Homeక్రీడలుTeam India: టీమిండియాకు పసందైన గుజరాతీ వంటకాలు..

Team India: టీమిండియాకు పసందైన గుజరాతీ వంటకాలు..

Team India: జిలేబి, ఖమ్న్, ఫప్డా ఖాఖ్రా, గథియా, తెప్లా, దహి టికారి, వఘెరెల రోటీ, కదీనీ.. ఇవేం పేర్లు? ఇలా ఉన్నా ఏంటి.. ఇదేమైనా కాలకేయ భాషనా? అనుకుంటున్నారా.. ఆగండాగండి.. అది మన భాషనే.. మీకు నోరు తినకపోయినా కాస్త జాగ్రత్తగా పలకండి. ఎందుకంటే అవేవో కాలకేయులు పలికే పదాలు కావు. అచ్చమైన గుజరాతి వంటకాలు.. మరి ఇప్పుడు ఎందుకు వాటి ప్రస్తావన అంటారా.. అందుకు ఒక కారణం ఉంది.. ఇంతకీ అదేమిటో ఈ కథనం చదవండి మీకే తెలుస్తుంది..

కోటి విద్యలు కూటి కొరకే అంటారు.. లక్షల కోట్లకు అధిపతి అయిన ముకేశ్ అంబానీ.. వందల రూపాయలు సంపాదించే అడ్డా మీద కూలి.. ఎవరివైనా సరే పొట్ట తిప్పలే. కాకపోతే డబ్బున్న వాళ్ళు గొప్పగా తింటారు.. డబ్బు లేని వాళ్ళు వారి స్థాయిలో తింటారు. స్థూలంగా చెప్పాలంటే డబ్బుకొద్దీ తిండి. సంపాదనకొద్దీ రుచులు. అయితే ఇలాంటి రుచులను ఆస్వాదించడంలో మన టీం ఇండియా క్రికెటర్లు ముందు వరుసలో ఉంటారు. అసలే సంపన్నమైన క్రికెట్ బోర్డు.. పైగా టీం ఇండియా క్రీడాకారులు. ఇంకేముంది కోరుకున్న భోజనం.. నచ్చిన సౌకర్యం.. మెచ్చిన సౌలభ్యం అన్ని వాళ్ళ కాళ్ళ మందే ఉంటాయి.

విశాఖపట్నంలో టెస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత టీమిండియా గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ కోట్ వెళ్ళింది. ఇక్కడ జరిగే మూడో టెస్టులో ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఈ క్రమంలో రాజ్కోట్ వచ్చిన టీమిండియా క్రికెటర్లకు అదిరిపోయే ఆతిథ్యం లభించింది. టీమిండియా క్రికెటర్లు బస చేసిన హోటల్లో సంప్రదాయ గుజరాతి వంటకాలను సిద్ధం చేశారు..
జిలేబి, ఖమ్న్, ఫప్డా ఖాఖ్రా, గథియా, తెప్లా, దహి టికారి, వఘెరెల రోటీ, కదీనీ వంటి వంటకాలను మెనూలో చేర్చారు. డిన్నర్ లో కూడా సంప్రదాయ గుజరాతి వంటకాలను టీం ఇండియా క్రికెటర్లకు వడ్డించనున్నారు.” భారత క్రికెటర్లకు అద్భుతమైన ఆతిథ్యం అందించాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా కొత్తదనం ఉట్టి పడే విధంగా హోటల్ లోని గదులను తీర్చిదిద్దాం. మన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా డెకరేట్ చేసామని” హోటల్ డైరెక్టర్ ఉర్వేశ్ పురోహిత వివరించారు.

హైదరాబాదులో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ విజయం సాధించగా.. విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ఇక రాజ్కోట్ వేదికగా జరిగే మూడవ టెస్ట్ పై ఇరు జట్లు కన్నేశాయి. అయితే ఇరు జట్ల ఆటగాళ్ళను గాయాలు వేధిస్తున్నాయి. ఇప్పటికే ఇంగ్లాండ్ స్పిన్నర్ జాక్ లీచ్ గాయం కారణంగా సీరీస్ మొత్తానికే దూరమయ్యాడు. టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ ఈ టెస్ట్ మ్యాచ్లో ఆడతారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, రజత్ పాటిదార్ రాణిస్తున్నారు. సీనియర్ల స్థానాలను భర్తీ చేస్తున్నారు. మరి మూడవ టెస్టులో వీరు ఏ స్థాయిలో ఆడతారో వేచి చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version