Duleep Trophy 2024 : త్వరలో జరిగే బంగ్లా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ లకు సమర్థవంతమైన బృందాన్ని ఎంపిక చేయాలని భావించి.. బీసీసీఐ ఈసారి సరికొత్తగా దులీప్ ట్రోఫీ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇండియా – సీ, డీ జట్లు తలపడ్డాయి. అనంతపురం వేదికగా ఇండియా – డీ జట్టుతో జరిగిన మ్యాచ్లో సీ జట్టు 4 వికెట్ల తేడాతో గెలుపును సొంతం చేసుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. డీ జట్టుకు శ్రేయస్ అయ్యర్, సీ జట్టుకు రుతు రాజ్ గైక్వాడ్ కెప్టెన్ లుగా వ్యవహరిస్తున్నారు.
మూడోరోజు 206/8 తో ఇండియా – డీ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. 236 రన్స్ కు ఆల్ అవుట్ అయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో సత్తా చాటిన అక్షర్ పటేల్.. రెండవ ఇన్నింగ్స్ లో అదే జోరు కొనసాగించలేకపోయాడు. శనివారం ఆట మొదలైన కొంత సమయానికే అతడు అవుట్ అయ్యాడు. అక్షర్ పెవిలియన్ చేరిన కొంతసేపటికే డీ జట్టు చివరి వికెట్ నష్టపోయింది.. డీ జట్టులో దేవదత్ 56, శ్రేయస్ అయ్యర్ 54 రన్స్ చేశారు. సీ జట్టులో మానవ్ సుతార్ ఏకంగా 7 వికెట్లు సాధించాడు. అనంతరం 23 3 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన సీ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి.. 61 ఓవర్లలో ఈ టార్గెట్ ను చేజ్ చేసింది. ఆర్యన్ జుయాల్ 74 బంతుల్లో 47, రుతురాజ్ గైక్వాడ్ 48 బంతుల్లో 46, రజత్ పాటిధార్ 77 బంతుల్లో 44, అభిషేక్ పోరెల్ 35*, మానవ్ సుతార్ 19 పరుగులు చేసి జట్టును గెలిపించారు. సరన్ష్ నాలుగు వికెట్లు దక్కించుకున్నాడు.
అంతకుముందు టాస్ ఓడిపోయి.. ఇండియా – డీ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 164 రన్స్ మాత్రమే చేసింది. అక్షర్ పటేల్ 86 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. విజయ్ కుమార్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఇండియా – సీ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. 168 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఇంద్రజిత్ 72 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. హర్షిత్ రాణా నాలుగు వికెట్లు పడగొట్టాడు. శ్రేయస్ అయ్యర్ ఆధ్వర్యంలో ఇండియా – డీ జట్టు ఓడిపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి..” గౌతమ్ గంభీర్ కు శ్రేయస్ అయ్యర్ ప్రియ శిష్యుడు. ఐపీఎల్ లో కోల్ కతా జట్టును విజేతగా నిలిపాడు. కానీ ఆ తర్వాత అదే స్థాయిలో ఆటు తీరు కొనసాగించలేకపోతున్నాడు. ఇటీవల శ్రీలంక టోర్నీలో విఫలమయ్యాడు. ఇప్పుడేమో దులీప్ ట్రోఫీలో అతడి జట్టు ఓడిపోయింది. పాపం ఇలాగైతే అయ్యర్ పరిస్థితి ఏమిటని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. “ధోని శిష్యుడు చేతిలో.. గౌతమ్ గంభీర్ శిష్యుడు ఓటమిపాలయ్యాడని.. మొత్తానికి దులీప్ ట్రోఫీలో సంచలనం చోటుచేసుకుందని” సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.