Amaravati : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు సీఎం అయ్యారు. పవన్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించారు. 24 మంది మంత్రులు కొలువుదీరారు. ఇప్పుడిప్పుడే పాలన గాడిలో పడుతోంది. చంద్రబాబు అమరావతి రాజధానితో పాటు పోలవరం ప్రాజెక్టును ప్రాధాన్యత అంశాలుగా తీసుకున్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. 2050 నాటికి అమరావతి నగరాన్ని ప్రపంచంలోనే.. ఉన్నత నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. విజన్ 20-20 మాదిరిగానే.. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 నినాదాన్ని అందుకున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు డిసైడ్ అయ్యారు.మేధావులు, పరిశ్రమల ప్రముఖులు సభ్యులుగా ఈ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా ఎక్స్ వేదికగా ప్రకటించారు. శుక్రవారం టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, విజన్ 2047 రూపకల్పన అంశాలపై చర్చించారు. ఏపీలో ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్ లైన్స్ విస్తరణ అంశాలపై ఆయనతో చర్చలు జరిపారు. సోలార్, టెలి కమ్యూనికేషన్స్,ఫుడ్ ప్రాసెసింగ్ ఏర్పాటుపైన చర్చించారు. అనంతరం సిఐఐ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అయ్యారు. నూతన పారిశ్రామిక విధానం ప్రకటించనున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
* అత్యంత ప్రాధాన్యం
అమరావతి రాజధాని నిర్మాణంలో టాటా గ్రూపునకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు. ముఖ్యంగా అమరావతిలో సీఐ ఏర్పాటు చేయనున్న జి ఎల్ సి లో భాగస్వామిగా ఉండేందుకు టాటా గ్రూప్ అంగీకరించినట్లు చంద్రబాబు ప్రకటించారు. సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఆన్ కాంపిటేటివ్ నెస్ లో టాటా భాగస్వామిగా ఉంటుందని వివరించారు.
* విశాఖ అభివృద్ధి పై ఫోకస్
ఇక విశాఖ అభివృద్ధిపై కూడా చంద్రబాబు దృష్టి పెట్టారు. అందులో భాగంగా టిసిఎస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు చంద్రబాబు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అందుకే నియమించినట్లు కూడా వివరించారు. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ ఈ టాస్క్ ఫోర్స్ కు కో చైర్మన్ గా వ్యవహరిస్తారని కూడా చంద్రబాబు ప్రకటించారు. ముఖ్యంగా టూరిజం ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు స్పష్టమైంది.
* పెట్టుబడుల ఆకర్షణ
ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 15000 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇటీవల ప్రపంచ బ్యాంకు బృందం ఒకటి అమరావతిని సందర్శించింది. వీలైనంత త్వరగా ఆ నిధుల విడుదలకు ఆ బృందం ఆమోదముద్ర వేసింది. అదే సమయంలో చంద్రబాబు స్వయంగా పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. టాటా గ్రూప్ సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు. అందుకే చంద్రబాబు పిలుపునకు టాటా గ్రూప్ స్పందించింది. అమరావతి రాజధాని నిర్మాణం తో పాటు ఏపీ అభివృద్ధిలో కూడా భాగస్వామ్యం కావాలని భావిస్తోంది. మొత్తానికైతే పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో ముందుగా టాటా గ్రూపును చంద్రబాబు ఒప్పించగలగడం శుభ పరిణామం.