https://oktelugu.com/

Bastar Dussehra : బస్తర్ దసరా గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

రాములోరు ఇక్కడే 14 ఏళ్లు వనవాసం చేశారని నమ్ముతుంటారు అక్కడి ప్రజలు. ఈ దండకారణ్యంలో ఆదివాసీలు దంతేశ్వరీ మాతకు పూజలు నిర్వహిస్తారు.

Written By: NARESH, Updated On : October 12, 2024 11:24 am

Bastar Dussehra

Follow us on

Bastar Dussehra : పెత్తర అమావాస్య తర్వాత నుంచి తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ఇక దసరా నవరాత్రులు మొత్తం కూడా చాలా ఘనంగా జరుగుతాయి. ఈ వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయి. మొత్తానికి నవరాత్రి ఉత్సవాలు మాత్రం 9 రోజులపాటు నిర్వహిస్తారన్నమాట. 9 రోజులు ఫుల్ గా సంబరాలు చేసుకొని ఆ తర్వాత వాడ వాడల్లో అమ్మవారిని కొలుచుకుంటూ ఆడబిడ్డలు చాలా సంతోషంగా ఉంటారు. బతుకమ్మ, దుర్గమ్మల పూజలు చాలా ఘనంగా జరుగుతాయి. అయితే ముఖ్యంగా దసరా పండుగ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది మైసూర్‌.

మైసూరుకు లక్షల సంఖ్యంలో జనాలు గుమిగూడి దసరా ఉత్సవాలు జరుపుకుంటారు. కానీ, బస్తర్‌లో మూడు నెలల పాటు దసరా ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడి దసరా పండుగ ఉత్సవాల్లో గిరిజనులు చేసే నృత్యం చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఎక్కడ లేని విధంగా చాలా భిన్నంగా దసరా ఉత్సవాలు జరుగుతాయి ఈ ప్రాంతంలో.. ముఖ్యంగా బస్తర్‌లో దంతేశ్వరీ ఆలయంలో మరింత ఘనంగా జరుగుతాయి ఉత్సవాలు. అయితే ఈ ప్రాంతంలో రథోత్సవం కూడా ప్రత్యేకం. ఛత్తీస్‌ఘడ్‌లో ఉండే బస్తర్‌లో ఎక్కువ శాతం తెగవారు నివసిస్తుంటారు. బస్తర్‌ ఉత్సవాల సమయంలో అందరూ ఒక్క చోటికి చేరి కన్నులపండువగా ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు.

అయితే కాకతీయుల కాలం నాటి నుంచి బస్తర్ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయట. అన్నమదేవుడు, పురషోత్తమదేవుడు ఈ సంబరాలను ప్రారంభించారు. పటజాత్రతో ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారు ప్రజలు. ఢిల్లీ సుల్తానులు అన్నమదేవున్ని బలవంతంగా తీసుకువెళ్తున్న సమయంలో తప్పించుకుని ఇక్కడ రాజ్యం ఏర్పాటు చేసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే వీరిని కాకతీయల వంశీయులు అంటారు. మరో కథన ప్రకారం.. బస్తర్ రాజవంశం ఈ దసరాను ప్రారంభించారట. రాజా పురుషోత్తమ దేవ్ 15వ శతాబ్దంలో దసరా ఉత్సవాలు ప్రారంభించారని చెబుతున్నారు కొందరు. అయితే ఇవి దేశంలోని ఇతర ప్రాంతాల్లో జరిగే దసరా పండుగలా జరగకుండా భిన్నంగా జరుగుతుంటాయి. ఒకరోజు ముందుగా చిన్న పాపను రాజవంశ దేవత దంతేశ్వరి దేవి ఆవహిస్తుందట. ఆ పాప ఒక చెక్క ఖడ్గాన్ని పట్టుకొని ఒక వీరుడి భంగిమలో నిల్చుంటుంది. ఆ సమయంలో రాజు ఆమె అనుమతి తీసుకుని ప్రముఖులందరూ చూస్తుండగా తన రాజ్యాన్ని దివాన్ చేతిలో పెడతారు. ఇదంతా కూడా కున్వర్ అమావాస్య రోజు జరుగుతుంది. ఆ తర్వాత పది రోజులు పాటు ఆ దివానే సంస్థానానికి జమీందారుగా వ్యవహరిస్తుంటాడు. రాజు కుటుంబం మొత్తం సామాన్యుల్లా దేవి ఆరాధన లోనే ఉండిపోతుంటారు.

రెండవ రోజున “ప్రతిపాద ” చేస్తుంటారు. అంతే హారతి, నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తారు అన్నమాట. 9వ రోజున పల్లకిలో రాజప్రసాదానికి తీసుకువచ్చిన దంతేశ్వరి విగ్రహానికి రాజకుటుంబమే స్వాగతం పలుకుతుంది. పదవ రోజున అమ్మవారి అనుమతితో రాజ్యాన్ని తిరిగి స్వీకరిస్తారు. అదే రోజు దర్బార్ ఏర్పాటు చేసి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు కూడా. ఆ రోజే దసరా పండుగ జరుగుతుంది. ఈ రోజుతో దసరా వేడుకలు పూర్తి అవుతాయి. దీనికి ముందు దంతీశ్వరి దేవి కొలువై ఉండే జగదల్పూర్ ఆలయం వద్ద రాజకుటుంబం,బస్తర్ ప్రజలు కలిసి పూజలు జరుపుకుంటున్నారు. అప్పుడు జరిగే ఉత్సవాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అన్నట్టుగా ఉంటుంది. ఇప్పటికీ అదే ఆచారాన్ని కొనసాగిస్తున్నారు వారసులు.

అంతే కాదు మరో కథనం కూడా ఉంది. అదేంటంటే..పురాతన కాలంలో శ్రీరాముడు వనవాసానికి తమ ప్రాంతానికే వచ్చి అరణ్యవాసం చేశారట. రాములోరు ఇక్కడే 14 ఏళ్లు వనవాసం చేశారని నమ్ముతుంటారు అక్కడి ప్రజలు. ఈ దండకారణ్యంలో ఆదివాసీలు దంతేశ్వరీ మాతకు పూజలు నిర్వహిస్తారు. ఇక్కడి ఆడవాళ్లు అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు చీరలు ధరించి తమ సంప్రదాయపు నృత్యాలు చేస్తూ పండగను ఎంజాయ్ చేస్తారు. ఒకవిధంగా ఇది గర్భా డ్యాన్స్‌ మాదిరి ఉంటుంది. ఈ దర్బార్‌ తో దసరా వేడుకలు ముగుస్తాయి.