https://oktelugu.com/

Ind vs Ban : మరో సున్నా చుట్టిస్తారా? నేడు ఉప్పల్ లో బంగ్లా తో టీమ్ ఇండియా చివరి t20

ఇప్పటికే టెస్ట్ సిరీస్ 2-0 తేడాతో గెలుచుకున్న టీమిండియా.. మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లోనూ అదే స్థాయిలో ప్రదర్శన చేస్తోంది. ఇప్పటికే 2-0 తేడాతో సిరీస్ గెలుచుకుంది. చివరిదైన మూడో మ్యాచ్ ఆదివారం హైదరాబాదులోని ఉప్పల్ మైదానంలో రాత్రి 7:30 నుంచి మొదలుకానుంది.

Written By:
  • NARESH
  • , Updated On : October 12, 2024 / 11:28 AM IST

    India vs Bangladesh(6)

    Follow us on

    Ind vs Ban : బ్యాటింగ్ లో అదరగొడుతోంది. బౌలింగ్ లో సత్తా చాటుతోంది. పైగా కుర్రాళ్ళు జోరు మీద ఉన్నారు. అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. బంగ్లా జట్టుకు చుక్కలు చూపిస్తున్నారు. ఇదే క్రమంలో చివరిదైన మూడవ టి20 లోనూ ప్రత్యర్థి జట్టును ఊడ్చిపడేయాలనే లక్ష్యంతో టీమిండియా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో దసరా రోజు యువ ఆటగాళ్లు పండగ సంబరాన్ని అభిమానులకు ఎలా అందిస్తారో వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న యువ టీమిండియాను ఆడుకోవడం బంగ్లా జట్టుకు చాలా కష్టం. సిరీస్ గెలిచిన నేపథ్యంలో భారత జట్టులో అనేక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టు జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ద్వారా తెలుస్తోంది. యువ జట్టు అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తోంది. రెండవ టి20 మ్యాచ్లో పవర్ ప్లే లో మూడు వికెట్ల కోల్పోయినప్పటికీ.. భారత్ 222 రన్స్ టార్గెట్ ను బంగ్లాదేశ్ ఎదుట నిర్దేశించిందంటే మామూలు విషయం కాదు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి బ్యాట్ తో పెను విధ్వంసం సృష్టించాడు. టి20 లలో తొలి హాఫ్ సెంచరీ చేశాడు. అంతేకాదు 34 బంతుల్లో 74 పరుగులు చేసి వారెవ్వా అనిపించాడు. ఫోర్లకంటే సిక్సర్లే ఎక్కువ బాది.. తాను ఎంత ప్రమాదకరమైన ఆటగాడినో నిరూపించాడు. ఆ ఇన్నింగ్స్ తో అతడి స్థానానికి ఇక డోకా లేదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు తెలుగు గడ్డపై తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న నితీష్.. ఎలాంటి ప్రదర్శన చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

    అభిషేక్ శర్మ సైతం

    ఈ మైదానంలో యువ ఆటగాడు అభిషేక్ శర్మకు మెరుగైన రికార్డు ఉంది. ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు తరఫున అతడు మెరుపు ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నా. 249.12 స్ట్రైక్ రేట్ తో ఏకంగా 284 రన్స్ చేశాడు. గత రెండు మ్యాచ్. లలో సత్తా చాటలేకపోయిన అతడు.. ఈ మ్యాచ్ లో కనుక రెచ్చిపోతే బంగ్లా బౌలర్లకు పీడకలే.

    ఇక పేస్ బౌలర్లు అర్ష్ దీప్ సింగ్, మయాంక్ యాదవ్, స్పిన్ బౌలర్లు వరుణ్, సుందర్ సత్తా చాటుతున్నారు. గత మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఏకంగా ఏడుగురు బౌలర్లతో బౌలింగ్ చేయించాడు.. అందరూ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.. అయితే ఈ మ్యాచ్ లోనూ అలాంటి ప్రయోగమే చేస్తాడని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇప్పటికే సిరీస్ గెలిచిన నేపథ్యంలో రవి బిష్ణోయ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ, హర్షిత్ రాణా కు అవకాశం ఇస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

    వర్షం కురిస్తే

    వాతావరణ శాఖ నివేదిక ప్రకారం శనివారం హైదరాబాదులో వర్షం కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమవుతుందని.. పూర్తిగా రద్దు చేసే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మైదానం బ్యాటింగ్ కు స్వర్గధామం. ఐపీఎల్ లో ఈ మైదానంపై సన్ రైజర్స్ ఆటగాళ్లు ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించారు. ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ఆటగాళ్లు 277 రన్స్ చేసి రికార్డు సృష్టించారు. గత ఏడు ఇన్నింగ్స్ లలో ఈ మైదానంపై తక్కువలో తక్కువ 200 పరుగులు నమోదు అయ్యాయి. ఇక్కడ ఆడిన 2 t20 లలో భారత్ విజయం సాధించింది. చివరిగా 2022లో ఆస్ట్రేలియా జట్టును ఆరు వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియా 187 రన్స్ చేస్తే.. ఒక బంతి మిగిలి ఉండగానే భారత్ ఆ లక్ష్యాన్ని చేదించింది. ఇక్కడ మైదానం పై నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది.

    జట్ల అంచనా ఇలా

    భారత్: సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్, హర్షిత్ రాణా/ మయాంక్ యాదవ్, అర్ష్ దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి/ రవి బిష్ణోయ్, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి.

    బంగ్లాదేశ్

    పర్వేజ్, లిటన్ దాస్, ముస్తాఫిజుర్, తన్జిమ్, తస్కిన్, రిషద్, మెహదీ హసన్, హసన్మిరాజ్, మహమ్మదుల్లా, తౌహీద్, శాంటో.