చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ 2020 సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా అనూహ్యంగా తప్పుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి రైనా తప్పుకున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కేఎస్ విశ్వనాథన్ ప్రకటించాడు. దాంతో.. ఆ కారణాలేంటి..? అని పెద్ద ఎత్తున అభిమానులు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీని ప్రశ్నించడంతో.. ఎట్టకేలకు సమాధానం లభించింది.
టీం ఇండియా క్రికెటర్ సురేశ్ రైనా సంచలన ప్రకటన చేసి ఇప్పుడు హాట్‌టాపిక్ అయ్యారు. ఐపీఎల్ నుంచి తప్పుకుంటూ ఇటీవలే సంచలన నిర్ణయం ప్రకటించి అప్పటి నుంచి సైలెంట్ ఉండిపోయిన ఈ క్రికెటర్ తాజాగా ‘నా కుటుంబసభ్యుల్ని ఎందుకు చంపుతున్నారు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొద్దిసేపటి క్రితమే రెండు ట్వీట్లు చేసిన ఆయన పంజాబ్‌లో తమ కుటుంబంలో చోటుచేసుకున్న దుర్ఘటనపై స్పందించాడు.
‘పంజాబ్‌లో మా కుటుంబానికి జరిగింది దారుణం కాదు ఘోరమని అనాలి. మా మామయ్య హత్యకు గుయ్యారు. మేనత్త, వాళ్ల ఇద్దరు కొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. దురదృష్టం కొద్దీ గత రాత్రి ఒక సోదరుడు కన్నుమూశాడు. ఇప్పటికీ అత్తయ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆమె వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు’ అంటూ ఫస్ట్ ట్వీట్ చేయగా.. ‘ఆ రోజు రాత్రి ఏం జరిగిందనే విషయం మీద మాకు ఎవరికీ ఎలాంటి సమాచారం లేదు. ఎవరు..? ఎందుకు ఇలా చేశారో కూడా తెలియదు. దీనిపై పోలీసులు ఎంక్వైరీ చేయాలి. ఆ నేరస్తులను పట్టుకోవాలి’ అంటూ మరో ట్వీట్ చేశారు. దీనికి పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను కూడా ట్యాగ్ చేశారు.
రైనా ఐపీఎల్ నుంచి తప్పుకోవడానికి ఈ విషాద ఘటనలే కారణమా..? లేక మరే కారణాలేమైనా ఉన్నాయా తెలియకుండా ఉంది. మరోవైపు దుబాయిలో అతడికి కేటాయించిన హోటల్‌లో గది నచ్చక జట్టుతో విభేదాలు వచ్చి తప్పుకున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యజమాని శ్రీనివాసన్ కూడా రైనా మీద అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా రైనా తీసుకున్న నిర్ణయంతో యావత్ క్రికెట్ అభిమానులు అయితే ఇంకా షాక్‌లోనే ఉన్నారు.