Rohith Sharma : పెర్త్ టెస్ట్ లో అన్ని విభాగాలలో అదరగొట్టిన టీమిండియా.. అడిలైడ్ టెస్టులో మాత్రం దారుణంగా విఫలమైంది. భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ.. రోహిత్, విరాట్ కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ లాంటి ఆటగాళ్లు చేతులెత్తేశారు.. దీంతో భారత్ సమర్థవంతంగా ఆడలేకపోయింది. అత్యంత స్వల్ప స్కోర్ నమోదు చేసింది. దూకుడుగా ఆడాల్సిన చోట.. ధైర్యంగా నిలబడాల్సిన చోట.. ఆస్ట్రేలియా బౌలర్ల ఎదుట తలవంచింది. ఫలితంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి రెండవ ఇన్నింగ్స్ లో 42 పరుగులు చేయకపోతే.. టీమిండియా అత్యంత దరిద్రమైన రికార్డును నమోదు చేసుకునేది. రెండవ రోజు రెండవ ఇన్నింగ్స్ ముగిసే సమయానికి భారత్ అప్పటికే 5 వికెట్ల కోల్పోయి 128 పరుగులు చేసింది. అయితే రిషబ్ పంత్ మధ్యలోనే అవుట్ కావడంతో.. జట్టు భారం మొత్తం నితీష్ కుమార్ రెడ్డి మీద పడింది. వచ్చిన అవకాశాన్ని అతడు దాదాపుగా సద్వినియోగం చేసుకున్నాడు. 47 బంతుల్లో 42 పరుగులు చేశాడు. అయితే దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించి అతడు అవుట్ అయ్యాడు. మొత్తంగా ఆస్ట్రేలియా ఎదుట భారత్ విధించిన 18 పరుగుల లక్ష్యాన్ని.. కంగారు జట్టు ఆడుతూ పాడుతూ చేదించింది. అయితే ఈ ఓటమి టీమిండియా కే కాదు.. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా దారుణమైన పరాజయాన్ని మిగిల్చింది. అంతేకాదు అతడు ఊహించని జాబితాలో చోటు సంపాదించేలా చేసింది. టెస్టులలో వరుసగా అత్యధిక పరాజయాలను చవిచూసిన మూడవ కెప్టెన్ గా ధోని, విరాట్, దత్త గైక్వాడ్ సరసన రోహిత్ నిలిచాడు. రోహిత్ ఆధ్వర్యంలో ఇటీవల న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మూడు టెస్టుల సిరీస్లో టీమిండియా ఓడిపోయింది. టీమిండియా తన టెస్ట్ క్రికెట్ చరిత్రలో స్వదేశంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచులలో ఓడిపోవడం అది తొలిసారి. ఇక వ్యక్తిగత కారణాలవల్ల రోహిత్ పెర్త్ టెస్టుకు దూరమయ్యాడు. అయితే బుమ్రా ఆధ్వర్యంలో టీమిండియా ఆస్ట్రేలియాను 295 పరుగుల తేడాతో ఓడించింది. ఆ తర్వాత అడిలైడ్ టెస్ట్ కు నాయకత్వ బాధ్యతను తిరిగి రోహిత్ అందుకున్నాడు. అయితే ఈ మ్యాచ్లో భారత్ 10 వికెట్ల తేడాతో ఓడిపోవడం విశేషం..
అత్యంత దారుణమైన రికార్డు
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా చేతిలో ఏదైనా ఓటమి ద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ అత్యంత దారుణమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టులలో హైయెస్ట్ ఓటములను వరుసగా ఎదుర్కొన్న భారత సారధుల లిస్టులో మన్సూర్ అలీ ఖాన్ పటౌడి తొలి స్థానంలో ఉన్నాడు. 1967-68 కాలంలో ఇతడు ఆధ్వర్యంలో టీమిండియా ఆరు ఓటములు ఎదుర్కొంది. 1990 నుంచి 2000 వరకు సచిన్ టెండూల్కర్ టీమ్ ఇండియాకు నాయకత్వం వహించాడు. అతని ఆధ్వర్యంలో టీమిండియా 5 ఓటములు ఎదుర్కొంది. ఓటములపరంగా సచిన్ రెండవ స్థానంలో ఉన్నాడు. 1959లో దత్త ఆధ్వర్యంలో టీమిండియా నాలుగు ఓటములు ఎదుర్కొంది. 2011లో ధోని నాయకత్వంలో టీమిండియా నాలుగు ఓటములు చవిచూసింది.. 2014లోనూ నాలుగు ఓటములను ఎదుర్కొంది. విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్నప్పుడు 2020 -21 సీజన్లో నాలుగుసార్లు ఓడిపోయింది.. రోహిత్ శర్మ ఆధ్వర్యంలో టీమ్ ఇండియా 2024లో 4 ఓటములను చవిచూసింది. అయితే ఈ ఓటమి ద్వారా రోహిత్ ఊహించని చెత్త రికార్డు అతడి పేరు మీద నమోదయింది. ఈ నాలుగు టెస్ట్ మ్యాచ్లలో రోహిత్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒకటి కూడా ఆడలేదు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. అనామకమైన బౌలర్ల చేతిలో అవుట్ అయ్యాడు. కెరియర్ చివరి దశలో అతడు ఇలా ఆడుతుండడం అభిమానులకు అంతుచిక్కడం లేదు. ఇప్పటికైనా రోహిత్ తన ఆట తీరు మార్చుకోవాలని అభిమానులు కోరుతున్నారు.