Concussion Substitute : వాస్తవానికి పూణే మ్యాచ్ జరుగుతున్నప్పుడు హర్షిత్ తుది జట్టు జాబితాలో లేడు. అయితే భారత్ ఇన్నింగ్స్ సమయంలో శివం దూబే బ్యాటింగ్ చేస్తున్నప్పుడు.. అతడి హెల్మెట్ కు బంతి బలంగా తగిలింది. దీంతో శివం దూబే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ సమయంలో ఆడలేదు. దీంతో అతడి స్థానంలో హర్షిత్ ను భారత జట్టు తీసుకుంది. వచ్చిన అవకాశాన్ని హర్షిత్ సద్వినియోగం చేసుకున్నాడు. 4 ఓవర్లు బౌలింగ్ వేసి.. 33 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. హర్షిత్ ను టీమిండియా మేనేజ్మెంట్ కంకషన్ సబ్ స్టిట్యూట్ గా తీసుకుంది. అయితే దీనిపై ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం అతడు కీలక వ్యాఖ్యలు చేశాడు.. టీమిడియా చేసిన రీప్లేస్మెంట్ సరికాదని.. మేము దానితో ఏకీభవించడం లేదని పేర్కొన్నాడు.. క్రికెట్ నిబంధనల ప్రకారం కంకషన్ సబ్ స్టిట్యూట్ గా ఒక ఆటగాడికి బదులుగా మరొకరిని ఆడేందుకు అనుమతించవచ్చు. అయితే బ్యాటర్ స్థానంలో బ్యాటర్.. బౌలర్ స్థానంలో బౌలర్.. ఆల్ రౌండర్ స్థానంలో ఆల్ రౌండర్ కు అవకాశం ఉంటుంది. జట్టు విజ్ఞప్తి చేస్తే ఐసీసీ రిఫరీ పరిశీలించి.. తుది నిర్ణయం తీసుకోవాలి. అయితే ఇక్కడ ఐసీసీ రిఫరీదే తుది నిర్ణయం. ఇక్కడ ప్రత్యర్థి జట్టు అప్పీల్ చేయడానికి అవకాశం ఉండదు. కానీ ఈ నిబంధనలు తెలియకుండా ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ వ్యాఖ్యలు చేయడం విశేషం.
హర్షిత్ ఏమన్నాడంటే..
టీమిండియా పూణే టి20 మ్యాచ్ లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో.. హర్షిత్ స్పందించాడు..” నేను డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్నాను. శివం దుబే కూడా అక్కడికి వచ్చాడు. అతడు వచ్చిన రెండు ఓవర్ల తర్వాత నాకు సమాచారం వచ్చింది. కంకషన్ సబ్ స్టిట్యూట్ గా ఆడేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు.. నేను కేవలం ఈ ఒక్క మ్యాచ్లో మాత్రమే కాదు.. చాలా సంవత్సరాల పాటు టీమిండియా తరఫున t20 లో ఆడాలని అనుకున్నాను. ఎలాగైనా నాకు దక్కిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించాను. ఐపీఎల్ లో నా వంతు ప్రదర్శన చేశాను. ఫలితాన్ని రాబట్టాను. ఇక్కడ కూడా మెరుగైన ఫలితాన్ని సాధించానని భావిస్తున్నాను. ఇకపై జట్టులో పూర్తి స్థాయిలో ఆడాలని నిర్ణయించుకున్నాను. ఆ దిశగానే నా అడుగులు వేస్తున్నాను. జట్టు కోసం ఆడటంలో మజా ఉంటుంది. ప్రస్తుతం ఆనందాన్ని అనుభవిస్తున్నాను. పూణేలో జరిగిన మ్యాచ్లో నా వంతు పాత్ర పోషించాను. జట్టు విజయంలో భాగమయానని” హర్షిత్ వ్యాఖ్యానించాడు.