా మూడో స్థానంలో నిలిచి కంచు పతకాన్ని సొంతం చేసుకుంది.

ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత..

ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత దీప్తి భావోద్వేగానికి గురైంది. ” దీన్ని నమ్మలేకపోతున్నాను. ఇదంతా కల లాగా ఉంది. పారాలింపిక్స్ లో కాంస్యం దక్కించుకోవడం గొప్ప అనుభూతి కలిగిస్తున్నప్పటికీ.. వచ్చే పోటీలలో స్వర్ణం గెలుచుకోవడమే నా ప్రధాన లక్ష్యం. నాకు నా విజయానికి సహకరించారు. నా తల్లిదండ్రులు నా ఉన్నతి కోసం కృషి చేశారు. ఎనిమిది సంవత్సరాలపాటు తీవ్ర కష్టాన్ని ఎదుర్కొన్నాను. మైదానానికి మాత్రమే పరిమితమయ్యాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలని” దీప్తి పేర్కొంది.