ICC Odi Ranking 2023: నాలుగేళ్ల తర్వాత ఇదే మొదటి సారి.. టీమిండియా ఆటగాళ్ళా.. మజాకా!

ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో టీం ఇండియా స్టార్ ఆటగాళ్లు గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సత్తా చాటారు. వీరి ముగ్గురు టాప్ టెన్ లో నిలిచారు.

Written By: Bhaskar, Updated On : September 14, 2023 8:22 am

ICC Odi Ranking 2023

Follow us on

ICC Odi Ranking 2023: ఆసియా కప్ లో టీం ఇండియా వరుస విజయాలు సాధించడంతో ఫైనల్ కు దూసుకెళ్లింది. బంతి, బ్యాట్ తో ఆటగాళ్లు రాణిస్తున్నారు. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో భారత్ భారీ స్కోర్ సాధించింది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, హాఫ్ సెంచరీలు సాధించి ఆకట్టుకున్నారు. ఇక శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో కుల దీప్ యాదవ్ మెరుగైన వికెట్లు తీశాడు. జట్టు అవసరాలకు అనుగుణంగా అటు బ్యాట్, ఇటు బంతితో ఆటగాళ్లు సత్తా చాటుతుండటంతో ఆసియా కప్ లో టీమిండియా కు ఎదురే లేకుండా పోతోంది. స్వదేశంలో త్వరలో వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో.. టీమిండియా సాధిస్తున్న వరుస విజయాలు జట్టుకు బూస్ట్ ఇస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే జట్టు సాధిస్తున్న విజయాల వల్ల ఆటగాళ్ల వ్యక్తిగత ర్యాంకులు కూడా మెరుగుపడ్డాయి. ఐసీసీ ప్రకటించే వ్యక్తిగత ప్రదర్శన జాబితాలో నాలుగు సంవత్సరాల తర్వాత టాప్ టెన్ లోకి ముగ్గురు టీం ఇండియా ఆటగాళ్లు ప్రవేశించారు.

ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో టీం ఇండియా స్టార్ ఆటగాళ్లు గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సత్తా చాటారు. వీరి ముగ్గురు టాప్ టెన్ లో నిలిచారు. ఆసియా కప్ లో మెరుగైన పరుగులు సాధించిన గిల్ మూడవ స్థానం నుంచి రెండవ స్థానానికి చేరుకున్నాడు. ఇది గిల్ కెరియర్ లో అత్యుత్తమ ర్యాంకు. ఇక ప్రస్తుత టీమిండియా బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో ఆటగాళ్లపరంగా గిల్ టాప్ లో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం గ్రిల్ ఖాతాలో 759 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇదే ఆసియా కప్ లో మూడు వరుస హాఫ్ సెంచరీలతో చెలరేగిన కెప్టెన్ రోహిత్ శర్మ రెండు స్థానాలను మెరుగుపరుచుకుని 11 నుంచి 9 వ ర్యాంకుకు చేరుకున్నాడు. రోహిత్ శర్మ ఖాతాలో 77 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. పాకిస్తాన్ పై సెంచరీ తో అదరగొట్టిన కోహ్లీ కూడా రెండు స్థానాలు ఎగబాకి 8వ స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 717 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి.

వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ముగ్గురు భారతీయ ఆటగాళ్లు టాప్ టెన్ లో నిలవడం నాలుగేళ్ల తర్వాత ఇదే మొదటిసారి. చివరిగా 2018 సెప్టెంబర్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శిఖర్ ధవన్ టాప్ టెన్ లో నిలిచారు. ఆ సమయంలో వీరి ముగ్గురు ఏకంగా టాప్ 6 లో ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టుల్లోనూ టాప్ టెన్ లో ఉన్నాడు. 759 రేటింగ్ పాయింట్లతో పదవ స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో టాప్ టెన్ లో టీం ఇండియా నుంచి రోహిత్ శర్మ ఒక్కడే ఉండడం విశేషం. ఇక తాజా వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో టాప్ టెన్ లో పాకిస్తాన్ నుంచి కూడా ముగ్గురు బ్యాటర్లు ఉన్నారు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం మొదటి స్థానంలో ఉండగా.. ఇమామ్ ఉల్ హక్ ఐదు, ఫఖర్ జమాన్ పదవ ర్యాంకులో ఉన్నారు. ఇక బౌలింగ్ ర్యాంకింగ్స్ లో టీం ఇండియా నుంచి ఇద్దరు ఆటగాళ్లు టాప్ టెన్ లో చోటు దక్కించుకున్నారు. ఇప్పటికే 9 వికెట్లు పడగొట్టిన కులదీప్ యాదవ్ ఐదు స్థానాలు ఎగబాకి ఏడవ ర్యాంకుకు చేరుకున్నాడు. హైదరాబాద్ పేసర్ సిరాజ్ ఒక స్థానం దిగజారి 9వ ర్యాంకులోకి పడిపోయాడు.