Dulip trophy: పెద్ద పెద్ద మైదానాల్లో ఆడే టీమిండియా క్రికెటర్లకు.. అనంతపురంలో ఏం పని?

దులీప్ ట్రోఫీకి అనంతపురం జిల్లాలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్టేడియం, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆతిథ్యం ఇస్తున్నాయి. టీమ్ - ఏ, టీమ్ - బీ మధ్య తొలి మ్యాచ్ మాత్రమే బెంగళూరులో జరుగుతుంది. మిగతా ఐదు మ్యాచ్ లు అనంతపురం వేదికగా జరుగుతాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : August 16, 2024 7:19 pm

Duleep Trophy matches in Anantapur

Follow us on

Dulip trophy: టీమిండియా ఆటగాళ్లు పెద్దపెద్ద మైదానాలలో ఆడుతారు. జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటారు. మ్యాచ్ లు లేనప్పుడు ప్రత్యేకంగా రూపొందించిన నెట్స్ లో సాధన చేస్తుంటారు. కానీ అలాంటి ఆటగాళ్లు అనంతపురంలో కనిపిస్తే.. అనంతపురంలోని మైదానంలో టెస్ట్ క్రికెట్ ఆడితే.. చదువుతుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ.. కానీ ఇది త్వరలో నెరవేరుతుంది. ఎందుకంటే దేశవాళీ క్రికెట్ లో కీలకమైన టోర్నీ అయిన దులీప్ ట్రోఫీని అనంతపురంలో నిర్వహించనున్నారు. సెప్టెంబర్ ఐదున ఈ టోర్నీ ప్రారంభం కానుంది. అనంతపురం తో పాటు బెంగళూరులోనూ ఈ టోర్నీ నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. అయితే ఈ టోర్నీలో బీసీసీఐ గత సంప్రదాయానికి భిన్నంగా వ్యవహరించనుంది. అగ్రశ్రేణి క్రికెటర్లతో నాలుగు జట్లను ఎంపిక చేయనుంది..

ఈసారి పూర్తిగా మార్చేశారు

వాస్తవానికి ప్రతి ఏడాది దులీప్ ట్రోఫీ జరుగుతుంది. ఇందులో ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, సెంట్రల్, నార్త్ ఈస్ట్ జోన్లు తలపడతాయి. కానీ ఈసారి భారత జట్టులోని కీలక ఆటగాళ్లతో A,B,C,D జట్లను సెలెక్టర్లు రూపొందించారు.. గత ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయిన నేపథ్యంలో.. ఈసారి ఎలాగైనా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో గెలిచి, గదను దక్కించుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు వచ్చే నాలుగు నెలల్లో టీమిండియా 10 టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. దీంతో రెడ్ బాల్ క్రికెట్ కు ఆటగాళ్లను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసే లక్ష్యంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

వారు ఆడతారని ప్రచారం జరిగినప్పటికీ..

దులిప్ ట్రోఫీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ ప్రీత్ బుమ్రా ఆడతారని ప్రచారం జరిగింది. అయితే వారికి విశ్రాంతి ఇచ్చారు. వారు గాయపడితే.. అది టీమిండియా విజయాలపై ప్రభావం చూపిస్తుందని భావించి.. విశ్రాంతి ఇచ్చారు. గిల్, అభిమన్యు ఈశ్వరన్, అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్ ఆధ్వర్యంలో నాలుగు జట్లు పోటీ పడతాయని బీసీసీఐ ప్రకటించింది . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి B జట్టులో చోటు దక్కించుకున్నాడు. శ్రీకర్ భరత్, రికీ భుయ్ D టీమ్ లో స్థానం దక్కించుకున్నారు. హైదరాబాద్ ఆటగాళ్లు మహమ్మద్ సిరాజ్, తిలక్ వర్మ A జట్టులో స్థానం పొందారు. బంగ్లాదేశ్ జట్టుతో సెప్టెంబర్ 19 నుంచి భారత్ రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్ కు ఎంపికైన ఆటగాళ్లు దులీప్ ట్రోఫీలో ఆడలేరు..దులీప్ ట్రోఫీకి అనంతపురం జిల్లాలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్టేడియం, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆతిథ్యం ఇస్తున్నాయి. టీమ్ – ఏ, టీమ్ – బీ మధ్య తొలి మ్యాచ్ మాత్రమే బెంగళూరులో జరుగుతుంది. మిగతా ఐదు మ్యాచ్ లు అనంతపురం వేదికగా జరుగుతాయి. సెప్టెంబర్ 5 నుంచి 8 వరకు team C, team D మధ్య అనంతపురం వేదికగా రెండవ మ్యాచ్ జరుగుతుంది.